ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి , వైఎస్సార్ బంధుత్వం తెలుసా?

By Karthik P Jul. 20, 2021, 07:31 pm IST
ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి , వైఎస్సార్ బంధుత్వం తెలుసా?

ఒకేసారి 135 నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం.. అప్పటి వరకు తెర వెనుక ఉన్న వారిని తెరపైకి తెచ్చింది. రాజకీయాల్లో ఏళ్లతరబడి ఉన్నా.. పార్టీ కోసం పని చేస్తూ సంతృప్తిపడుతున్న వారికి పదవులు కట్టబెట్టిన జగన్‌ వారిని రాష్ట్రానికి పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి నియమితులయ్యారు. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మల్లికార్జున రెడ్డి రాష్ట్ర స్థాయి పదవి చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఎవరీ మల్లికార్జున రెడ్డి..

వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డికి ఊరి పేరునే ఇంటి పేరుగా మారింది. మల్లికార్జున రెడ్డి మృదుస్వభావిగా, అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతగా జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మల్లికార్జున రెడ్డిల మధ్య బంధుత్వం ఉంది. వైఎస్‌ విజయమ్మ సోదరి(చిన్నాన కూతురు)ను మల్లికార్జున రెడ్డి వివాహం చేసుకున్నారు. మల్లికార్జున రెడ్డికి ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు ఉన్నా కాంగ్రెస్‌లోనూ, వైసీపీలోనూ పార్టీ పనులకే పరిమితమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read : ఏపీఐఐసీ పదవితో ‘మెట్టు’ ఎక్కించిన జగన్-మాజీ ఎమ్మెల్యే ను వరించిన పదవి

వైఎస్‌ రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూ..

వైఎస్‌ రాజశేఖర రెడ్డి లోక్‌సభకు పోటీ చేసిన సమయాల్లో కమలాపురం నియోజకవర్గంలో రాజకీయ వ్యవహారాలన్నింటినీ మల్లికార్జున రెడ్డే చక్కబెట్టేవారు. ఇదే నియోజకవర్గం నుంచే మైసూరారెడ్డి, వీర శివారెడ్డిలు ప్రాతినిధ్యం వహించారు. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ నష్టపోకుండా అందరినీ కలుపుకుని ఎన్నికల వ్యవహారాలను పూర్తి చేసేవారు. సాధారణ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి కమలాపురం నియోజకవర్గంలో పని చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ బలమైన నేతగా పేరొందారు. వైఎస్‌ హాయంలో 2004లో పోటీ చేసే అవకాశం వచ్చినా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పుత్తా నరసింహారెడ్డికి ఇవ్వాలని సూచించారు.

వైసీపీలోనూ నియోజకవర్గ బాధ్యతలు..

వైసీపీ అవిర్భావం తర్వాత ఆ పార్టీ కమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా మల్లికార్జున రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2014లో మల్లికార్జున రెడ్డి పోటీ చేయాల్సి ఉండగా.. పి.రవీంద్రనాథ్‌ రెడ్డి కోసం వదులుకున్నారు. ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్‌ రెడ్డి, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా మల్లికార్జున రెడ్డిలు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.

2014, 2019 రెండు ఎన్నికల్లోనూ రవీంద్రనాథ్‌ రెడ్డి గెలుపు కోసం మల్లికార్జున రెడ్డి పని చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ప్రజా సమస్యలపై నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. 90 శాతం పనులు జరిగిన సర్వారాయ ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్‌తో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డితో కలసి పాదయాత్ర చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ పనులకే పరిమితమైన మల్లికార్జున రెడ్డి.. తొలిసారి పదవిని చేపట్టబోతున్నారు.

Also Read : మళ్ల విజయ్ ప్రసాద్ కు మళ్లీ వెలుగు..ఫలించిన నిరీక్షణ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp