కరోనా ఎఫెక్ట్‌.. ఏపీ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా

By iDream Post Mar. 25, 2020, 05:54 pm IST
కరోనా ఎఫెక్ట్‌.. ఏపీ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా

కరోనా వైరస్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలపై కూడా పడింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశం మొత్తం లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడం అనివార్యమైంది.

ఈ నెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. వచ్చే ఆర్థిక ఏడాది 2020–21కి అవసరమైన బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. రూపొందించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చ అనంతరం ద్రవ్య బిల్లుకు అసెంబ్లీ ఆమోదంతో సమావేశాలు నిరవధిక వాయిదా పడతాయి. కానీ వైరస్‌ వల్ల సమావేశాలు వాయిదా పడడంతో ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆర్థిక నిపుణులతో చర్చిస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు వెళ్లడమా..? లేక ఆర్డినెన్స్‌ తీసుకురావడమా..? అనే అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు జరగాల్సిన సమావేశాలు సోమవారంతో అర్థంతరంగా ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 26వ తేదీన 17 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు ఆగిపోయాయి. వీటిని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రకటిస్తామంది. తాజాగా ఆ జాబితాలోకి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు చేరాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp