రాజకీయులకు తప్పని ‘కష్టాలు’

By Jaswanth.T Jun. 06, 2021, 04:00 pm IST
రాజకీయులకు తప్పని ‘కష్టాలు’

సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీదవి అని ఓ సామెత ఒకటి ఉంటుంది. సీతను, పీతను పోల్చడం అభ్యంతరకరమే అయినప్పటికీ ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి కష్టాలుంటాయని చెప్పడానికి తరచు ఈ ఉపమానాన్ని మాటల మధ్యలో వాడేస్తుంటారు. ఓ పక్క కోవిడ్‌ కారణంగా సర్వ రంగాలు దిగు చూపులే చూస్తున్నాయి. అందుగలడు.. ఇందులేడన్నట్టుగానే.. దాదాపుగా అన్ని రంగాల పరిస్థితి పాతాళంవైపే పరుగులు పెడుతోందనే చెప్పాలి. ఈ కోవలో రాజకీయ నాయకులను కూడా చేర్చాయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే.. కరోనా ఏ స్థాయిలో వ్యవస్థలను ఇబ్బంది పెడుతుందో అర్ధం చేసుకోవచ్చు.

ఏ మాత్రం సందు, అవకాశం దొరికినా కనీసం పబ్లిసిటీ వరకైనా తెగించేసే రాజకీయ నాయకులు కోవిడ్‌ కారణంగా దాదాపు 90 రోజుల పైమాటే జనానికి.. ఆ మాటకొస్తే సొంత అనుచర గణానికి కూడా దూరమైపోయారు. కొందరు నాయకులైతే కనీసం ఎక్కడ ఉన్నారో కూడా సమాచారం చెప్పకుండా అంతా ఫోనులోనే వ్యవహారాలు నడిపించేసారు. ఇంకొందరైతే ఏకంగా గేట్లకు తాళాలు సైతం వేసేసుకుని అటువైపు నాయకులు.. ఇటువైపు కార్యకర్తలు నించునే మాట్లాడేసుకునే పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులకు కొంచెం మినహాయింపు తీసుకున్నారనుకోండి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏదో ఒక రూపంలో ప్రజల ముందుకు వచ్చేందుకు ఆ పార్టీ నాయకులు సాహసం చేసారు. ఇక మిగిలిన పార్టీల నాయకులైతే పాక్షిక అజ్ఞాత వాసమే అమలు చేసేసారనే చెప్పాలి. ఎన్నికల ప్రచారాలు పూర్తయిన తరువాత జనజీవన స్రవంతికి దాదాపు దూరమైపోయారనే చెప్పాలి. ఇక్కడ వారిని కూడా తప్పుపట్టేందుకు లేదు. తోటి నాయకులు కోవిడ్‌ కారణంగా ఇబ్బందులు పడడం, కొందరు ప్రాణాలే కోల్పోవడం వంటి వాటిని చూసి వీలైనంత ఎక్కువగా జాగ్రత్తలు పాటించడం మొదలెట్టారు. పదవుల్లో ఉన్న నాయకులు తమ పదవీ కాలంలో ఈ కరోనా గండం ఏంట్రాబాబూ అని తలలు పట్టుకున్నవారూ లేకపోలేదు. ఏదో రూపంలో ప్రజలకు సాయపడదామని ఆశ ఉన్నప్పటికీ.. బైట ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆలోచనకు తాత్కాలికంగా బ్రేకులు వేసేయాల్సి వచ్చింది.

దీనికి తోడు ఆసుపత్రులు, బెడ్లు, ఆక్సిజన్‌.. ఇలా అనేకానేక పరిష్కృత సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటుండడంతో, దాదాపు జనానికే కాకుండా అనుచరులకు కూడా దూరంగానే వ్యవహరించారనే చెప్పాలి. కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండకుండా ఇలా అజ్ఞాతవాసం చేయడం పట్ల విమర్శలు రేకెత్తినప్పటికీ వాటిని గురించి పెద్దగా పట్టించుకోకుండానే నాయక గణం కాలం గడిపేసారు. నెమ్మదిగా కోవిడ్‌ పాజిటివ్‌లు తగ్గడం ప్రారంభమైన నేపథ్యంలో ఇకపైనైనా నాయకులు బైటకు వస్తారన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఏదైనా ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతిపక్షాలకు భారీగానే పనిదొరుకుతుంది. నేరుగా ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయి.. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు శాయశక్తులా కృషి చేయడం జరుగుతుంటుంది. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. తమదైన వాయిస్‌ను విన్పిస్తుంటారు. అయితే కరోనా ఆ అవకాశాన్ని ఇచ్చే రకం కాకపోవడంతో జూమ్‌లు.. ట్విట్టర్లు.. ఫేస్బుక్‌లకు ప్రతిపక్షాలు పరిమితమైపోయాయి. దీనికి తోడు కోవిడ్‌ ఉధృతిని ఎదుర్కొనేందుకు ఇతర రాష్ట్రాలకు మిన్నగా ఏపీలో సీయం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుని విమర్శలకు కూడా అవకాశం లేకుండా చేసేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ప్రజల్లో కన్పించేందుకు కూడా అవకాశం దొరకని గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కోవిడ్‌ సమయంలో కూడా కొందరు నాయకులు ప్రజలకు తమ సేవలను కొనసాగించిన వారు కూడా ఉన్నారు. టెస్టులు, మెడికల్‌ కిట్‌లు.. ఇలా తమకు వీలైనంత సాయం అందించేందుకు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నవారు కూడా లేకపోలేదు. కాకపోతే అత్యధికశాతం మంది మాత్రం ప్రజలు దూరంగానే గడిపేసారనేది వాస్తవం. నెమ్మదిగా పరిస్థితులు నెమ్మదిస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రజాసేవకు మరోసారి ప్రజల ముందుకు వచ్చేందుకు.. ఇప్పటి వరకు అజ్ఞాత వాసం గడిపిన నాయకులు సమాయత్తం కానున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp