2007 ను గుర్తుచేసుకుంటున్న ఏపీ ప్రజలు.. అప్పుడు ఏమి జరిగింది..?

By Kotireddy Palukuri Feb. 15, 2020, 12:45 pm IST
2007 ను గుర్తుచేసుకుంటున్న ఏపీ ప్రజలు.. అప్పుడు ఏమి జరిగింది..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 2007 ను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు తమకు లభించిన ఆరోగ్య భరోసాను మననం చేసుకుంటున్నారు. 2007లో ఏప్రిల్‌లో దివంగత ముఖ్యమంత్రి దేశంలోనే తొలిసారిగా పేద ప్రజలకు కార్పొరేటర్‌ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కోసం వైఎస్సార్‌ ప్రభుత్వం అప్పట్లో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసింది. వైఎస్సార్‌ మరణం తర్వాత పథకం కుంటుపడింది. పథకంతోపాటు కార్డులు కూడా మాయమయ్యాయి. ప్రజల్లో వైద్య భరోసా తగ్గింది.

దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ వైఎస్సార్‌ పాలనా రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తయనుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. తండ్రి ఆశయాలను కొనసాగించేలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి మరింత మెరుగులు దిద్దారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా నిబంధనలను మరింత సరళతరం చేశారు. ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టుకు జనవరి 3వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది.

వచ్చే ఆర్థిక ఏడాది(ఏప్రిల్‌) నుంచి వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలుదాటితే.. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఏప్రిల్‌ నుంచి నెలకొక జిల్లా చొప్పున విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి అర్హులైన వారికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం జారీ చేయడం ప్రారంభించింది. గతంలో తెల్లరేషన్‌ కార్డుదారులు మాత్రమే అర్హులు కాగా.. జగన్‌ ప్రభుత్వం మరింత మందికి మేలు చేకూరేలా.. దాని పరిమితిని పెంచింది. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న అన్ని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మొత్తం కుటుంబాలు రాష్ట్రంలోని కుటుంబాల్లో 95 శాతం కావడం డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఏపీ ప్రజలు ఏ స్థాయిలో లబ్ధి పొందుతుందో అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలు ఇవీ..

– గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలో 1000 వ్యాధులకు చికిత్స ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2059కు పెంచారు.

– ఆస్పత్రి ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.

– హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని 150 ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందొచ్చు.

– ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న రోగి కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు 225 రూపాయలు లేదా నెలకు 5 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. (విశ్రాంతి సమయం డాక్టర్‌ నిర్ణయిస్తారు.)

– క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తింపు.

– పుట్టుకతో వినికిడి లోపం ఉన్న పిల్లల రెండు చెవులకు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకునే సౌలభ్యం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp