ఢిల్లీకి 3 కోట్ల లీటర్ల పాలు ఎందుకు..? !

By Voleti Divakar Sep. 29, 2020, 09:00 am IST
ఢిల్లీకి 3 కోట్ల లీటర్ల పాలు ఎందుకు..? !

ఈ కరోనా కాలంలో రాష్ట్రం నుంచి దేశ రాజధాని డిల్లీకి ఏకంగా 3 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేశారు. లాక్ డౌన్ సమయంలో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో పాలు, ఇతర ఉత్పత్తుల రవాణా స్తంభించి, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలను రవాణా చేసేందుకు రైల్వేశాఖ దూద్ దురంతో పేరిట డిల్లీకి ప్రత్యేక రైళ్లను నడిపింది. ఎపిలోని రేణిగుంట నుంచి డిల్లీ సమీపంలోని హజరత్ నిజాముద్దీన్ కు పాల ట్యాంకర్లతో కూడిన దూద్ దురంతో రైళ్లను నడిపారు.

పాలు చెడిపోకుండా 34 గంటల్లోనే ఈ రైళ్లు డిల్లీకి చేరుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్చి నుంచి ప్రతీరోజూ ఈ రైళ్లను నడిపారు. ఒక్కోటి 40వేల లీటర్ల చొప్పున సామర్థ్యం కలిగిన 6 ట్యాంకర్లతో ఈరైలును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 751 పాల ట్యాంకర్లతో 3కోట్ల లీటర్ల పాలు రవాణా చేశారు.

కరోనా సమయంలో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా పాల వినియోగాన్ని సమతుల్యం చేయడంలో డిల్లీ నగరం ప్రధాన కేంద్రంగా నిలిచింది. చిత్తూరు జిల్లా రేణిగుంట పరిసర 13వేల గ్రామాల నుంచి పాల సేకరణలో డైరీ డెలవప్మెంట్ బోర్డు సమన్వయం చేసింది. సుమారు 3 వేల పాల కేంద్రాల ద్వారా బోర్డు పాల సేకరణకు చర్యలు తీసుకుంది.

కాగా, రేణిగుంట నుంచి కాచిగూడ మీదుగా డిల్లీ, ఉత్తర భారతంలోని ఇతర నగరాలకు కూరగాయలు, నిత్యావసరాలు, ఇతర సరుకులను కూడా పెద్ద ఎత్తున రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp