ట్విట్టర్ కలుపుతుందా ... ఆ ఇద్దరినీ !

By Voleti Divakar Apr. 17, 2021, 08:45 am IST
ట్విట్టర్ కలుపుతుందా ... ఆ ఇద్దరినీ !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఈ మధ్య విపరీతమైన మార్పు కనిపిస్తోంది . ఈ మార్పునకు కారణమేంటో పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు . 2019 లో తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు ఆయన వైఖరిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి . తిరుపతి ఉప ఎన్నికల సమయంలో కూడా ప్రత్యేకహోదా , విశాఖ స్టీల్ ప్లాంటు , పెట్రోలు , డీజిల్ ధరల గురించి కేంద్రంలోని బిజెపిని ప్రశ్నించకుండా వంత పాడటం , కరోనాకు గురైన ఆపార్టీ నేతలు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించడం చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి . 

ట్విట్టర్ రాయబారాలా

చంద్రబాబునాయుడు 2019 ఎన్నికలకు ముందు వరకు బిజెపిని , ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా తూర్పారబట్టిన సంగతి నిజమైన బిజెపి కార్యకర్తలు , నేతలు ఎవరూ మర్చిపోలేరు . అలాంటి చంద్రబాబునాయుడు ఎక్కడో డిల్లీలో ఉండే కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది . కరోనాకు గురైన పవన్ కల్యాణ్ కూడా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు . సాధారణంగా ప్రతీరోజూ చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పార్టీ కార్యకర్తలకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటారు . అలాగే అనారోగ్యానికి గురైన కార్యకర్తలు త్వరగా కోలుకోవాలన్న సందేశాలు , సంతాపాలు ప్రకటిస్తారు . పార్టీ కార్యక్రమాలను , విమర్శలను తన ట్విట్టర్‌లో వెల్లడిస్తుంటారు . ఇతర పార్టీల నేతల ఆరోగ్యం గురించి , వారి బాగోగుల గురించి చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు .

బిజెపి అడుగుతోంది ... చెప్పండి

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబునాయుడు బిజెపి తరుపున వకాల్తాపుచ్చుకున్నట్లు మాట్లాడటం చర్చనీయాంశమైంది . వైసిపి అభ్యర్థి గురుమూర్తి మతం గురించి బిజెపి నేతలు రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు . విలేఖర్ల సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గురుమూర్తి క్రైస్తవుడని , ఎస్సీగా ఎలా గుర్తిస్తారని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు . ఎస్సీ నియోజకవర్గం నుంచి క్రైస్తవుడైన బిసి వ్యక్తిని ఎలా నిలబెట్టారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు .

బాబులో మార్పునకు కారణం ఇదేనా ?

ఆంధ్ర ప్రదేశ్ లోని టిడిపి నేతలు అధికార పార్టీలోకి వరుసగా వలసలు వెళ్లడం , ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలువడం వంటి పరిణామాలతో చంద్రబాబు బిజెపి విషయంలో కాస్త పునరాలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది . జెడ్పీటిసి , ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయాన్ని పార్టీ నేతలు , కార్యకర్తలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే . తిరుపతిలో కూడా తాము గెలుస్తామన్న ఆశలు అధినేతతో సహా కార్యకర్తలకు కూడా లేవు . ఈ విషయాన్ని టిడిపి అధ్యక్షుడు కె అచ్చెంనాయుడు నర్మగర్భంగా చెబుతూ వీడియోకు చిక్కి ఇబ్బందులు పడుతున్నారు.

డిల్లీలో దోస్తీ ..... ఎపిలో కుస్తీ

కరుడుగట్టిన టిడిపి వారుగా గుర్తింపు పొందిన ముగ్గురు ఎంపిలు బిజెపిలో చేరిపోయినా బాబు నోరుమెదపలేదు . డిల్లీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎంపిలు బిజెపికి టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి . ఎంపిలు రామ్మోహననాయుడు , గల్లా జయదేవ్ వంటి నాయకులు పార్లమెంటులో ప్రసంగాల వరకే బిజెపి విమర్శలను పరిమితం చేస్తున్నారు . రాష్ట్రంలో మాత్రం బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు . అధికార వైసిపిని మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు . 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp