టీడీపీ : మళ్లీ అదే నినాదం.. ఆ ఒక్క సీటయినా సాధిస్తుందా..?

By Kalyan.S Nov. 24, 2020, 10:45 am IST
టీడీపీ : మళ్లీ అదే నినాదం.. ఆ ఒక్క సీటయినా సాధిస్తుందా..?

‘సైబరాబాద్‌ను నిర్మించింది నేనే.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే’’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే వల్లె వేస్తారు. సభ అయినా, సమావేశం అయినా ఆ వ్యాఖ్యలు లేకుండా బాబు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇటీవల గ్రేటర్‌లోని టీడీపీ నాయకులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా బాబు ఆ విషయం మళ్లీ చెప్పారు. అదే నినాదంగా ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరి చంద్రబాబు చెప్పేది ప్రజలు విశ్వసిస్తున్నారా..? లేదా..? అనేది మరోసారి గ్రేటర్‌ ఎన్నికల్లో తేలిపోనుంది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం దోస్తీ కట్టింది. టీఆర్‌ఎస్‌ ను ఢీ కొట్టేందుకు రెండు పార్టీలూ కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నాయి. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆయన రాకతో కనీసం హైదరాబాద్‌లోనైనా సీట్లు సాధించవచ్చునని రెండు పార్టీలూ భావించాయి. ఆ వ్యూహంతోనే చంద్రబాబు ఎక్కడ ప్రచారం నిర్వహించినా ‘సైబరాబాద్‌ను నిర్మించింది నేనే.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే’’ అని చెప్పేవారు. తాను వచ్చాకే హైదరాబాద్‌ అంటే ప్రపంచానికి తెలిసిందన్నంత రేంజ్‌లో మాట్లాడేవారు. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతలా కష్టపడినా హైదరాబాద్‌లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయారు.

విచిత్రం ఏంటంటే...

ఆ తర్వాత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. విచిత్రం ఏంటంటే.. చంద్రబాబు నాయుడు అక్కడ కూడా ఈ మంత్రాన్నే అక్కడక్కడ జపించేవారు. హైదరాబాద్‌ అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ అభివృద్ధినే మళ్లీ ప్రచార అస్త్రంగా వాడుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోనే ఆయన చెప్పిన మాటలను అక్కడి ప్రజలు విశ్వసించలేదు. ఇక ఏపీలో తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడితే ఉపయోగం ఉంటుందా..? అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. పాత నినాదంతోనే ప్రస్తుత గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీలో నిలబడింది. ఏకంగా 106 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2016 ఎన్నికల్లోనూ సైబరాబాద్‌ నినాదంతో 95 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒకే ఒక్క సీటును సాధించింది. మరి ఇప్పుడు 106 స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు ఆ ఒక్క సీటయినా సాధిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp