MP Vanga Geetha - రూటు మారుస్తున్న వంగా గీత, తుది నిర్ణయం జగన్ దే

By Raju VS Oct. 23, 2021, 03:15 pm IST
MP Vanga Geetha - రూటు మారుస్తున్న వంగా గీత, తుది నిర్ణయం జగన్ దే

కాకినాడ ఎంపీ వంగా గీత రాజకీయంగా అదృష్టవంతురాలుగా చెబుతారు. సాధారణ అడ్వొకేట్ గా టీడీపీలో ప్రస్థానం ప్రారంభించి ఆమె అనూహ్యంగా 1994లోనే ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అప్పట్లో చంద్రబాబు కోటాలో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి చివరి నిమషంలో వెన్నా నాగేశ్వరరావు అనే సీనియర్ ని ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావుకి బీఫారం దక్కడంతో వంగా గీతకు నిరాశ ఎదురయినట్టే అంతా భావించారు. కానీ ఆ వెంటనే ఏడాది తిరిగే సరికి చంద్రబాబు ఆమెను ఏకంగా జిల్లా పరిషత్ పీఠం మీద కూర్చోబెట్టారు. అప్పట్లో జీఎంసీ బాలయోగి తర్వాత తూర్పు గోదావరి జెడ్పీ పీఠం మీద వంగా గీతకు అవకాశం దక్కడంతో ఆమె సుడి తిరిగినట్టయ్యింది.

ఆ తర్వాత బాబు శిబిరంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. విద్యావంతురాలు కావడంతో రాజకీయ అవగాహనతో మహిళా కోటాలో ఆమె దూసుకుపోయారు. జెడ్పీ చైర్ పర్సన్ పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ రాజ్యసభ అవకాశం వచ్చింది. నేరుగా పార్లమెంట్ లో ఆమె అడుగుపెట్టారు. సుమారు దశాబ్దంన్నర పాటు టీడీపీలో కీలకంగా వ్యవహరించి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి జంప్ అయ్యారు. చిరంజీవి క్యాంపులో ఆమె గుర్తింపు ఉన్న నాయకురాలిగా మారారు. దానికి అనుగుణంగా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. 1994లో చేజారిన ఎమ్మెల్సీ సీటు బీఫారం ప్రజారాజ్యం రూపంలో 2009లో రావడం విశేషం.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ముద్రగడ, టీడీపీ తరుపున ఎస్వీఎస్ఎన్ వర్మ బరిలో ఉన్నప్పటికీ పీఆర్పీ తరుపున గీత గట్టెక్కేశారు. ఆమె తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కాగానే నేరుగా విప్ పదవి ఆమెకు కట్టబెట్టారు. ఐదేళ్ల పాటు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె రాజకీయ భవిష్యత్తుని రాష్ట్ర విభజన దెబ్బతీసింది. కాంగ్రెస్ నేతగా ఉన్న ఆమె అనూహ్యంగా తెరమరుగయ్యారు. 2014 నుంచి 19 వరకూ రాజకీయాలకు దూరమయ్యారు. అదే సమయంలో అనారోగ్యం, ఇతర సమస్యలు రావడంతో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. సరిగ్గా 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే కాపు మహిళా కోటాలో కాకినాడ ఎంపీ టికెట్ ఆమెకు దక్కింది. జగన్ ఆశీస్సులతో ఈసారి ఆమె లోక్ సభలో అడుగుపెట్టారు.

కానీ వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలనే సంకల్పంతో ఆమె ఉన్నారు. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం అసెంబ్లీ స్థానం మీద గంపెడాశతో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా  పెండెం దొరబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి మార్పు అనివార్యం ఐతే వంగా గీత తెరమీదకు రావాలని భావిస్తున్నారు. దానికి జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజంగా అభ్యర్థి మార్పు అనివార్యం అయితే గీతకు జగన్ అవకాశం ఇస్తారా లేదా అన్నదే ప్రస్తుతానికి ప్రశ్న. ఆమె మాత్రం రాష్ట్ర రాజకీయాలల్లో కొనసాగాలనే సంకల్పంతో ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది.

Also Read : Sunkara Pavani - కాకినాడ మాజీ మేయర్‌ పిటిషన్‌ మరో సారి వాయిదా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp