బీజేపీకి బలాన్నిస్తున్న ఎంఐఎం?

By Rishi K Nov. 27, 2020, 03:00 pm IST
బీజేపీకి బలాన్నిస్తున్న ఎంఐఎం?

దేశ రాజకీయాల్లో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ ఎజెండా ఎవరికీ అంతుచిక్కడం లేదు. పాతనగరం దాటి దేశమంతా విస్తరిస్తున్నప్పటికీ తన ప్రయోజనాల కంటే ప్రత్యర్థి పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. గ్రేటర్ వార్ లో ఎంఐఎం వైఖరి చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. ఢీ అంటే ఢీ అంటూ యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. కానీ ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న రాద్దాంతంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ బలాన్ని పెంచేందుకే ఎంఐఎం పనిచేస్తోందంటున్నారు.

గ్రేటర్ లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ పార్టీగా ఎంఐఎంకు గుర్తింపు ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతిసారీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల విజయాన్ని సాధించిన మజ్లిస్, ఈసారి 51 స్థానాల్లో పోటీచేస్తోంది. సుదీర్ఘకాలంగా పాతనగరంపై తన పట్టును నిలబెట్టుకుంటూ వస్తున్న మజ్లిస్.. అదే సమయంలో ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. రాష్ట్రాల సరిహద్దులు దాటి మరీ విజయఢంకా మోగిస్తోంది. తాజాగా బీహార్ ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని తన సత్తా చాటింది. రాబోయే బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతోంది. కానీ... మజ్లిస్ విస్తరణ వెనక బీజేపీ ప్రయోజనాలు దాగున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

బయటి రాష్ట్రాల్లో బీజేపీకి ‘బి' టీంగా విమర్శలు ఎదుర్కొన్న ఎంఐఎం ఇప్పుడు తెలంగాణలోనూ ఇంచుమించు అలాంటి పాత్రే పోషిస్తోందంటున్నారు. ముంబై, బీహార్ లాంటి చోట్ల ప్రధాన ప్రతిపక్షం ఓట్లను చీల్చడానికి ఎంఐఎం దోహదం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీకి కలిసొచ్చే పాత్రను ఎంఐఎం పోషించిందని జాతీయ స్థాయిలో విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ అధికారి పార్టీ అనేకంటే నేరుగా బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేసిందంటేనే సరిగా ఉంటుంది కాబోలు. గ్రేటర్ ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం దూకుడు బీజేపిని హీరోని చేస్తోంది. నిజానికి మజ్లిస్ పార్టీకి గ్రేటర్ లో మంచి పట్టుంది. ఎంతలా అంటే, ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించకుండా విజయతీరాలకు చేరగలిగేంత. మేనిఫెస్టో లేకుండా, ఉచిత హామీలు ఇవ్వకుండానే ఎంఐఎం పాతనగరంలో ప్రతిసారీ విజయాన్ని దక్కించుకుంటోంది. ఈ సారి కూడా ఎంఐఎం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో షహెర్‌ హమారా.. మేయర్‌ హమారా అనే నినాదంతో బరిలో దిగిన మజ్లిస్‌ 44 స్థానాలను దక్కించుకుంది. ఈసారి 51 స్థానాల్లోనే పోటీ చేస్తున్న మజ్లిస్ ఎన్నికల ప్రచారంలో మునుపెన్నడూ లేనంత దూకుడును ప్రదర్శిస్తోంది. అనవసర వివాదాలకు తెరతీసేందుకు యత్నిస్తోంది. హుస్సేన్ సాగర్ సమీపంలోని పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలంటూ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ఎంఎంఐ పార్టీ తమ అభ్యర్థుల గెలుపు కంటే ప్రత్యర్థికి కలిసొచ్చే అంశాలపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా అధికార పార్టీతో చెలిమి చేసిన మజ్లిస్ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అవసరమైతే టీఆర్ఎస్ ను అధికారంలోంచి దించుతామంటూ గంభీరాన్ని ప్రకటించింది. నిజానికి టీఆర్ఎస్ ని అధికారంలోంచి దించాలనే నినాదాన్ని బీజేపీ ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు అదే మాట మజ్లిస్ నోట వినిపించడం అందరినీ అశ్చర్యానికి లోనుచేస్తోంది. ఇక పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ చేసిన వ్యాఖ్యలు సైతం బీజేపీకే అనుకూలంగా మారాయి. ఎన్టీఆర్ ఆశయాల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే టీడీపీ, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఆయనకు విశేష ప్రాధాన్యతనిచ్చిన టీఆర్ఎస్ నుంచి ఆ మహనీయులిద్దరినీ బీజేపీ లాక్కుంది. ఎన్టీఆర్, పీవీ సమాధుల వద్ద నివాళులర్పించిన జేపీపీ చీఫ్ బండి సంజయ్ వారిని హిందూమతానికి ప్రతినిధులుగా ప్రకటించారు.

ఎంఐఎం కూల్చివేతల భాష, బీజేపీ సర్జికల్ స్ట్రైక్ భాష నగరంలో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. మెజార్టీ హిందువుల ఓట్లను క్యాష్ చేసుకోవడానికి ఈ మాటలయుద్ధం బీజేపీకి కలిసొచ్చేదిగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడానికి ఎంఐఎం ఇతోదికంగా సహకరిస్తోందనడానికి తన ప్రచార స్టంటే ప్రత్యక్ష ఉదాహరణ. మూసీనది దాటి మీరు రాలేరంటూనే, చాయ్ వాలా పార్టీ పునాదులు ఇక్కడ లేవంటూనే బీజేపీ గెలుపుకు ఎంఐఎం బాటలు వేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఎంఐఎం వ్యూహం బీజేపీకి ఎంతమేరకు కలిసొస్తుందో చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp