'లాక్ డౌన్' ప్రకటించే అధికారం ప్రభుత్వాలకు ఉందా?

By iDream Post Apr. 05, 2020, 07:30 pm IST
'లాక్ డౌన్' ప్రకటించే అధికారం ప్రభుత్వాలకు ఉందా?


చట్టంలో ఎక్కడా 'లాక్ డౌన్' అంటే ఏమిటో నిర్వచించబడలేదు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ చట్ట సమ్మతమేనా?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సంక్రమించిన 'వ్యక్తి స్వేఛ్ఛ'ను హరించినట్లు కాదా? అన్న విషయం మీద ఒక చర్చ నడిచింది. దాని సారాంశం మాత్రం ఇక్కడ చూపే ప్రయత్నం చేస్తాను.

The Epidemic Diseases Act 1897 లోని సెక్షన్ 51 క్లాజు (b) ప్రకారం ఏదేని ఒక అంటు వ్యాధి ప్రబలినప్పుడు, ఆ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకుతుందని సంబంధత అధికారులకు అనిపించినప్పుడు సదరు అధికారులు ఒక వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని ఒక పని చెయ్యవద్దని కోరవచ్చు. (అదే విధంగా ఒక వ్యక్తి పోర్టులోకి ప్రవేశించే హక్కును కూడా తాత్కాలికంగా ఆపివేయవచ్చు. ఇక్కడ పోర్టు అంటే Sea Port & Air Port లు).

ఈ నిబంధనలను అతిక్రమించే వారికి రెండు వందల నుండి వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా ఒక నెల రోజుల నుండి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.

అదే విధంగా ఐపిసి సెక్షన్ 188 క్రింద కూడా జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలు శిక్షలేదా రెండూ విధించవచ్చు.

The Epidemic Diseases Act 1897 ప్రకారం నేరం చేసిన వ్యక్తిని Summary trial కింద విచారించి శిక్షించవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పూర్తిగా అనుసరించ వలసిన అవసరం లేదు.

రాజ్యాంగంలోని ఆర్టికిల్ 21 ప్రకారం లభించే వ్యక్తి స్వేఛ్ఛ అనేది అదే రాజ్యాంగంలోని ఆర్టికిల్ 19 (1)(d) ప్రకారం కొన్ని పరిమితులకు లోబడే ఉంటుంది.

రాజ్యాంగంలో ఆరోగ్యం అనేది స్టేట్ లిస్ట్ లోనిది. మరి కేంద్రం ఎలా చర్యలు తీసుకుంటోంది?
The Disaster Management Act 2005 ప్రకారం ఏదేని ఒక విపత్తు ఏర్పడినప్పుడు కేంద్రం చర్యలు తీసుకునే వీలుంది. (ఈ చట్టం బహశా భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందం జరిగిన నేపధ్యంలో అప్పటి UPA ప్రభుత్వ హయాంలో తేబడినది అనుకుంటాను).

ఇప్పుడు కేంద్రం కూడా అదే చట్టాన్ని ఉపయోగించి ఈ నిబంధనలను విధించింది. దీనినే 'లాక్ డౌన్' గా పేర్కొన్నారే కానీ అధికారిక ఉత్తర్వులలో ఎక్కడా ఆ మాట వాడలేదు.

అందుచేత ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై The Epidemic Diseases Act 1897 ప్రకారం Summary trial కింద 'నలుగురి'ని జైల్లో పెడితే తత్వం బోధ పడి ఇంటి పట్టున పడుంటారు.

కొంత మంది ఖైదీలను విడుదల చేసారంటున్నారు కనుక జైళ్ళు కూడా ఖాళీగానే ఉండి ఉంటాయి.
ఈ శిక్షల విషయమై ప్రభుత్వం ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పిస్తే మంచిది.

Written By - Murali Krishna 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp