ప్రకాశంలో ఆ ఇద్దరు సీనియర్‌ నేతలు ఏం చేస్తున్నారు..?

By Karthik P Feb. 27, 2021, 11:50 am IST
ప్రకాశంలో ఆ ఇద్దరు సీనియర్‌ నేతలు ఏం చేస్తున్నారు..?

రాజకీయ జీవితం విజయాలతో నిర్విర్యామంగా సాగించిన నేతలు అతి కొద్ది మందే ఉంటారు. అత్యధిక శాతం మంది రాజకీయ నేతలు తమ జీవితంలో ఎత్తు పల్లాలు చూసినవారే. వెలుగు, చీకట్లలోనూ ఉన్నవారే. వెలుగు తర్వాత చీకటి, ఆ తర్వాత మళ్లీ వెలుగు వస్తుందనేది ఓ నానుడు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ ఇద్దరు సీనియర్‌ నేతలు ప్రస్తుతం రాజకీయంగా చీకటిలో ఉన్నారు. రాజకీయంగా జీవితం చరమాంకంలో ఉన్నా.. వెలుగు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఇద్దరు నేతలే మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిలు. రాబోయే మూడు నెలల్లో 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండడంతో.. ప్రకాశం జిల్లాలో ఈ ఇద్దరు నేతలపై చర్చ జరుగుతోంది.

ముక్కు కాశిరెడ్డి : కిరోసిన్‌ డీలర్‌ నుంచి మంత్రి వరకు..

కిరోసిన్‌ డీలర్‌గా ఉన్న ముక్కు కాశిరెడ్డి టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాశిరెడ్డి విద్యాధికుడన్న కారణంతో ఎన్టీ రామారావు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కనిగిరి సీటు ఇవ్వడంతోపాటు సామాజికవర్గాల సమతూకంలో భాగంగా తన మొదటి కేబినెట్‌లోనే మంత్రిగా అవకాశం ఇచ్చారు. 1983, ఆ తర్వాత 1985, 1994 శాసన సభ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989,1999, 2004 ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి ఇరిగినేని తిరుపతి నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు.

1999 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. కాశిరెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2001లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కావడం వల్లనే కాశిరెడ్డి రాజకీయ జీవితానికి ఎదురుగాలి వీచిందని ఆయన గురించి తెలిసిన వారు చెప్పుకుంటుంటారు. 2004 ఎన్నికలే కాశిరెడ్డికి చివరి ఎన్నికలయ్యాయి.

2009 ఎన్నికల్లో కాశిరెడ్డికి టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు. బాలకృష్ణ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు టిక్కెట్‌ దక్కింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కాశిరెడ్డి ఇంటి పేరు ఉన్న ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి టిక్కెట్‌ దక్కింది.

2009 ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ దక్కకపోవడంతో కాశిరెడ్డి టీడీపీని వీడారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి మద్ధతు తెలిపారు. టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు నామినేషన్‌ చెల్లకపోవడంతో టీడీపీ.. స్వతంత్ర అభ్యర్థి, కదిరి బాబురావుకు సమీప బంధువు అయిన సుంకర మధుసూధన్‌రావుకు (ఉంగరం గుర్తు)కు మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కేవలం 1900 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అది కూడా ముక్కు కాశిరెడ్డి వర్గం తనకు పని చేయడం వల్లే గెలిచానని పలు సందర్భాల్లో ఉగ్ర నరసింహారెడ్డే స్వయంగా చెప్పారు.

వైసీపీ ఆవిర్భావంతో ముక్కు కాశిరెడ్డి ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కనిగిరి సీటు తనకే వస్తుందని ఆశించారు. కానీ సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా కనిగిరి సీటు యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు దక్కింది. అంతకు ముందు ఎన్నికల్లో కదిరి బాబురావు నామినేషన్‌ చెల్లకపోవడం వల్ల వచ్చిన సెంటిమెంట్‌తో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన కదిరి బాబూ రావు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌ రాకపోవడంతో ముక్కు కాశిరెడ్డి రాజకీయాలుకు దూరంగా జరిగారు. సాయిబాబా భక్తుడిగా మారారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన ఆశీర్వాదం కోసం రాజకీయ నేతలు వెళుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ.. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థులు కాశిరెడ్డిని కలుస్తున్నారు. కాశిరెడ్డి మద్ధతు తమకు ఉందని చెప్పుకునేందుకు పోటీదారులు ఆసక్తి చూపడం స్థానికంగా కాశిరెడ్డికి ఉన్న పట్టుకు నిదర్శనం.

జంకె వెంకటరెడ్డి : తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని..

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జంకె వెంకట రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సౌమ్యుడుగా, రాజకీయ దర్పం ప్రదర్శించని నేతగా పేరొందారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. జంకె వెంకట రెడ్డి తండ్రి జంకె రామిరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆ పదవి దక్కలేదు. తండ్రి సాధించలేనిది కొడుకు వెంకట రెడ్డి సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

రాజకీయాల్లో అంచెలంచెలుగా జంకె వెంకట రెడ్డి ఎదిగారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1987లో మండల అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. 1989 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే సీపీఐతో పొత్తులో భాగంగా ఆ సీటను టీడీపీ వదులుకుంది. టీడీపీ, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే (1978) పూల సుబ్బయ్య పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుందురు పెద కొండారెడ్డి (కేపీ కొండారెడ్డి) విజయం సాధించారు.

1989 ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటించిన జంకె వెంకటరెడ్డి 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. ఈ సారి కూడా జంకెకు మొండిచేయి చూపారు. సీపీఐతో పొత్తులో భాగంగా.. ఆ సీటును ఎన్టీరామారావు ఈ సారి కూడా సీపీఐకి కేటాయించారు. ఈ సారి పూల సుబ్బయ్య సతీమణి తాయరమ్మకు మొదట టికెట్ దక్కినా కొందరి రాజకీయంతో ఆవిడ పోటీ నుంచి తప్పుకోవడంతో సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య పోటీచేశారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావ్ సలహాతో స్వతంత్ర అభ్యర్థిగా జంకె వెంకట రెడ్డి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.  కొబ్బరి చెట్టు గుర్తుతో బరిలోకి దిగిన జంకె వెంకట రెడ్డి దాదాపు 22 వేల మెజారిటీతో గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో ఆ ఎన్నికల్లో జంకె వెంకటరెడ్డికి వచ్చిన మెజారిటీనే అత్యధికం కావడం విశేషం. గెలిచిన తర్వాత జంకె టీడీపీలోకి వెళ్లారు.

1999 ఎన్నికల్లో టీడీపీ జంకె వెంకట రెడ్డికి సీటు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేపీ కొండా రెడ్డి గెలిచారు. టీడీపీలోకి వచ్చిన కొత్తతరం నేతలతో వచ్చిన విభేదాలు, మాట పట్టింపులతో జంకె వెంకటరెడ్డి రాజకీయంగా పెద్ద తప్పటడుగు వేశారు. 2001 జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పుల్లలచెరువు మండలం నుంచి జడ్పీటీసీగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కాంట్రాక్టర్‌ శంకర్‌ రెడ్డి బరిలో నిలిచారు. నెల్లూరుకు చెందిన శంకర్‌ రెడ్డి స్థానికంగా కాంట్రాక్టులు చేస్తున్నారు. టీడీపీలోని జంకె వ్యతిరేకవర్గం కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి పని చేయడంతో జంకె వెంకటరెడ్డి ఓడిపోయారు. ఈ పరిణామం జంకె రాజకీయ జీవితంలో పెద్ద కుదుపు.

2004 ఎన్నికల్లో టీడీపీ జంకెను పక్కనపెట్టింది. జంకె వ్యతిరేకవర్గమైన కందుల నారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీనియర్‌ ఎమ్మెల్యే కేపీ కొండా రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ టిక్కెట్‌ రాకపోయినా.. పోటీ చేసేందుకు జంకె సిద్దమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 22, 287 ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో జంకె గెలవకపోయినా.. జంకె వల్ల టీడీపీ అభ్యర్థి భారీ ఓటమిని చవి చూశారు. కాంగ్రెస్‌ పార్టీకి 58,108 ఓట్లు రాగా, టీడీపీకి 37,370 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఎన్నికల అనంతరం 2005లో జంకె వెంకట రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కేపీ కొండా రెడ్డి గెలుపుకు కృషి చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ వెంట నడిచారు. సీనియర్‌ నాయకుడు కావడంతోపాటు మంచి వ్యక్తిగా పేరొందిన జంకె వెంకటరెడ్డికి వైఎస్‌ జగన్‌ మార్కాపురం సీటును కట్టబెట్టారు. జగన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2014 ఎన్నికల్లో జంకె విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో వైసీపీ సీటు కేపీ కొండారెడ్డి కుమారుడు కుందురు నాగార్జున రెడ్డికి దక్కింది. నాగార్జున రెడ్డి విజయానికి కృషి చేసిన జంకె వెంకట రెడ్డి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు.

కాశిరెడ్డి, వెంకటరెడ్డిలు ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. రాజకీయంగా స్తబ్ధుగా ఉంటున్నా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మరి పెద్దల సభలో వీరికి ప్రాతినిధ్యం దక్కుతుందా..? 70వ పడిలో ఉన్న ఇద్దరు సీనియర్‌ నేతలకు మళ్లీ రాజకీయ వైభవం వస్తుందా..? వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp