మాజీల చేరికతో మళ్లీ కాంగ్రెస్ కోలుకుంటుందా..?

By Raju VS Nov. 23, 2020, 12:10 pm IST
మాజీల చేరికతో మళ్లీ కాంగ్రెస్ కోలుకుంటుందా..?

ఏపీలో రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం రెండు జాతీయ పార్టీల మధ్య పోటీగా ఉన్న పరిస్థితి నుంచి ఆ తర్వాత జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ప్రాంతీయ పార్టీ టీడీపీకి మధ్య పోటీ అన్నట్టుగా మూడు దశాబ్ధాల కాలం పాటు సాగింది. కానీ తీరా గడిచిన ఏడెనిమిదేళ్లుగా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య వైరం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ కోటలన్నీ కూలిపోయాయి. తిరుగులేని దశ నుంచి ఇప్పుడు కకావికలంగా మారిపోయింది కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ కూడా రాష్ట్రంలో ఉనికి కోసం పాటు పడాల్సి వస్తోంది. ఈ రెండు జాతీయ పార్టీలు ఏపీలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమిళనాడు తరహాలో సుదీర్ఘకాలం పాటు ప్రాంతీయ పార్టీల హవా సాగుతుందా లేక మళ్లీ ఏదో ఒక జాతీయ పార్టీ ముందుకు వస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ మాత్రం ఒకనాటి తన అడ్డా అయిన ఆంధ్రప్రదేశ్ లో పాగా కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ రాజకీయ, సామాజిక సమీకరణాలు ఆ పార్టీని మళ్లీ కోలుకోకుండా దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన మూలంగా కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు కూడా తలొదిక్కు అయిపోయారు. అలా పార్టీని వీడిపోయిన సీనియర్లను మళ్లీ దరికి చేర్చుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నేతల్లో అనైక్యత ఆపార్టీని దెబ్బతీస్తోంది. దాంతో ఇక రాష్ట్రంలో కోలుకునే అవకాశాలు లేవని అనేక మంది మొఖంచాటేస్తూ వస్తున్నారు.

ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడం ఆపార్టీకి కొంత ఊరటగానే చెప్పాలి. తదుపరి మరింత మంది నేతలు మళ్లీ కాంగ్రెస్ గుమ్మం ఎక్కేందుకు ఇది నాంది అవుతుందని కొందరు సీనియర్ కాంగ్రెస్ వాదులు ఆశిస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణాల్లో మార్పులు రాకుండా అది అంత సులువు కాదన్నది వాస్తవం. దాంతో బీజేపీ దూకుడుగా ముందుకు రావడానికి శ్రమిస్తున్న సమయంలో కాంగ్రెస్ కోలుకోవడానికి అవకాశాలు ఏమేరకన్నది వారికి అంతుబట్టడం లేదు. అయినా ఒకనాటి తమ సామ్రాజ్యం మళ్లీ తమకు చేరువవుతందనే ఆశాభావం మాత్రం వారిలో కనిపిస్తోంది.

హర్షకుమార్ రాకతో ఎస్సీ వర్గాల్లో ముఖ్యంగా మాల కులస్తుల్లో పట్టు పెరుగుతుందని ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే హర్షకుమార్ వైఖరితో ఆయనకు అనేక మంది దూరమయిన తరుణంలో తాజా రాజకీయ నిర్ణయం ఆయనకు ఏమేరకు మేలు చేస్తుందన్నది చూడాలి. చివరకు కాంగ్రెస్ కి ఏవిధంగా తోడ్పడుతుందన్నది కూడా ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా భావించాలి. ఇలాంటి నేతలు అనేక మంది వస్తే తప్ప మళ్లీ కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని, కనీసం గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో సున్నా సీట్లకే పరిమితమయిన తరుణంలో బోణీ కొట్టాలన్నా మరింత బలమైన నేతలు రావాల్సిందేనని చెప్పాల్సి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp