పూర్తిగా సైలెంట్‌ అయిన చిట్టూరి రవీంద్ర

By Jaswanth.T Jun. 13, 2021, 09:00 pm IST
పూర్తిగా సైలెంట్‌ అయిన చిట్టూరి రవీంద్ర

రాజమహేంద్రవరం ఎంపీగా, బూరుగుపూడి నియోజకవర్గం (ప్రస్తుత రాజానగరం) ఎమ్మెల్యేగా తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన చిట్టూరి రవీంద్ర ప్రస్తుతం పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. పూర్తిసమయం తన ఆటో మొబైల్స్, ఇతర వ్యాపారాలపైనే దృష్టి సారించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయ ప్రముఖుడు చుండ్రు శ్రీహరి, చిట్టూరి రవీంద్రలు స్వయానా తోడళ్లుల్లే.

సౌమ్యుడు, నియోజకవర్గ ప్రజలతో విస్తృత సంబంధ బాంధవ్యాలను ఇప్పటిక్కూడా కొనసాగిస్తున్న రవీంద్ర రాజకీయంగా మాత్రం సైలెంట్‌మోడ్‌లోనే ఉండిపోవడం ఆయన అభిమానులను నిరాశపరుస్తుందనే చెప్పాలి. 1996లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీగా బరిలో నిలిచిన ఆయన రాజకీయ జీవితం 1988లో సర్పంచ్‌గా గెలవడంతో ప్రారంభమైందని చెబుతారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన తోడల్లుడు చుండ్రు శ్రీహరి, ఎన్టీఆర్‌ టీడీపీ తరపున గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీజేపీ తరపున కంటిపూడి సర్వారాయుడులు పోటీ పడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో చిట్టూరి విజయం సాధించారు. అయితే 11వ లోక్‌ సభ 13 నెలలకే రద్దు కావడంతో మాజీగా ఎంపీగా మారిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో రవీంద్రను తప్పించి టీవీ సత్యనారాయణరెడ్డికి సీటు కేటాయించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే రవీంద్ర వ్యవహరిస్తూ వచ్చారు.

సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలాలతో కలిపి బూరుగుపూడి నియోజకవర్గంగా ఉన్నప్పుడు 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవానికి ఎంపీ టికెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తే ఎమ్మెల్యే సీటు కేటాయించారని చెబుతుంటారు. విజయం దక్కడంతో వెనుదిరిగి చూడలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తోడ్పాటుతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించడంతో నియోజకవర్గం నలుమూలలా రవీంద్రకు ప్రత్యేక అభిమానవర్గం రూపుదిద్దుకుంది.

నియోజకవర్గాల పునర్విభజనలో ఆ తరువాత బూరుగుపూడి.. సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాలతో కలిపి రాజానగరం నియోజకవర్గంగా మార్పు చెందింది. అప్పుడు 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ ముక్కోణపు పోటీలో రవీంద్రను ఓటమి పలకరించింది. సుమారు 6,936 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాపు సామాజికవర్గంతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ ప్రజారాజ్యం పార్టీ ఊపులో ఆ సామాజికవర్గం ప్రజారాజ్యం అభ్యర్ధి ముత్యాల శ్రీనివాస్‌వైపు నిలిచింది. దీంతో రవీంద్రకు ఓటమి తప్పలేదని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.

2009లో ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రతి కార్యక్రమం రవీంద్ర చేతుల మీదుగానే నడిచేది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన తిరుమలతిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడిగా రవీంద్రకు అవకాశం కల్పించారు. అయితే రాజశేఖర్‌రెడ్డి మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ కారణాల రీత్యా రవీంద్ర తెలుగుదేశం పార్టీలోకి మారారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో పెద్దాపురం సీటు ఆయకు కేటాయిస్తారంటూ విస్తృత ప్రచారమే సాగింది. అయితే అనూహ్యంగా ఆ సీటును నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించారు. ఈ నేపథ్యంలో రవీంద్ర రాజకీయంగా మౌనం వహించారు.

రవీంద్ర ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. వయస్సు కూడా ఆయన చురుగ్గా వ్యవహరించకపోవడానికి ఒక కారణమే అయినప్పటికీ.. తన వారసులుగా కుమారులను కూడా రాజకీయాల్లోకి తీసుకు రాలేదు. దీంతో రవీంద్రతోనే వారి రాజకీయానికి ఫుల్‌స్టాప్‌ పడిందన్న భావన వ్యక్తమవుతోంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనకు అధికారం ఇచ్చి ప్రోత్సహించిన నియోజకవర్గ ప్రజలతో ఆయన ఇప్పటికీ టచ్‌లోనే ఉంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏదైనా అవసరం వస్తే వారికి తక్షణం తోడ్పానందిస్తున్నారంటున్నారు. ఏది ఏమైనా వ్యక్తిగతంగా మంచివాడిగా పేరున్న రవీంద్రలాంటి నాయకులు ఇలా అస్త్రసన్యాసం చేయడం తగదన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Also Read : రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఎందుకు సైలెంటయ్యారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp