ప్రచార ఆర్భాటం తప్పా ఫలితం ఏముంది బాబూ..?

By Kotireddy Palukuri Aug. 04, 2020, 09:54 am IST
ప్రచార ఆర్భాటం తప్పా ఫలితం ఏముంది బాబూ..?

ప్రచారం, టీవీలో కనపడడం అంటే చంద్రబాబుకు మహా సరదా అని చెబుతుంటారు. పని ఏదైనా సరే తన ప్రచారమే లక్ష్యంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని ఆయన తీరును గత 20 ఏళ్లుగా గమనిస్తున్న వారు చెబుతున్న మాట. అది నిజమేనని ఈ తరం వారికి కూడా తెలిసేలా ఆయన నడిపిస్తున్న రాజకీయాలు చెబుతున్నాయి. తాజాగా అమరావతి విషయంలో ఆయన చేస్తున్న హడావుడి ప్రచార ఆర్భాటం తప్పా ఫలితం శూన్యమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతినే కావాలని అంటున్నారని వారి తరఫున ఈయనే వకాల్తా పుచ్చుకుని చెప్పేశారు. బాబు చెప్పినట్లు ప్రజలు అలా కోరుకుంటున్నట్లయితే ఈ పాటికి బాబు గారు పిలుపు అందుకు రోడ్లమీదకు వచ్చేవారు. కానీ ప్రజలు కాదు కదా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలే మిన్నుకుండిపోయారు.

మూడు రోజుల పాటు జూమ్‌ లో ప్రెస్‌మీట్‌లు పెట్టిన చంద్రబాబు ప్రజలను రోడ్లమీదకు రావాలని, ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోనే కాక తమ పార్టీ కార్యకర్తల్లోనూ స్పందన లేకపోవడంతో.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లండి అంటూ డిమాండ్‌ చేశారు. అంతేకాదు 48 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు. రేపు సాయంత్రం 5 గంటలతో ఈ సమయం ముగిసే నాటికి మళ్లీ జూమ్‌ ప్రెస్‌మీట్‌ పెడతానని చంద్రబాబు హైదరాబాద్‌లోని తన రాజభవనం నుంచి హెచ్చరికలు జారీ చేశారు. బాబు ఏం చేసినా అహో ఓహో అంటూ ఆకాశం ఎత్తున విభిన్న కోణాల్లో ప్రసారం చేసే ఆయన అనుకూల మీడియా రాకెట్‌ ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ పెట్టినట్లుగా.. చంద్రబాబు డెడ్‌లైన్‌కు కూడా కౌంట్‌ డౌన్‌ పెట్టేశాయి. బాబు అనుకూల మీడియా చేస్తున్న ఈ తరహా ప్రసారం చూస్తున్న వారు నవ్వుకుంటున్నారు.

అసెంబ్లీ రద్దు అనే సాధ్యం కాని, తన చేతిలో లేని డిమాండ్‌ చేయడంతోనే చంద్రబాబు ప్రచారం కోసం తప్పా.. అమరావతి విషయంపై స్పష్టమైన వైఖరితో వెళ్లడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమానికి ఊపు తెప్పించాలనే లక్ష్యం చంద్రబాబుకు ఉంటే.. ఆయన చేతిలోని రాజీనామాల అస్త్రాలను ప్రయోగిస్తే చాలు. టీడీపీకి ప్రస్తుతం ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదా వారు అందరూ ముందుకు రాకపోతే తానే రాజీనామా చేసి కుప్పం నుంచి మళ్లీ పోటీ చేయడం, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి ఒకరిని కొస్తా అంధ్ర నుంచి మరొకరిని సీమ నుంచి తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి చాటి చెప్పవచ్చు.

Read Also : తమ్ముళ్లు అంతా గమనిస్తున్నారు..!

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిస్తే తమ నిర్ణయాన్ని మార్చుకుంటామని కూడా వైసీపీ చెబుతోంది. అధికార పార్టీ స్పష్టమైన వైఖరితో వెళుతోంది. కానీ చంద్రబాబు మాత్రం సాధ్యం కాని డిమాండ్లను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్పా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అమరావతి కోసం కనీసం తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు. చంద్రబాబు డిమాండ్‌ ఆచరణలో సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం మీడియా ముందుకు రానున్న చంద్రబాబు.. తాను లేదా తన పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాల ప్రకటనతో ముందుకు వస్తారా..? లేక ఎప్పటిలాగే తన చేతిలో లేని అంశాలతో ప్రకటనలు చేస్తారా..? చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp