ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళే చెయ్యాలి..

By Jaswanth.T Sep. 30, 2020, 06:58 pm IST
ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళే చెయ్యాలి..
ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యకపోతే, గౌరవంలోనే కాకుండా ఇంకా చాలా విషయాల్లో తేడాలొచ్చేస్తాయి. ఈ మేరకు మన పెద్దలు రెండు విశ్వాస పాత్రమైన జంతువులతో కూడిన కథను కూడా ఉదహరిస్తుంటారు. ఒకరు చేయాల్సిన పనిని ఇంకొకరు చేస్తే పాపం శిక్షభారిన కూడా ఓ జంతువు పడడం ఆ కథ చదవిన మనందరికీ తప్పక గుర్తుంటుంది.

ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి పని ఆయన కుంటుంది, అలాగే రాష్ట్ర డీజీపీ పని ఆయన క్కూడా ఉంటుంది. ఇక్కడ ఒకరి పనిలోకి ఒకళ్ళు వేలు పెడితేనే సమస్య వస్తుంది. ప్రతిపక్ష నేత హోదాలో ఎన్ని ఆరోపణలైనా చేసేయొచ్చు, కానీ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ఆరోపిస్తేనే అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురొస్తాయి.

ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ల మధ్య లేఖలకు కారణమైన ఘటనలో.. వైసీపీ వాళ్ళే ఆ దాడి చేసారని చంద్రబాబు నేరుగా చెప్పేసారు. అంతే కాకుండా బహిరంగ లేఖలో కూడా పేర్కొన్నారు. అయితే పోలీస్‌ల దర్యాప్తులో దాడి చేసిన వ్యక్తి టీడీపీకి చెందిన వాడిగా తేలింది. దీంతో ఎవరో ఒకరిని బాధ్యులను చేస్తూ లేఖలు రాయడం కాదని, ఆధారాలుంటే సీల్డు కవర్‌లో ఇవ్వాలని డీజీపీ కోరారు. ఇక్కడ స్పందన, ప్రతిస్పందనలు పరంగా బాగానే ఉంది.

కానీ ఇక్కడే చంద్రబాబుకు అహం గుర్తుకొచ్చిందంటున్నారు విశ్లేషకులు. మాకు అనుమానం ఉంది? ఫలా వాళ్ళనుకుంటున్నాం? ఇవిగో ఆధారాలు? అని చెబితే చంద్రబాబుకు గౌరవం పెరిగి ఉండేదని వివరిస్తున్నారు. అలా కాకుండా కేవలం రాజకీయ కోణంలోనే విమర్శలు చేయడం వల్ల తాను చేసిన పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడికి దిగుతున్నారంటున్నారు. ఇప్పుడు డీజీపీపై విమర్శలకు దిగేబదులు తన దగ్గరున్న ఆధారాలను ఇస్తే సరిపోతుందిగా? అన్నది వారి ఉద్దేశం.

ప్రతిపక్షం విచారణ చేస్తే పోలీసులేం చేస్తారు? అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. పోలీస్‌ పనిలో వేలు పెడుతున్న కారణంగానే డీజీపీ ఆ విధంగా అడిగారని, వాళ్ళ పని వాళ్ళను చేసుకోనిస్తే సమస్యే ఉండేది కాదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. డీజీపీ తనకు లేఖ రాయడమేంటన్న అహంకారంతో మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నారు.

దాడికి పాల్పడింది వైఎస్సార్‌సీపీ వాళ్ళని ఏ ఆధారాలతో చంద్రబాబు ఆరోపిస్తున్నారో? చెప్పాలని అధికార పార్టీ నాయకులు కూడా బలంగానే డిమాండ్‌ చేస్తున్నారు. బట్ట కాల్చి ముఖంమీద వేసేయడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందని, ఇటువంటి తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఏదో ఒక ఆరోపణ చేసేస్తాను.. ఆ తరువాత వివరణ మీరే ఇచ్చుకోండి.. అన్నట్టుగా వ్యవహరించడం చంద్రబాబు స్థాయికి తగదంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp