బీజేపీ ట్రాక్‌ తప్పిందా..?

By Jaswanth.T Sep. 27, 2020, 12:25 pm IST
బీజేపీ  ట్రాక్‌ తప్పిందా..?
ఏపీలో బీజేపీ పాగా వెయ్యాడానికి స్కెచ్‌ సిద్ధం చేసుకుంది. ఈ స్కెచ్‌ అధికారం దక్కించుకునేంతగా కాకపోయినా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఈ లక్ష్యం తోడ్పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల బలమైన భావన. అయితే ఉన్నత స్థితి ఊరికినే వచ్చేసే పరిస్థితులు ఏపీలో లేవన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. కోవిడ్‌ మహమ్మారి కళార నృత్యం చేస్తున్నప్పటికీ తాను చెప్పిన ఏ పథకాన్ని ఆలస్యం చేయకుండా వెనువెంటనే అమలు చేస్తున్న సీయం వైఎస్‌ జగన్‌ను ధాటిని తట్టుకుని రాష్ట్రంలో ఉన్నత స్థితికి చేరాలంటే ప్రస్తుతం బీజేపీ ఉన్న పరిస్థితికి శక్తివంచన కాదు.. శక్తికి మించి కష్టపడాల్సిందే.

అయితే ఆ పార్టీ అధినాయకత్వం ఇది గుర్తించనంత అమాయమైనది కూడా కాదు. ఈ నేపథ్యంలో ఫక్తు ఆర్‌ఎస్‌ఎస్‌ వాది సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించి తమ ఉద్దేశాన్ని బైటకు చాటారు. సోము వాగ్ధాటి, ఏ సబ్జెక్టుపైన అయినా పట్టు, రాష్ట్రంలోని పలు సామాజికవర్గాలకు చెందిన నాయకులతో ఉన్న పరిచయాలు వెరసి సోము ద్వారా పార్టీకి మేలు చేకూరుతుందున్నది వారి భావన అయ్యుండొచ్చు. ఇందుకు తగ్గట్టుగానే బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు ఒక ప్రణాళికాబద్ధంగానే ముందుకు కదిలారు. రాజకీయాలను పక్కనపెట్టేసి సినిమాల్లో తలమునకలవుతున్న చిరంజీవిని కలిసి ప్రజల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించారు. తద్వారా బీజేపీ అధిష్టానం అండతో రాష్ట్రంలో సంచలనం కోసం సిద్ధంగానే ఉన్నామన్న రీతిలో సంకేతాలిచ్చారు. ఇదంతా మత సంబంధమైన వివాదాలకు ముందు మాట అన్నది పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

మతం పేరుతో ఏపీలో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో బీజేపీ ప్రారంభించగా, దాంతో పాటు జనసేన, టీడీపీలు కూడా పోరాటాలకు మద్దతు తెలిపాయి. సరిగ్గా ఇక్కడే బీజేపీ నేతలు ట్రాక్‌ తప్పారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కులం, మతం అనేవి రాజకీయాల్లో ప్రభావం చూపేవే అయినప్పటికీ, వాటిని వాడుకునే సమయం ఎంతో కీలకమైనదన్నది ఇక్కడ గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో జనం ఉన్నారు. దాదాపుగా అన్ని రంగాల్లోనూ తీవ్ర సంక్షోభం నెలకొంది. ఏపీ ప్రభుత్వం నేరుగా అందిస్తున్న ఆర్ధిక సాయం ద్వారానే కాస్తంత వారు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ప్రభుత్వం కూడా సాయమందించే విషయంలో ఎటువంటి కొర్రీలు లేకుండా వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంటోంది. అంతే కాకుండా కోవిడ్‌ చికిత్స విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకు భిన్నంగా వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తోంది. దాదాపు నెలరోజుల తరువాత ఎదురవ్వబోయే ఇబ్బందులను ముందుగానే అంచనావేసి అందుకు తగ్గట్టుగా ఆసుపత్రుల్లో బెడ్లు సిద్దం చేయడం, సిబ్బందిని కొత్తగా రిక్రూట్‌ చేయడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ఇటువంటి వాటి ద్వారా రాష్ట్ర ప్రజలకు భారీ ఊరటనే కలిగిస్తోంది.

సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతిపక్షాలు మతం పేరిట ఉద్యమాలకు పిలుపునిచ్చాయి. అయితే జరిగిన సంఘటనలో ప్రభుత్వ ప్రమేయం ఎంత అన్నది నేరుగానే ప్రజలకు అర్ధమవుతోంది. అలాగే ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు కూడా ఆక్షేపణీయంగా లేదు. అయినా గానీ ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడాన్ని ప్రజలు ఒప్పుకోలేదన్న విషయాన్ని పరిశీలకులు వివరిస్తున్నారు. అందు వల్లనే సున్నితమైన అంశమే అయినప్పటికీ ప్రతిపక్షాల పిలుపులకు ప్రజల నుంచి స్పందన కరువైందన్న విషయాన్ని నిర్ధారిస్తున్నారు.

ఇటువంటి నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు కూడా విన్పిస్తున్నాయి. ప్రభుత్వ స్పందన, ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇబ్బందు తదితర అంశాలను బేరీజు వేసుకోకుండా ఇటువంటి వాటికి ముందుకురికితే ఫలితాలు పేలవంగానే ఉంటాయంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ఉన్నత స్థితికి చేరాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ తన ట్రాక్‌ను విడిచి విన్యాసాలు చేస్తే ఫలితాలు పెద్దగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని వివరిస్తున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp