పురందేశ్వరికి పదవి-చంద్రబాబుపై బీజేపీ పక్కా క్లారిటీగా..!

By Jaswanth.T Sep. 28, 2020, 08:40 pm IST
పురందేశ్వరికి పదవి-చంద్రబాబుపై బీజేపీ పక్కా క్లారిటీగా..!
 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ పక్కా క్లారిటీగానే వ్యవహరిస్తోందా?.. అవుననే ఉంటున్నాయి రాజకీయ వర్గాలు. జాతీయకార్యవర్గాన్ని ప్రకటించేంత వరకు కూడా బీజేపీకి ఏపీలో అప్రకటిత బాడీగార్డుగా చంద్రబాబు వ్యవహరించారనడంలో సందేహం లేదు. మోడీకి శుభాకాంక్షలు చెప్పడం, అమిత్‌షాతో ఫోనులో మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు.. ఇలా ప్రతి అంశంలోనూ బీజేపీ తనకు టచ్‌లోనే ఉందన్న కలరింగ్‌ ఇచ్చేసారు. ఏపీలో అధికార పక్షమైన వైఎస్సార్‌సీపీని కేంద్రంలోని బీజేపీ సాయంతో తానే కట్టడి చేయగలనన్న రీతిలో ఈ ప్రదర్శన ఉండేది. బీజేపీవాళ్ళు అడిగినా అడక్కపోయినా వారు చేసే ప్రతి పనిని అభినందించడం, వారు ఎవరిని విమర్శిస్తే వాళ్ళను బీజేపీ నాయకులకంటే ఒక మాట ఎక్కువే విమర్శించడం చేసేవారు. తమ బృందం చేత చేయించేవారు.

ఇదంతా కేంద్రంలోని మోడీ, షాల దృష్టిని ఆకర్షించడానికేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంతగా ఎద్దేవా చేసినా గానీ చంద్రబాబు వెనక్కితగ్గలేదు. చూసే వాళ్ళకు బీజేపీకి మళ్ళీ బాబు దగ్గరైపోతున్నారేమో? అన్న సందేహాలుగా ప్రారంభమై నమ్మకంగా స్ధిరపడిపోయే అవకాశం కూడా సృష్టించేసేవారు.

అయితే అనూహ్యంగా బీజేపీ తన కేంద్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో ప్రముఖంగా దగ్గుబాటి పురందరేశ్వరి పేరే అందరినీ ఆకర్షిస్తోంది. అప్పటి వరకు ఏపీలో బీజేపీకి అన్నీ తామేనన్ని రీతిలో బిల్డప్‌ ఇచ్చిన టీడీపీ నుంచి వలస వెళ్ళిన నాయకులెవ్వరి పేర్లు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఒక్కసారిగా రచ్చరేగింది. ఇది ఇతర పార్టీలు, సామాన్య జనంలో కంటే టీడీపీ పార్టీలోనే ఎక్కువగా రేగిందనడం సందర్భోచితంగా ఉంటుంది.

తనతో అమిత్‌షా ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు.. అన్నంత ప్రదర్శన ఇచ్చిన చంద్రబాబుకు కూడా ఈ పరిణామం గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టేనని కొందరు విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇంతగా ఎందుకు చెబుతున్నారంటే దగ్గుబాటి పురందరేశ్వరికి చంద్రబాబునాయుడంటే గిట్టదని జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో బీజేపీ తరపున ప్రాధాన్య పదవి పురందరేశ్వరికే దక్కింది. తద్వారా బీజేపీ అధినాయకత్వం.. అంటే మోదీ, అమిత్‌షాలు చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టేసారనడానికి ఇదే కొండంత నిదర్శనమని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ఒక వేళ చంద్రబాబు చెప్పుకున్నట్టు అమిత్‌షా స్వయంగా ఫోన్‌టచ్‌లోనే ఉండి ఉంటే చంద్రబాబుకు చెందిన నాయకులెవరికైనా ఈ ప్రాధాన్యపదవి దక్కి ఉండేదని బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. అసలు చంద్రబాబును గురించి ఆలోచనే చేయని కారణంగానే ఆయనకు బద్దవ్యతిరేకి అయిన పురందరేశ్వరికి బీజేపీలో ప్రాధాన్యం దక్కిందన్న వాదన కూడా విన్పిస్తోంది.

సో.. 2019 ఎన్నికలయ్యాక చంద్రబాబు, అండ్‌ బృందం ఎంతగా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినప్పటికీ బీజేపీ అధినాయకత్వం తాము అనుకున్న వారికే, అందులోనూ బీజేపీ తరపున పూర్తిస్థాయిలో పనిచేసిన వారికే పట్టం కట్టిందన్నది విశ్లేషకులు చెబుతున్న వివరణ.

రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న వర్గాల్లో ఒకటైన కాపు సామాజికవర్గానికి, కీలక రంగాల్లో పట్టున్న కమ్మ సామాజికవర్గానికి సమాన ప్రాధాన్యం ఇస్తూనే తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ రెండు సామాజికవర్గాలను కలుపుకుని ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలోనే బీజేపీ ఉందన్నది ఈ నియామకాలతో స్పష్టమైపోయింది. అయితే కాపు సామాజికవర్గానికి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్షపదవి దక్కింది. అలాగే కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యతలో భాగంగా పురందరేశ్వరిని కేంద్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు.

ఈ లెక్కన చంద్రబాబుకు బీజేపీ అధినాయకులు టచ్‌లో ఉండి ఉంటే గనుక కమ్మ సామాజికవర్గం నుంచి తప్పకుండా చంద్రబాబుకు ప్రీతిపాత్రులైనవారికి మాత్రమే పదవులు వరించి ఉండేవని విశ్లేషిస్తున్నారు. కాబట్టి ప్రస్తుత నియామకాల ద్వారా చంద్రబాబును బీజేపీ నాయకత్వం పూర్తిగా పక్కనపెట్టేసిందన్నది మరోసారి తేటతెల్లమైపోయిందని రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న టాక్‌గా ప్రస్తుతం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp