డికాపీటేషన్ అంటే తెలుసా?

By Guest Writer Dec. 07, 2019, 05:19 pm IST
డికాపీటేషన్  అంటే తెలుసా?

డికాపీటేషన్ అంటే తెలుసా? శిరచ్చేదనం చేసి శరీరం నుండి తల వేరు చేయడాన్ని డికాపీటేషన్ అంటారు.
ఇది మనుషులకు, జంతువులకు మాత్రమే కాదు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈలోకం ఇంకా చూడని పసికందులకు కూడా చేస్తారు.
తల్లి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు, బిడ్డ ప్రాణం తీస్తే కానీ తల్లి ప్రాణం నిలబడనప్పుడు చేయక తప్పని సరి పరిస్థితుల్లో చేస్తారు.
అయ్యో బిడ్డ, లోకం చూడని పసికూన అనుకుంటే అసలుకే ఎసరు వస్తుంది మరి.

ఎన్కౌంటర్ ఆటవికం,ఉరిశిక్ష పాశవికం,సమస్య మూలాలను వెతికి,కూకటి వ్రేళ్ళతో పాటు నాశనం చేయాలి అంటున్నాము సరే.కానీ ఆ వ్రేళ్ళు పాతాళంలోకి పాతుకుపోయ,పెకిలించడానికి మార్గం సుగమం కానప్పుడు కనీసం ఆ విషవృక్షం తాలూకు కొమ్మలు నరికైనా జరుగుతున్న నష్టాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
పేదరికం,నిరక్షరాస్యత,కుటుంబ పరిస్థుతులు, జీవన విధానం లాంటివి నేరం చేయడానికి ముఖ్య కారణాలు నిజమే..

కానీ అవన్నీ ఈ రోజు ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యలు ఏమీ కావు.
చరిత్రలో ఉన్నాయి, వర్తమానంలో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి.
వాటిని కారణంగా చూపించి దోషులను శిక్షించకూడదు,శిక్షించినా కఠినంగా ఉండకూడదు అంటే, ఈ వాదన చాలు కన్ను మిన్ను తెలియక దారిన పోయే ఆడపిల్లని ఏడిపించడానికి.
నెలలు తరబడి పెంచుకున్న పైరు మిడతల భారి పడుతుంటే,అడ్డు పడకూడదు,వాటివీ ప్రాణమే, వాటికీ ఆకలి ఉంటుంది, వాటిని చంపడం అన్యాయం, వాటికి సరైన ఆహారం మనం కల్పించి ఉంటే ఈరోజు అవి పైరుని నాశనం చేసి ఉండేవి కాదు కదా అనటం బయట నుండి చూసే వాడికి సులభమే,ఆ పైరు కోల్పోయిన రైతు స్థానంలో ఉంటే తెలుస్తుంది కడుపు మంట ఏమిటో..

దోమను చంపితేనే రక్తం చూసి అయ్యో అని బాధ పడే సున్నితత్వం పోయి, నాలుగు నిండు ప్రాణాలు తీస్తే, రోడ్ల మీదకి వచ్చి డాన్సులు వేసి, మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకునే పరిస్థితిలో ఆడవాళ్లు వున్నారు అంటే ఈ పరిస్థితి ఊరికే రాలేదు.ఎదుర్కొంటున్న సమస్యలు అంత దారుణంగా వుంటున్నాయి.

ఈ చావులు కారణంగా అఘాయిత్యాలు పూర్తిగా ఆగకపోయునా,పదిశాతం మార్పు వచ్చినా సార్థకం జరిగినట్లే. ఒకరిద్దరు అమాయకపు ఆడపిల్లలు అయినా రక్షింప బడినట్లే.
వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను, తల్లి తండ్రుల కడుపు కోతను గూర్చి ఆలోచించడానికి,వాళ్లేమి ప్రజల కోసం చేసిన పోరాటంలో చంపివేయ బడలేదు.కాకుంటే న్యాయవ్యవస్థ పరిధిలో జరగాల్సిన పని చట్టం పరిధిలో జరిగింది.దీనికి కారణాలు అనేకం. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గకుండా ప్రజల కోసం పనిచేస్తాయి అనుకోవడం ఆశ కూడా కాదు అత్యాశ అనే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాము.
ఈ ఘటన నుండి ఆడపిల్లలు, మగ పిల్లలే కాదు,వాళ్ళ తల్లితండ్రులు,సాటి మనుషులు కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో స్త్రీ జాతి పట్ల అత్యంత గౌరవభావం పెరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అలా చేయవలసిన భాద్యత ప్రతి పౌరుడిపైన ఉందనే సత్యాన్ని ఎప్పటికి మర్చిపోకూడదు.

Written By- SPJR

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp