మీరు భారతీయులేనా? డీఎంకే ఎంపీ కనిమొళికి ఓ అధికారిణి సూటి ప్రశ్న...

By Kiran.G Aug. 10, 2020, 07:59 am IST
మీరు భారతీయులేనా? డీఎంకే ఎంపీ కనిమొళికి ఓ అధికారిణి సూటి ప్రశ్న...

డీఎంకే ఎంపీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళికి తన సొంత నగరమైన చెన్నైలోనే చేదు అనుభవం ఎదురైంది. ఒక అధికారిణి ఎంపీ కనిమొళిని మీరు భారతీయులేనా అని ప్రశ్నించింది. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తోంది.

వివరాల్లోకి వెళితే పార్లమెంట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమం నిమిత్తం ఎంపీ కనిమొళి ఆదివారం చెన్నై నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఒక అధికారిణితో కనిమొళి సంభాషించాల్సి వచ్చింది.. ఆ అధికారిణి హిందీలో మాట్లాడటంతో ఆమెను తమిళంలో లేదా ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఎంపీ కనిమొళి విజ్ఞప్తి చేసారు. దాంతో ఆ అధికారిణి మీరు భారతీయులేనా అని ప్రశ్నించింది. దీంతో డీఎంకే ఎంపీ కనిమొళి షాక్ కి గురైంది.

భారతీయులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని ఈ సంఘటన ద్వారా తనకు తెలిసిందని ఎంపీ కనిమొళి సామాజిక మాధ్యమం ద్వారా విమర్శించారు. ట్విట్టర్ లో హిందీ ఇంపోజిషన్‌’ అని హ్యాష్‌ట్యాగ్‌ జోడించి ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ కు రాజకీయ వేడి రాజుకుంది.

ఈ వ్యవహారంపై సీఐఎస్‌ఎఫ్‌ స్పందించాలంటూ కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్‌ చేశారు. ట్విట్టర్ ద్వారా ఘటనను ఖండించారు. దాంతో సీఐఎస్‌ఎఫ్‌ ఎంపీ కనిమొళికి క్షమాపణ చెప్పింది. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఇద్దరు అధికారులు ఢిల్లీలో కనిమొళిని వ్యక్తిగతంగా కలిసి సదరు ఉద్యోగినిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తామని సీఐఎస్‌ఎఫ్‌ తెలిపింది.

కాగా కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానాన్ని డీఎంకే అధినేత, కనిమొళి సోదరుడు స్టాలిన్‌ ఖండించారు. ఎన్‌ఈపీ ద్వారా హిందీని, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. దీన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో చోటుచేసుకున్న ఈ ఘటన తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతుంది.

ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్న ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురై ఉంటే తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించేది కాదని కానీ చెన్నై విమానాశ్రయంలో ఈ ప్రశ్న ఎదురవడం షాక్‌కు గురి చేసిందని ఎంపీ తెలిపారు. ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తులు ఇక్కడ విధుల్లో ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని కనిమొళి తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp