పవన్ నియోజకవర్గ ఎంపికలో తప్పు చేశాడా?

By KalaSagar Reddy Feb. 18, 2020, 07:00 am IST
పవన్ నియోజకవర్గ ఎంపికలో తప్పు చేశాడా?

గత ఎన్నికల్లో ఓటమి జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ను ఇప్పటికీ వెంటాడుతున్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.. నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేశారు. రెండు చోట్లా ఆయన ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.

ఈ విషయమై తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్యకర్తల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ నేతలు చెప్పడంతోనే.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశానని చెప్పుకొచ్చారు. లేదంటే తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేయాలనుకున్నానని తన మనసులోని మాటలను బయటపెట్టారు. తాడేపల్లి గూడెం అయితే ఖచ్చితంగా గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాను గూడెం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని పవన్‌ కళ్యాణ్‌ కార్యకర్తలతో చెప్పారు.

ఈ వాఖ్యలు భవిష్యత్‌ రాజకీయంపై పవన్‌ తన ప్రణాళికను చూచాయగా వెల్లడించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తాజా వ్యాఖ్యలతో.. భీమవరం, గాజువాక నియోజక వర్గాలకు అతి త్వరలో గుడ్‌బై చెప్పబోతున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం పై దృష్టి పెట్టి అసెంబ్లీలో కూర్చోవాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే పవన్‌ కళ్యాణ్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.

అయితే పవన్‌ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తాడేపల్లి గూడెం నుండి డెబ్భై వేల ఓటింగ్ తో వైసీపీ గెలవగా , టీడీపీ 54 వేల పై చిలుకు ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది అని , జనసేన మాత్రం వైసీపీకి పోలయ్యిన ఓట్లలో సగం అంటే 36 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచిందని మరలాంటప్పుడు వ్యూహాత్మకంగా ఆలోచిస్తే పవన్ తాడేపల్లి గూడేన్ని ఎంచుకోడని తనని రెండో స్థానంలో నిలిపిన భీమవరం , గాజువాకల్లోనే మరింత బలపడే ప్రయత్నం చేస్తాడు తప్ప తాడేపల్లిగూడెం నుండి పోటీ చేయడని విశ్లేషిస్తున్నారు .

ఒకవేళ గతంలో ప్రజారాజ్యం గెలిచింది అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యాఖ్యానించాడు అనుకున్నా గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పటి పరిస్థితులు వేరని , అప్పుడు చిరంజీవి వెంట నడిచిన నాయకులు ఎవరూ ఇప్పుడు జనసేనాని వెంట లేరని భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని రాష్ట్రవ్యాప్తంగా గతంలో ప్రజారాజ్యం ఓటింగ్ శాతాన్ని , నిన్నటి జనసేన ఓటింగ్ శాతాన్ని పోలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది అని స్పష్టం చేశారు .

మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసాడు అన్న ప్రశ్నకు సమాధానంగా గతంలో కూడా పవన్ అనేక నియోజకవర్గాల పర్యటనల్లో ఆయా నియోజక వర్గాల నుండి పోటీ చేస్తానని చెప్పి అభిమానుల్ని ఉత్సాహపరిచేవాడని ఆ విధంగా అవనిగడ్డలో , పిఠాపురంలో , అనంతపురంలో , శ్రీకాకుళం పర్యటనల్లో అక్కడి కార్యకర్తలకు ఇక్కడి నుండే పోటీ చేస్తానని మాటిచ్చిన పవన్‌... చివరికి ఆర్ధిక , సామాజిక , సినీ అభిమాన గణాల లెక్కలు చూసుకొని ఆ తర్వాత భీమవరం, గాజువాక నియోజకవర్గాలను ఎంచుకున్నారని , అందువలన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా తన అభిమానుల్ని తాత్కాలికంగా సంతోషపెట్టటానికి చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాలే తప్ప సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని పలువురు అభిప్రాయపడ్డారు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp