తెగే దాకా లాగి ఉండకూడదేమో చంద్రబాబు గారూ!!

By Sannapareddy Krishna Reddy Feb. 28, 2021, 08:20 am IST
తెగే దాకా లాగి ఉండకూడదేమో చంద్రబాబు గారూ!!

ఊరిబయట రహదారి పక్కన మెలితిరిగిన మీసాలతో ఒక కండలు తిరిగిన వస్తాదు ఒకడు చేతిలో కర్ర పట్టుకుని కూర్చుని ఆ దారిలో పోయేవారిని తనకు సుంకం చెల్లించి మరీ పోవాలని దబాయించసాగాడు. ఎవరైనా తటపటాయిస్తే "నేను లేస్తే మనిషిని కాదు" అని ఆగ్రహంతో కేకలేసేవాడు. వీడు కూర్చుని ఉంటేనే ఇంత భయంకరంగా ఉన్నాడు, లేస్తే ఏం చేస్తాడో అని అందరూ వాడికి ఎంతోకొంత చెల్లించేవారు.

ఇతగాడి వరసతో విసుగెత్తిన ఒకడు, "సరే లేవరా చూద్దాం ఏం చేస్తావో" అని ఎదురు తిరిగాడు. ఈ మీసాల వస్తాదు "లేస్తే అంతు చూస్తా"అని బెదిరించడమే కానీ ఎంతకీ లేవడం లేదు. దాంతో ధైర్యం తెచ్చుకున్న అవతలి వ్యక్తి దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకుని పైకి లేపితే అతనికి రెండు కాళ్లు లేవని బయటపడింది. ఆ రోజు నుంచి ఆ వస్తాదును చిన్న పిల్లలు కూడా పట్టించుకోవడం మానేశారు. ఏదైనా విషయాన్ని తెగేవరకూ లాగకూడదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తారు.

పంచాయతీ ఎన్నికలు-బాబు గారి దూకుడు
పోయిన సంవత్సరం దాదాపు పూర్తి కావచ్చిన పంచాయతీ ఎన్నికలను కరోనా సాకు చూపించి, ప్రభుత్వంతో మాటమాత్రమైనా సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారన్న కారణంతో అతను ఉండగా ఆ ఎన్నికలు జరగకూడదన్న పంతంతో ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా లేదని కరోనా ఉధృతిని ఒకసారి, వాక్సీన్ ఇవ్వాలని మరొక సారి సాకు చూపిస్తే చంద్రబాబు ఎన్నికలకు పోవడానికి ప్రభుత్వం భయపడుతోందని అర్థం చేసుకున్నాడు.

జగన్ ప్రభుత్వం ఏర్పడి నెల తిరక్కుండానే తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అధికార పక్షం వైపు ఆశగా చూడటం, కొంతమంది ఆ దిశగా అడుగులు వేయడంతో ఖంగుతిన్న చంద్రబాబు వారిని ఆపడానికి, కార్యకర్తల్లో ధైర్యం కలిగించడానికి, "ప్రజల్లో జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఉధృతంగా ఉందని, ఎప్పుడు అవకాశం వచ్చినా చూపించడానికి వేచి చూస్తున్నారని" పదేపదే చెప్పి, ఆ విషయం ఆయన కూడా నమ్మేశారు.

ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెనుకాడేకొద్దీ చంద్రబాబు అండ్ కో మరింత రెచ్చిపోయారు. "దమ్ముంటే ఎన్నికలు పెట్టండి. మీకు డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తు చేస్తాం"అని అధికార పక్షాన్ని సవాల్ చేయడమే కాకుండా, తమకు అస్మదీయుడైన నిమ్మగడ్డ చేత ఎలాగైనా ఎన్నికలు జరిపితీరాల్సిందే అన్న స్టాండ్ తీసుకునేలా చేశారు. దాంతో తన వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి నిమ్మగడ్డ ఎన్నికలు జరిపించాడు.

ఇప్పుడు ఫలితాలు చూసి అవాక్కవడం తమ్ముళ్ళ వంతయింది. ఎప్పటి నుంచో నాటుకుపోయిన తెలుగుదేశం కంచుకోటల పునాదులు కదిలిపోయాయి. ఎన్నికల్లో ఆక్రమాలు జరిగాయి, కోటానుకోట్ల రూపాయలు దొర్లించారు, మా పార్టీ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు, మా పార్టీ అభిమానులను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు అని చంద్రబాబు ఎంత చెప్పినా, సాక్షాత్తు ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్రపడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా మీడియా ముందుకొచ్చి "ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి" అని చెప్పి, అప్పటి వరకూ తనకు వ్యతిరేకంగా ఉన్న డిజీపీ, సీఎస్, ప్రభుత్వ ఉద్యోగులు చాలా చక్కగా పని చేశారని కితాబు ఇవ్వడంతో చంద్రబాబు మాటల్లోని డొల్లతనం బయటపడింది.

అప్పుడైతే మంచి సాకు దొరికేది
చంద్రబాబు పంతానికి పోయి, నిమ్మగడ్డ చేత పోరాటం చేయించి ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెట్టించాలని అనుకోకుండా,"దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి. మిమ్మల్ని చిత్తు చేస్తాం" అని ప్రకటనలు ఇస్తూ, రెండు మూడు నెలల తర్వాత కొత్త ఎన్నికల కమీషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఓడిపోయి ఉంటే, అప్పుడు ఆ ఓటమిని కవర్ చేసుకోవడానికి మంచి సాకు దొరికి ఉండేది.

న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపమైన నాలుగో సింహం, ఎన్నికలు సజావుగా నడిపించే శేషన్ తాలూకూ వెర్షన్ 2.0 అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉంటే డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోతామని భయపడిన ప్రభుత్వం తన కనుసన్నల్లో, తనకు అనుకూలంగా పనిచేసే కమీషనర్ వచ్చే వరకూ ఆగి, ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులనూ, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి, విచ్చలవిడిగా దౌర్జన్యం చేసి, డబ్బు, మద్యం యధేచ్ఛగా పంపిణీ చేసి గెలిచింది. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే మేమే గెలిచి ఉండే వాళ్ళం అని గట్టిగా చెప్పుకునే అవకాశం ఉండేది.

పంచాయతీ ఎన్నికల ఓటమి నుంచి పూర్తిగా తేరుకోకుండానే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగలేదు కాబట్టి మాకు నలభై శాతం సీట్లు వచ్చాయని ఎవరు నమ్మినా నమ్మకపోయినా చెప్పుకున్నారు చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ అవకాశం లేదు. ఏ పార్టీకి ఎన్ని స్ధానాలు అన్న విషయం ఆయన బంటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా పత్రికా సమావేశం పెట్టి మరీ చెప్తాడు. ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబుకూ, తెలుగుదేశం పార్టీకి పరీక్షాసమయం. దీన్ని అధిగమించాలంటే చంద్రబాబు తన అనుభవం, చాకచక్యం మొత్తం బయటకు తీయవలసిన అవసరం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp