బిహార్‌ ఎన్నికల్లో బీజేపీకి ఊపు తెచ్చిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి

By Karthik P Oct. 25, 2020, 01:11 pm IST
బిహార్‌ ఎన్నికల్లో బీజేపీకి ఊపు తెచ్చిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి

అమెరికా అయినా ఇండియా అయిన రాజకీయం ఒక్కటే, ఓట్ల కోసం రాజకీయ నేతల హామీలు కూడా ఒకే మాదిరిగా ఉంటాయని స్పష్టమవుతోంది. హామీలు ఇవ్వడంలో విశ్వసనీయత, వాటి అమలు సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా.. అప్పటికప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తోంది. అమెరికా ఎన్నికలు అయినా.. మన దేశంలో జరిగే రాష్ట్ర ఎన్నికలైనా నేతల పంథా మాత్రం ఒకేలా సాగుతోంది.

ప్రస్తుతం భారత్‌లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పోటాపోటీ ప్రచారాలు సాగుతున్నాయి. బిహార్‌లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బిహారీలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా పేర్కొంది.

బీజేపీ హామీని చూసి చేశారా.. లేక యాదృచ్ఛికంగా జరిగిందో గానీ..అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన బైడెన్‌ కూడా ఇదే తరహా హమీ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తాను అధ్యక్షుడుగా గెలిస్తే అమెరికా పౌరులందరికీ ఆరోగ్య బీమా ఉందా.. లేదా..? అనేది చూడకుండా ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫెడరల్‌ ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేస్తుందని ప్రకటించారు.

ఇంకా ప్రయోగ దశ కూడా దాటిన వ్యాక్సిన్‌ వస్తుందా..? రాదా..? అనే విషయం ఎవరికీ తెలియదు. అసలు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనేది పరిశోధకులు కూడా చెప్పలేకపోతున్నారు. అప్పటికి కరోనా వైరస్‌ ఉంటుందా..? అంటే కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటిది కరోనా వైరస్, వ్యాక్సిన్‌ను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం ఉపయోగించుకోవడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారత్‌ వంటి దేశంలోనే కాకుండా.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా రాజకీయ పార్టీల నేతలు కరోనా వ్యాక్సిన్‌ను ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం విశేషం.

పైగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామంటే.. ఇటు భారత్‌లోనూ, అటు అమెరికాలోనూ పౌరులు నేతల హామీలను వ్యతిరేకించడం, విమర్శించకపోవడం గమనార్హం. తాజాగా బైడెన్‌ ఇచ్చిన హామీ వల్ల బిహార్‌లో ఇదే హామీ ఇచ్చిన బీజేపీకి ప్రత్యర్థి రాజకీయ పార్టీల విమర్శల నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా బీజేపీ ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్‌ హామీకి మరింత బలం చేకూరి, ఆ పార్టీకి లాభించే అవకాశం కూడా లేకపోలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp