మళ్లీ లాక్ డౌన్ అనివార్యమా, ఢిల్లీ అనుభవం ఏం చెబుతోంది..

By Raju VS Apr. 19, 2021, 03:15 pm IST
మళ్లీ లాక్ డౌన్ అనివార్యమా, ఢిల్లీ అనుభవం ఏం చెబుతోంది..

ఢిల్లీ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. దేశ రాజధాని నగరంలో వారం రోజుల లాక్ డౌన్ కి సిద్ధపడింది. అయితే ఢిల్లీ కన్నా తీవ్రంగా పరిస్థితులు కనిపించిన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ సహా వివిధ ఆంక్షల పట్ల ఆచితూచి వ్యవహరిస్తుంటే కేజ్రీవాల్ మాత్రం ముందడుగు వేశారు. వచ్చే సోమవారం వరకూ కఠిన ఆంక్షలు ఖరారు చేశారు.

వాస్తవానికి మహారాష్ట్రలో అస్తవ్యస్తంగా పరిస్థితి ఉంది. బెడ్స్ లభించకపోవడం, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. చివరకు వైజాగ్ నుంచి నాగ్ పూర్ ఆస్పత్రికి ఆక్సిజన్ తరలించాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ మినహా అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షల జోలికి పోలేదు.

అయినప్పటికీ ముంబై నుంచి వలస కూలీలు తిరుగుముఖం పడుతున్నారు. మళ్లీ లాక్ డౌన్ భయం వారిని వెంటాడుతోంది. గత ఏడాది లాక్ డౌన్ దేశంలో సామాన్యుడిని పూర్తిగా చితికిపోయేలా చేసింది. అనేక సమస్యలకు కారణమయ్యింది. ముందు చూపు లేకుండా ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కోవిడ్ ని నియంత్రించలేకపోగా దేశ ఆర్థికవ్యవస్థను కుదేలు చేసింది. అనేక కుటుంబాలు కుదేలుకావడానికి దోహదపడింది.. దాంతో రెండోసారి లాక్ డౌన్ విధించడానికి చాలామంది ససేమీరా అంటున్నారు. మొత్తం వ్యవస్థ స్తంభించేలా వ్యవహరించడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు.

మహారాష్ట్ర ని మించి గుజరాత్ లో ఘోరంగా ఉంది. చివరకు స్మశానాలు ఖాళీ లేక వెచి చూడాల్సిన పరిస్థితి ఉంది. యూపీలో అయితే స్మశానాలు నిండిపోయి రోడ్డు పక్కన శవాలు దహనం చేసిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి దయనీయ స్థితిలో కూడా ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ జోలికి పోవడం లేదు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయి లాక్ డౌన్ కి సిద్ధం కావడం ఆశ్చర్యం వేస్తోంది. ఏపీ లో కూడా పలు చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే జనసమ్మర్థం ఉండే ప్రాంతాలను నియంత్రించే చర్యలకు పూనుకుంటున్నారు. తెలంగాణా తరహా లో బడులు మూసివేసే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ వరకూ పరిస్థితి రాదనే అంచనాలున్నాయి. మే తర్వాత కాస్త శాంతిస్తే కరోనా సెకండ్ వేవ్ నుంచి గట్టెక్కలగమనే ధీమా అధికారుల్లో ఉంది. ఏమేరకు అది ఫలిస్తుందో చూడాలి.

Also Read : ఆ నేత‌ల నుంచి కరోనా ముప్పు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp