ఉన్నావ్ అత్యాచార ఘటనలో బిజేపి మాజీ ఎమ్మెల్యే దోషి

By Kiran.G Dec. 16, 2019, 03:47 pm IST
ఉన్నావ్ అత్యాచార ఘటనలో బిజేపి మాజీ ఎమ్మెల్యే దోషి

నిజంగా మన దేశంలో సామాన్యులకు అన్యాయం జరిగితే చట్టాలు తోడ్పాటునిస్తాయా. చట్టంలో ఉన్న లోపాలను లొసుగులను వాడి కొందరు బడాబాబులు చేసే అక్రమాలలో సామాన్యులకు జరిగే న్యాయం ఎంత? అంటే చాలామంది అంటున్నట్లు చట్టం కొందరికే చుట్టమా? ఉన్నావ్ అత్యాచార ఘటనలో జరిగిన మలుపులను పరిగణలోకి తీసుకుంటే చట్టం కొందరికే చుట్టం అనే విషయం అర్ధం అవుతుంది. కానీ బహిష్కృత బీజేపీ కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ కి ఉన్నావ్ అత్యాచార ఘటనలో శిక్ష ఖరారయిన నేపథ్యంలో దేశంలోని న్యాయవ్యవస్థపై మిణుకుమిణుకుమంటున్న ఆశలు మళ్ళీ చిగురించాయని చెప్పొచ్చు.

రెండున్నర సంవత్సరాల క్రితం 2017 జూన్ 4న, ఉన్నావ్ కి చెందిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శశిసింగ్ అనే మహిళ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ వద్దకు తీసుకెళ్లింది. కాగా తనపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ తన అనుచరులతో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది.కానీ దీనిపై పోలీసులు సరిగా స్పందించలేదు. మొక్కుబడిగా అపహరణ, బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటి కేసులు ఎమ్మెల్యేపై నమోదు చేసారు. పైగా బాధితురాలి తండ్రిపైనే అక్రమాయుధాలు కలిగి ఉన్నాడంటూ ఎదురు కేసు పెట్టారు సదరు ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా కొట్టడంతో బాధితురాలి తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.

తనపై దాడి చేయించింది ఎమ్మెల్యే సోదరుడు మనోజ్ సింగ్ అంటూ బాధితురాలు తండ్రి మాట్లాడుతున్న వీడియోలు బయటకు రావడంతో ఆందోళనలు ఎక్కువయ్యాయి.
అయినా యోగి సర్కార్ లో స్పందన కలగలేదు. ఈలోగా పోలీస్ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటికి కూడా ప్రభుత్వంలో స్పందన కలగలేదు. ఇక నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఇంటిముందే ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది. అప్పటివరకూ వెలుగులోకి రాని భయంకరమైన విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.దీనితో ముఖ్యమంత్రి యోగి సర్కార్ పై ఒత్తిడి పెరిగింది. దీనితో ఆమెకు పోలీసులతో రక్షణ కల్పించారు.బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసారు.

కానీ బాధితురాలు తన లాయర్ మరియు బంధువులతో కలిసి, రాయ్ బరేలి లో సబ్ జైలులో ఉన్న తమ బంధువు దగ్గరకు వెళ్లివస్తున్న తరుణంలో ఒక ట్రక్ ఢీ కొట్టడంతో బాధితురాలి పిన్ని పుష్ప, మరో బంధువు షీలా మృతి చెందారు. బాధితురాలికి, లాయర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ట్రక్కు నంబర్ ప్లేటుకు నల్ల రంగు పూసి ఉండటంతో కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ జైలులో నుండే బాధితురాలిని హత్య చేయించి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారన్న నిరసనలు దేశమంతటా వెల్లువెత్తాయి. పోలీస్ రక్షణ ఏర్పాటు చేసినా ప్రమాద సమయంలో పోలీసులు కారులో ప్రయాణించక పోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఈ సంఘటనపై సుప్రీం కోర్టుకు బాధితురాలు పలు లేఖలు రాసింది. కానీ పత్రికల్లో వార్తలు చుసిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. యూపీ నుండి ఢిల్లీ హైకోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల తీరును తప్పు బడుతూ బాధితురాలికి తక్షణమే 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. విచారణ 45 రోజుల్లో పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ తీస్ హజార్ కోర్టు,బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ వ్యవహరించిన తీరును కోర్టు తప్పుబట్టింది. ఐపిసి సెక్షన్ 376 ప్రకారం కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ తప్పు చేసారని కోర్టు వ్యాఖ్యానించింది. డిసెంబర్ 19 న కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ కు శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఐదు FIRలు నమోదయ్యాయి. ఒక FIR ను విచారించి బాలికను అపహరించి సామూహిక అత్యాచారం చేసారని కోర్టు తేల్చి చెప్పింది. మిగిలిన నాలుగు FIR లను విచారించి ఈ నెల 19 న శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే బీజేపీ కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ ను పార్టీ నుండి బహిష్కరించింది.కాగా కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ తీహార్ జైలులో ఉన్నారు.

శిక్ష దాదాపు ఖరారైన నేపథ్యంలో కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ కు ఎలాంటి శిక్ష పడుతుందో అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నిర్భయ చట్టం ప్రకారం, మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. అధికారం డబ్బు, పలుకుబడి ఉందన్న అహంకారంతో ఎలాంటి నేరాలు చేసినా చట్టం నుండి తప్పించుకోవచ్చని అనుకునే కొందరికి ఈ తీర్పు గొడ్డలిపెట్టులాంటిది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp