Visakhapatnam - పురంధేశ్వరి వ్యూహం ఇదేనా ?!

By Voleti Divakar Oct. 16, 2021, 07:30 pm IST
Visakhapatnam - పురంధేశ్వరి వ్యూహం ఇదేనా ?!

మాజీ కేంద్రమంత్రి , బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల ఢిల్లీ వెళ్లి విశాఖపట్నం నుంచి విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి వినతిపత్రాన్ని అందించారు . అలాగే ఐటి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విశాఖపట్నం పరిధిలో రైల్వే శాఖ అభివృద్ధి పనులు, ఐటి కారిడార్ అభివృద్ధిపై చర్చించి, వినతిపత్రాన్ని సమర్పించారు . విశాఖపట్నం అభివృద్ధిపై పురందేశ్వరి తీసుకుంటున్న ప్రత్యేకశ్రద్ధకు విశాఖవాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు . అదే సమయంలో ఇప్పటికిప్పుడు విశాఖపై అంత ప్రేమ ఏమిటో స్థానిక ప్రజలకు , రాజకీయ వర్గాలకు అంతుపట్టడం లేదు .

2024 ఎన్నికల్లో కూడా విశాఖ నుంచే పోటీ ?

2024 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకు వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి . టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎంత వ్యతిరేకించినా ఆయన వదిన గారైన దగ్గుబాటి పురందేశ్వరి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఎంపికపై ఇప్పటి వరకు వ్యతిరేకంగానూ ,అనుకూలంగానూ స్పందించలేదు . అయితే ఆమె విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నట్లు కనిపిస్తోంది .

నటుడు ఎన్టీ రామారావు కుమార్తె అయిన పురంధేశ్వరి చెన్నైలో పుట్టి పెరిగారు. తండ్రి రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆమె తెరచాటుగానే ఉన్నారు . ఆమె భర్త , మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోడల్లుడు చంద్రబాబునాయుడుతో కలిసి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు , ఆయన మరణం తరువాత తెలుగుదేశం పార్టీకి , రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాస్త దూరం జరిగారు . కొద్దికాలం కాంగ్రెస్ లో కొనసాగారు. నాటి నుంచి పురంధేశ్వరి రాజకీయాల్లో చురుగ్గా మారారు .

Also Read : DL Ravindra Reddy - మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా: డీఎల్‌

2004 ఎన్నికల్లో బాపట్ల నుంచి , 2009 లో విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొంది , కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2004 లో ఆమె టిడిపి తరుపున పోటీ చేసిన దివంగత మూవీ మొఘల్ డి రామానాయుడిని ఓడించారు . రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో ఆమె 2014 లో బిజెపిలో చేరారు . 2014 లో ఆమె కడప జిల్లా రాజంపేట నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి , ఓటమి చెందారు . 2019 లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి , వైసిపి హవాలో ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు .

భర్త వైసిపి ... భార్య బిజెపి

గత సార్వత్రిక ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు , పురందేశ్వరి దంపతులు వైసిపిలో చేరతారని , వారి కుమారుడు హితేష్ చెంచురామ్ ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది . అయితే సాంకేతిక కారణాల వల్ల చెంచురామ్ పోటీ చేయలేకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా పోటీలో దిగి , ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమిపాలయ్యారు . అదే ఎన్నికల్లో పురందేశ్వరి బిజెపి అభ్యర్థిగా విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు . 2009 లో విశాఖపట్నం ఎంపిగా గెలిచిన పురందేశ్వరి పదేళ్ల తరువాత మళ్లీ విశాఖ వైపు దృష్టిసారించి , గత ఎన్నికల్లో పోటీ చేశారు . ఎన్టీఆర్ కుమార్తెగా , టిడిపి అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ ప్రత్యర్థిగా భావించే పురందేశ్వరి పార్టీ ఆదేశాల మేరకు రాజంపేట , బాపట్ల వంటి ప్రాంతాల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది .

బిజెపి సీనియర్ నేత , విశాఖ మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్గా నియమితులు కావడంతో విశాఖపట్నంలో బిజెపికి కూడా సరైన అభ్యర్థి అవసరం ఏర్పడింది . ఈనేపథ్యంలో ఈఅవకాశాన్ని పురంధేశ్వరి తనకు అనువుగా మలుచుకునేందుకు విశాఖపట్నంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు . ఆమె వైఖరి చూస్తే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం బిజెపి అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి .

Also Read : Badvel By Poll-బద్వేల్ లో బీజేపీ కి ఎందుకు టెన్ష‌న్ ప‌ట్టుకుంది?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp