అమరావతిలో టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యంపై విమ‌ర్శ‌లు

By Kalyan.S Oct. 24, 2020, 08:10 am IST
అమరావతిలో టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యంపై విమ‌ర్శ‌లు

తెలుగుదేశం పార్టీ అధినేత నిర్ణ‌యాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంత‌కంత‌కూ ప్రాభ‌వం కోల్పోతున్న టీడీపీ కొంద‌రి నేత‌ల తీరుతో మ‌రింత దిగ‌జారుతోంది. ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ప‌లు కేసుల్లో అరెస్ట్ అవుతుండ‌డం, జైలు కెళ్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. మ‌రికొంద‌రు బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ తాము అనుకున్న‌దే జ‌ర‌గాల‌నే ధోర‌ణిలో ఉంటున్నారు. ఇందుకు దాడుల‌కు పాల్ప‌డ‌డానికి కూడా వెన‌కాడ‌డం లేదు. మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. మంగళగిరి నుంచి మందడం వికేంద్రీకరణ దీక్షకు వెళ్తూ ఉండగా కృష్ణాయపాలెంలో పేదలను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి పేదల ఆటోలు అడ్డుకున్న టీడీపీ నేతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడారు. దీనిపై స్పందించిన మహిళలు టీడీపీ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కృష్ణాయపాలెం రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడికి యత్నించిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

మహిళలు మాట్లాడుతూ..రాజధానిలో ఇళ్ల పట్టాలకోసం వెళ్తున్న తమపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ను తమపై ఎక్కించడానికి ప్రయత్నిస్తూ, ట్రాక్టర్ తొక్కించి చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఆటో అద్దాలు కూడా పగులగొట్టారని, మహిళలని చూడకుండా అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమపై దాడికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీ నేత‌ల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయ‌ని, దాడుల‌కు పాల్ప‌డ‌డం స‌రికాద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

త‌ర‌లివ‌స్తున్న మ‌హిళ‌లు

అమరావతిలోని మందడంలో అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష 245వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజధానిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన 52 వేలకు పైగా ఇళ్ల స్థలాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. దీక్ష కు భారీ స్థాయిలో మహిళలు తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 12 బార్ అసోసియేషన్ నుంచి భారీ స్థాయిలో న్యాయవాదులు చేరుకుని.. దీక్షకు సంఘీభావం తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp