క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు - డిఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి

By Kiran.G Jul. 03, 2020, 07:59 am IST
క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు - డిఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి

కరడుకట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబే ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసు బృందంపై దూబే గ్యాంగ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల సంఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందగా ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటుగా ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దాడిలో పోలీసుల రాకను వికాస్ దూబే గ్యాంగ్ ముందే పసిగట్టి భవనాలపై నక్కి పోలీసులు రాగానే విచక్షణా రహితంగా కాల్పులతో విరుచుకుపడ్డారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకు కాన్పూర్‌లోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బీతూర్‌ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 16 మంది పోలీసుల బృందం కరడుగట్టిన నేరస్తుడైన వికాస్ దూబేను అతని గ్యాంగ్ ను పట్టుకోవడానికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్ళింది. కాగా పోలీసుల రాకను ముందే పసిగట్టిన వికాస్ దూబే గ్యాంగ్ భవనాలపైనుండి ఆయుధాలతో విచక్షణా రహితంగా పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో డిప్యూటీ ఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల రాకను అడ్డుకోవాలని ఒక జేసీబీని పోలీసులు వచ్చే దారిలో నేరస్తులు అడ్డంగా ఉంచారు. పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు కూడా. దాదాపు అతనిపై 60 కేసులు ఉన్నాయి. అతని తలపై 25 వేల బహుమతి కూడా ఉంది. వికాస్ దూబేపై 50 కి పైగా హత్యా ప్రయత్నాలు జరిగాయి. బీతూర్‌ గ్రామంలో వికాస్ దూబే ఉన్నాడని సమాచారం రావడంతో పోలీసులు అర్ధరాత్రి ఒక టీం గా ఏర్పడి అతడిని పట్టుకోవడానికి వెళ్లగా నేరస్తులు దాడి చేయడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన అనంతరం నిందితులందరు అడవిలోకి పారిపోయారు. దీంతో పోలీసులు కాన్పూర్ సరిహద్దులను మూసివేసి తనిఖీలు చేస్తున్నారు.

కాన్పూర్‌లో నేరస్థులపై కాల్పులు జరిపి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి హెచ్‌సి అవస్థీని ఆదేశించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp