రామ‌కృష్ణా...ఏం మాట్లాడుతున్నారు?

By G.R Maharshi Feb. 06, 2020, 08:40 pm IST
రామ‌కృష్ణా...ఏం మాట్లాడుతున్నారు?

ఆరు నెల‌లు స‌వాసం చేస్తే వాళ్లు వీళ్ల‌వుతారట‌. చంద్ర‌బాబుతో పూసుకుని తిర‌గ‌డం వ‌ల్ల సీపీఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌కి కూడా మైండ్ పోయిన‌ట్టుంది. ఎందుకంటే ఆయ‌న గురించి తెలిసిన వాళ్లంద‌రికీ షాక్ త‌గిలేలా నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు.

రామ‌కృష్ణ గాలివాటం నేత కాదు. ఏఐఎస్ఎఫ్‌లో సుదీర్ఘ కాలం ఉద్య‌మాలు చేసిన వ్య‌క్తి. విద్యార్థుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా ముందుండి పోరాడిన వాడు. సౌమ్యుడు, ఆచితూచి మాట్లాడే మ‌నిషి. పార్టీపైన‌, ప్ర‌జాస్వామ్యంపైన గౌర‌వం ఉన్న నాయ‌కుడు.

అలాంటి రామ‌కృష్ణ అమ‌రావ‌తి విష‌యంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయ‌న‌కే తెలియ‌దు. చంద్రబాబుకి వ‌య‌స్సు అయిపోయి మ‌తిచ‌లించి మాట్లాడుతున్నాడంటే అర్థం ఉంది. మీకేమైంది రామ‌కృష్ణా? నారాయ‌ణ నోటి దురుసుత‌నాన్ని వార‌స‌త్వంగా తెచ్చుకున్నారా?

జ‌గ‌న్ క‌నిపిస్తే మ‌హిళ‌లు ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తారా? ఒక ముఖ్య‌మంత్రిని అనాల్సిన మాట‌లేనా ఇవి? పోలీసుల్ని అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ తిరుగుతున్నాడా? ముఖ్య‌మంత్రి పోలీస్ ఎస్కార్ట్ లేకుండా తిర‌గాల‌ని మీ ఉద్దేశ‌మా? గ‌తంలో చంద్ర‌బాబు ఎప్పుడైనా తిరిగాడా? రైతుల‌కి అన్యాయం జ‌రిగితే దాని గురించి మాట్లాడ‌టం స‌బ‌బు కానీ, తిట్ల పురాణం వ‌ల్ల ప‌డిపోయేది మీ వ్య‌క్తిత్వ‌మే.

అస‌లు ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టు పార్టీకి ఎంత గుర్తింపు ఉండేది. తొలి రోజుల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తుందేమో అనేంత ఊపు ఉండేది. ఈ రోజు అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానాలు ఖాళీ. వాటి సంగ‌తి అటుంచితే వార్డుల్లోనైనా న‌మ్మ‌కంగా గెల‌వ‌లేని స్థితి. ప్ర‌జ‌ల‌కు ఎందుకు దూర‌మ‌య్యారో, ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ఎందుకు దూరంగా పెడుతున్నారో ఆలోచించండి. మంత్రి బొత్స‌ను ప‌ట్టుకుని గాడిద అన‌డం ఏ ర‌క‌మైన విజ్ఞ‌త‌?

అమ‌రావ‌తి ప్ర‌జ‌లు శాంత‌మూర్తుల‌న్నారు, మంచిదే. అదే మా రాయ‌ల‌సీమ‌లో అయితే ఎక్క‌డిక‌క్క‌డ ప‌గ‌ల‌గొట్టే వాళ్ల‌మ‌న్నారు. సినిమా వాళ్లు రాయ‌ల‌సీమ‌ను ఇప్ప‌టికే గబ్బు ప‌ట్టించారు. సీమ అంటే రౌడీలు, గూండాలు, ఫ్యాక్ష‌నిస్టులు, ఆవేశ‌ప‌రుల‌ని, న‌రుక్కొని చ‌స్తార‌ని ద‌శాబ్దాలుగా చూపించారు. మీ మిత్రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిన్న‌మొన్న కూడా సీమ‌ని, ముఖ్యంగా క‌డ‌ప‌ని తిట్టాడు. వాళ్లెవ‌రో అన్నారంటే అర్థ‌ముంది. మీరు కూడా అంటే ఎట్లా? నిజానికి సీమ ప్ర‌జ‌లు అత్యంత శాంతిప‌రులు. ఎందుకంటే వాళ్లు క‌రువుతో క‌లిసి జీవించారు. కాసింత తిండి కోసం వ‌ల‌స‌లు వెళ్లారు. నీళ్లు లేవు, ప‌రిశ్ర‌మ‌లు లేవు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. తాగ‌డానికి కాసిన్ని నీళ్ల కోసం మైళ్ల దూరం బిందెల‌తో వెళ్తారు. వ‌ర్షం కోసం ఎదురు చూసి క‌ళ్లు కాయలు కాచినా , వాన దేవుడికి పూజ‌లు చేసి వేడుకుంటారు త‌ప్ప కోప‌గించుకోరు.

అన్ని ప్ర‌భుత్వాలు వాళ్ల‌ని మోసం చేసినా , నిల‌దీసి అడ‌గ‌లేని శాంత‌మూర్తులు. వాళ్లు నిజంగా ఉద్రేక‌ప‌రులైతే ప్ర‌భుత్వాల మెడ‌లు వంచి, త‌మ‌కు కావాల్సింది తెచ్చుకునే వాళ్లు. ఎవ‌రో వ‌చ్చి ఏదో చేస్తార‌నే ఆశ‌ప‌డే అత్యంత అమాయ‌క శాంత‌ప‌రులు.

అన్నీ ఉన్న‌వాళ్లు శాంతంగా ఉంటే స‌హ‌జం. ఏమీ లేక‌పోయినా శాంతంగా ఉంటే అది గొప్ప‌త‌నం.
నింద‌లు మోస్తూ బ‌తికిన సీమ ప్ర‌జ‌ల్ని , మ‌ళ్లీ మీరు కూడా ఎందుకు నిందిస్తారు?

క‌మ్యూనిస్టు పార్టీ ప్ర‌ణాళిక‌ల‌ను అర్థం చేసుకోవ‌డం క‌ష్టం. ప్ర‌జ‌ల్ని అర్థం చేసుకోవ‌డం సుల‌భం. అదే మీరు మ‌రిచిపోతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp