గుడ్‌ న్యూస్‌: కరోనా కేసులు తగ్గుతున్నాయ్‌..!

By Jaswanth.T Sep. 27, 2020, 11:00 am IST
గుడ్‌ న్యూస్‌: కరోనా కేసులు తగ్గుతున్నాయ్‌..!

ఏపీలో కోవిడ్‌ 19 పాజటివ్‌ల నమోదు ఉధృతి తగ్గుతుందా.. అవుననే అంటున్నారు నిపుణులు. గత నెలరోజులుగా ఏపీలో రోజుకు పదివేల కేసులకు అటూ ఇటూగా పాజిటివ్‌లు వెలుగు చూసాయి. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో కేసుల నమోదు కన్పించడం లేదు. 7వేల సమీపానికి చేరుకున్నాయి. పోనీ అలాగని వైద్య పరీక్షలేమైనా తగ్గించారా? అంటే అదీ లేదు. ఎప్పటి మాదిరిగానే ప్రతి రోజూ 73,000 – 75,000 వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్‌ పాజిటివ్‌ల సంఖ్య తగ్గుదల దిశగా సాగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి సెప్టెంబర్‌ మొదటి వారంలోనే కోవిడ్‌ వ్యాధి విజృంభణ అత్యధిక స్థాయికి చేరుకుని, అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతుందని అంచనా వేసారు. అయితే కేసుల పెరుగుల సెప్టెంబరు చివరి వరకు కొనసాగిందని ఇప్పుడు అంచనాలను సవరిస్తున్నారు. అయితే గత వారం రోజులుగా ఏడువేల కేసులకు అటూ ఇటూగానే పాజిటివ్‌లు బైటపడుతుండడంతో వైద్య వర్గాలు ఆశావహ దృక్ఫథంతోనే చూడాల్సిన అంశంగా పేర్కొంటున్నారు.

మరోవైపు రికవరీ అయిన వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాప్తి రేటును అంచనా వేసేందుకు పాజిటివ్‌లతోపాటు, రికవరీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బైటపడుతున్న పాజిటివ్‌ల కంటే రికవరీలు అధికంగా ఉండడంతో జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఏపీలో రికవరీ సగటు మెరుగ్గా ఉందని వివరిస్తున్నారు.

కాగా ఏపీలోని పలు జిల్లాల్లో మాత్రం వైరస్‌ వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలోని అత్యధిక జన సాంద్రతతో ఉండే జిల్లాల్లో ఒకటైన తూర్పుగోదావరిలో కోవిడ్‌ఉధృతి కొనసాగుతోంది. రోజుకు వెయ్యికిపైగా కేసులు బైటపడడం గత నెలురోజులగా కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ జిల్లాలో ఇప్పటి వరకు బైటపడ్డ పాజిటివ్‌ కేసులు 93,184కు చేరుకుంది. వీరిలో 81,821 మంది రికవరీ అయ్యి ఇళ్ళకు చేరుకున్నారు. 10,856 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ప్రభుత్వ బులిటెన్‌ స్పష్టం చేస్తుంది.

అలాగే కోవిడ్‌ ఉధృతి కొనసాగుతున్న మరో జిల్లాగా పశ్చిమగోదావరి ఉంది. ఇక్కడ కూడా 900 పైచిలుకు పాజిటివ్‌లు ప్రతి రోజూ వెలుగు చూస్తున్నాయి. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు 63,504 పాజిటివ్‌లను గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 5,865 మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 57,199 మంది రికవరీ అయ్యారు.

చిత్తూరు జిల్లాలో కూడా 900లకుపైగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇప్పటి వరకు 59,243 పాజటివ్‌లు బైటపడగా 6,557 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 52,053 మంది రికవరీ అయ్యారు. మిగిలిన అన్ని జిల్లాల కంటే చిత్తూరులోనే అత్యధికంగా 633 మందిమృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 5,663 మంది మృత్యువాత పడ్డారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp