ఖైదీల్లో కరోనా కలవరం

By Voleti Divakar Aug. 07, 2020, 07:40 pm IST
ఖైదీల్లో కరోనా కలవరం

కలెక్టరైనా ఖైదీ అయినా నాకు ఒక్కటే అని తేల్చేసింది కరోనా మహమ్మారి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే జైళ్లలోని ఖైదీలనూ వదలడం లేదు. నేరాలు చేసి వచ్చిన ఖైదీలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాతే జైళ్లలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జైళ్లలోనూ ఖైదీల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, వారికి శానిటైజర్లు, మాస్కులు కూడా అందించామని అధికారులు చెబుతున్నారు. అలాగే కరోనా జైళ్లను ఏర్పాటు చేసి రిమాండ్ ఖైదీలందరికీ ముందుగానే పరీక్షలు చేసి, నెగిటివ్ వచ్చిన వారినే జైళ్లకు పంపుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా జైళ్లలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోందన్నదే ఆందోళన కలిగిస్తున్న అంశం.

కోస్తాంధ్ర రీజియన్ పరిధిలో ఇప్పటి వరకు 480 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఒక్క రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 1670 మంది ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉండగా వీరిలో 265 మందికి కరోనా సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అందరికి పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు 900 మందికి సంభందించిన ఫలితాలు మాత్రమే వచ్చాయి. ఖైదీ ఒకరు కరోనాతో మృతి చెందారు. రీజియన్ పరిధిలో సుమారు 80 మంది సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. ఖైదీల్లో సుమారు 4గురు కరోనాతో మృతి చెంది ఉండవచ్చని సమాచారం. ఒక జైలు సిబ్బంది కూడా కరోనాతో మృతి చెందారు.

కరోనా తొలి దశలో రిమాండ్ ఖైదీలుగా వచ్చిన వారి నుంచి, గార్డు విధులు నిర్వహించే వారి నుంచే కరోనా జైళ్లలోని మిగిలిన ఖైదీలకు చుట్టబెడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కోవిడ్ జైళ్లలో నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో జాప్యం జరగడం కూడా కరోనా వ్యాప్తి చెందడానికి కారణం కావచ్చని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాజారావు పేర్కొన్నారు. కోవిడ్ పరీక్షా ఫలితాలు వెలువడేందుకు 3-4రోజుల సమయం పడుతోంది. అప్పటి వరకు ఖైదీలను ఎక్కడా ఉంచేందుకు వీలుగాక జైళ్లకే పంపుతున్నారు. ఫలితాలు వెలువడే లోగా జైలుకు వచ్చిన ఖైదీలు ఇతర ఖై దీలతో కలవడంతో కరోనా జైళ్లలోకి వేగంగా జొరబడుతోంది. దీంతో జైళ్లలోని ఖైదీలు ఒకవైపు కరోనా భయంతోనూ, మరోవైపు కుటుంబ సభ్యులకు దూరమయ్యామున్న మానసిక ఆవేదనలో గడుపుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp