మావోయిస్టులపై కరోనా దండయాత్ర

By Ramana.Damara Singh May. 13, 2021, 05:40 pm IST
మావోయిస్టులపై కరోనా దండయాత్ర

మానవ సమాజంపై విరుచుకుపడుతున్న కోవిడ్ దట్టమైన అడవుల్లో కి సైతం చొరబడుతోంది. తనకు ఎవరూ మినహాయింపు కాదనే రీతిలో మావోయిస్టు లపైనా దండయాత్ర చేస్తోంది. ఆంధ్ర సరిహద్దుల్లోని దండకారణ్యంలో కరోనా ప్రబలినట్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా దెబ్బకు బస్తర్ అడవుల్లో సుమారు 100 మంది మావోయిస్టులు అనారోగ్యం పాలయ్యారని.. వారిలో పదిమంది వరకు మృతి చెందారని పోలీసు బలగాల ద్వారా తెలుస్తోంది.

సరిహద్దు జిల్లాల్లో..
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని దక్షిణ బస్తర్ అడవుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు కరోనా బారిన పడుతున్నారు. కలుషిత నీరు, ఆహారం కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తోందని దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. వీరి వల్ల సమీప అటవీ గ్రామాల గిరిజనులు కూడా వైరస్ బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిజమేనని విశ్వసనీయ వర్గాల ద్వారా ధృవపర్చుకున్నామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల కుంట, డోర్నపాల్ ప్రాంతాల్లో

గిరిజనులకు వేసేందుకు కోవిడ్ టీకాలు, మందులు తీసుకెళ్తున్న ప్రభుత్వ సిబ్బందిని మావోయిస్టులు అడ్డగించి టీకాలు, మందులు ఎత్తుకుపోవడం కూడా ఈ సమాచారాన్ని బలపరుస్తోంది.

అగ్రనేత సుజాత కూడా..
కరోనా బారిన పడిన మావోయిస్టుల్లో ఒకప్పటి మావోయిస్టు అగ్రనేత, పోలీసు కాల్పుల్లో హతమైన ఆజాద్ సతీమణి సుజాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై పలు కేసులు పెండింగులో ఉండగా.. ఆమె తలపై రూ.25 లక్షల రివార్డ్ కూడా ఉంది. ప్రస్తుతం మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె.. గత నెలలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఊచకోత ఘటనకు మరో నేత హిద్మాతో కలిసి పథకం రచించినట్లు తెలిస్తోంది. హిద్మాకు ముందు కొన్నాళ్ళు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా కూడా వ్యవహరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఊపిరితిత్తుల సమస్యతో ఆమె ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గంగలూరు ఏరియా కమిటీ, దర్భా డివిజన్ నాయకులు దినేష్, సోను జయలాల్ వారి టీముల్లోని అందరూ సభ్యులు కూడా కరోనాతో బాధపడుతున్నారు. జయలాల్, దినేష్ లపై తలా రూ. 10 లక్షల రివార్డులు ఉన్నాయి.

లొంగిపోతే చికిత్స చేయిస్తాం
కరోనా సోకిన మావోయిస్టుల్లో ఇప్పటికే పది మంది చనిపోగా.. వారి మృతదేహాలను అడవుల్లోనే దహనం చేశారని అటవీ గ్రామాల నుంచి సమాచారం అందినట్లు ఎస్పీ పల్లవ తెలిపారు. గత ఏడాది తొలి వేవ్ సమయంలోనూ ఒక మహిళా మావోయిస్టు జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడుతుంటే తోటి మావోలు ఆమెను కాల్చి చంపేసినట్లు తెలిసింది. కాగా అటవీ గ్రామాల్లోని కోవిడ్ ప్రబలే ప్రమాదం ఉన్నందున వైరస్ సోకిన మావోయిస్టులు లొంగిపోవాలని.. అందరికీ చికిత్స చేయిస్తామని ఎస్పీ పల్లవ విజ్ఞప్తి చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp