తాటి పండు పడేందుకు సిద్దంగా ఉందా..?

By Jaswanth.T Sep. 28, 2020, 09:20 pm IST
తాటి పండు పడేందుకు సిద్దంగా ఉందా..?

మూలిగే నక్కమీద తాటిపండు పడ్డం అంటే.. అప్పటికే చచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిపై మరింత పెద్ద భారం పడిపోవడమే. సరిగా ఇప్పుడు దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఇదే స్థితిలో ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. పెద్ద, చిన్న అన్న తేడాల లేకుండా వ్యవస్థలు, వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలు కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇబ్బందుల్లోనే కొనసాగుతున్నారు.

దీని ప్రభావం నేరుగా ప్రభుత్వాలు కూడా ఎదుర్కొంటున్నాయి. ఒక పక్క ఆదాయం రాకపోగా, మరో పక్క విపరీతమైన ఖర్చులు పెరిగిపోయాయి. అనుకోకుండా ఏర్పడిన ఈ స్థితిని ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధత లేని దేశాలు తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తున్నట్లు ఆయా ఆర్ధిక వ్యవస్థల పనితీరును గమనిస్తేనే అర్ధమవుతోంది. మన దేశంలో సైతం జీఎస్‌టీ బకాయిలు రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితుల్లో లేమని, అప్పు తెచ్చుకోమని నరేంద్రమోదీ సర్కారు సలహా కూడా ఇచ్చేసింది. దీంతో ఆయా రాష్ట్రాలో అప్పుల కోసం వెతికే క్రమంలో బిజీబిజీగా ఉన్నాయి.

ఇప్పటి వరకు కోవిడ్‌ను ఎదుర్కొవడం ఒకెత్తయితే, ఇక్కడ్నుంచి ఎదుర్కొవడం మరో ఎత్తుగా ఉంటుందని ఆర్ధిక, వైద్య రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనజీవనం సాధారణ పరిస్థితుల వైపునకు అడుగులు వేస్తుంది. ఇది ఇలాగే కొనసాగాలంటే వైద్య పరీక్షలు, వైద్య సదుపాయం కల్పిస్తూనే.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చేస్తున్న ఖర్చుకు అదనంగా టీకాల ఖర్చు తోడవుతుందన్నమాట. ఇందుకోసం ఒక్క మనదేశంలోనే దాదాపు 80వేల కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అంటే ఇప్పటి ఇప్పటి వరకు చేస్తున్న ఖర్చుకు, వ్యాక్సినేషన్‌ ఖర్చులు అధికం అన్నమాట. ఒక పక్క ఆదాయం వచ్చే మార్గాలు కన్పించడం లేదని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిని ఆయా దేశాలు ఏ విధంగా ఎదుర్కొంటాయన్న ఉత్కంఠత నెలకొటోంది.

వ్యాక్సిన్‌ తుదిదశ ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఇప్పటికే పలు అగ్ర రాజ్యాలు తమతమ దేశాల ప్రజలకు టీకాల నిమిత్తం ముందస్తు ఆర్డర్లకు సిద్ధమవుతున్నాయి. పంపిణీ సంబంధిత కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే మధ్య తరగతి, పేద దేశాల్లో మాత్రం అటువంటి సన్నద్ధత ఏదీ కన్పిస్తున్న దాఖలాల్లేవు. నిజానికి భారీగా చేపట్టాల్సిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తగినన్ని నిధులు వెచ్చించగలిగే స్థితిలో ఆయా దేశాలు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది తల్చుకుంటేనే భీతిగొల్పక మానదు.

మన దేశంలో ఖర్చవుతుందని భావిస్తున్న ఎనభైవేల కోట్లకే ఇక్కడ కటకటలాడే పరిస్థితి ఉంటుంది. మరి మనకంటే వెనుకబడే దేశాల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో ధనిక, పేద అన్న వ్యత్యాసాల్లేకుండా వ్యాక్సిన్‌ను లాభాపేక్ష అనేది కన్పించకుండా ప్రపంచ వ్యాప్తంగా అందించడానికి ఏదైనా కార్యచరణ ఉంటుందా? లేక పోతే ఎవరి మానాన వారిని వదిలేస్తారా? ఇటువంటి ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు మాత్రం దొరకడం కష్టమే. అయితే ఈ యేడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను సిద్ధం చేసేయాలన్న కృతనిశ్చయంతో మాత్రం పలు సంస్థలు శతవిధాలా ప్రయత్నాల్లో ఉన్నాయన్నది మాత్రం వాస్తవం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp