18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌.. ఎప్పటి నుంచంటే..?

By Karthik P Apr. 19, 2021, 08:20 pm IST
18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌.. ఎప్పటి నుంచంటే..?

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ తీసుకోవడమే ప్రధాన మార్గంగా భావిస్తున్న తరుణంలో.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. మే 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగతా 50 శాతం మార్కెట్‌లో విక్రయించుకునేందుకు ఉత్పత్తి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ప్రకటించింది. కేంద్రానికి వచ్చే 50 శాతం టీకాలను ఆయా రాష్ట్రాలకు జనాభా ప్రకారం సమానంగా పంచనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే.. నేరుగా ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. మార్కెట్‌లోనూ నిర్ణయించిన ధరకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్‌ లభించనుంది.

Also Read : ఈటల ఇలా.. శ్రీనివాసరావు అలా.. కరోనాపై పొంతన లేని మాటలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ అందిస్తోంది. మొదటి విడతలో కోవిడ్‌ వారియర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు, 50 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో విడతలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో మూడో విడతగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వైద్య శాఖ ద్వారా అందిస్తున్నాయి.

18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తే.. సరిపడినంతగా వ్యాక్సిన్‌ సరఫరా ఉంటుందా..? అనే అనుమానాలు లేకపోలేదు. అయితే వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూనే ఉంది. మూడో విడత వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు విడుదల చేసేందుకు ముందే.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు దృష్టి పెట్టింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇస్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు భారీగా రుణం మంజూరు చేసింది. సీరం ఇస్టిట్యూట్‌కు 3 వేల కోట్ల రూపాయలు, భారత్‌ బయోటెక్‌కు 1500 కోట్ల రూపాయలు.. వెరసి 4,500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసేందుకు రుణం ఇచ్చింది. దీంతోపాటు మార్కెట్‌లో 50 శాతం టీకాలు విక్రయించుకునే అవకాశం కల్పించడంతో.. తయారీ సంస్థలు భారీగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తాయనడంలో సందేహం లేదు.

జ్వరం, వొళ్లు నొప్పులు వస్తుండడంతో పెద్దలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. పైగా వ్యాక్సిన్‌పై అనేక అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి. అయితే 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తే.. ఈ అనుమానాలు పటాపంచలు అయ్యే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు యువకులు ఉత్సాహంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొదలైన తర్వాత దేశంలో వ్యాక్సినేషన్‌ భారీగా జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. ఇప్పటి వరకు దాదాపు 10 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. ఈ శాతం భారీగా పెరుగుతుంది.

Also Read : కరోనాపై పోరు : ఏపీలో స్కూల్స్ బంద్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp