కొవిడ్ కాలం.. వీడియో కాల్ లో ప్ర‌మాణస్వీకారం

By Kalyan.S May. 07, 2021, 03:10 pm IST
కొవిడ్ కాలం.. వీడియో కాల్ లో ప్ర‌మాణస్వీకారం

దేశంలో క‌రోనా కేసుల పెరుగుద‌ల‌కు ఎన్నిక‌లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు, అనంత‌రం క‌రోనా కేసుల మ‌ధ్య వ్య‌త్యాసం ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. తెలంగాణ‌లో జ‌రిగిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక కూడా క‌రోనా కేసులు పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌నే వాద‌న ఉంది. ఏకంగా సీఎం కేసీఆర్, నాడు టీఆర్ఎస్ అభ్య‌ర్థి, నేడు ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ స‌హా మంత్రి కేటీఆర్ స‌హా దాదాపు 60 మంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డ‌డానికి అదే కార‌ణ‌మ‌న్న అనుమానాలు వ‌చ్చాయి. అది అలా ఉండ‌గా, అనంత‌రం ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ స‌హా ఐదు మున్సిపాల్టీల‌కు ఇటీవ‌లే ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. నేడు ప్ర‌మాణ స్వీకారం కూడా జ‌రుగుతోంది. మేయ‌ర్, చైర్మ‌న్ ల ఎవ‌ర‌నేది ప‌క్క‌న‌బెడితే.. క‌రోనా పుణ్య‌మా అని ప్ర‌మాణ స్వీకారం కొంత పుంత‌లు తొక్కుతోంది.

గెలిచిన త‌ర్వాత ఎప్పుడెప్పుడు ప్ర‌మాణ స్వీకారం చేస్తామా..? అని వారు ఎదురుచూస్తున్నారు. కానీ వారు క‌రోనా బారిన ప‌డితే.. ఇప్పుడు కొంద‌రిని ఆ స‌మ‌స్యే ప‌ట్టి పీడిస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన 8 మంది టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌చారం కోసం ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గ‌డ‌మే వారి కొంప ముంచింది. ఓ వైపు గెలిచిన ఆనందం ఉన్నా.. క‌రోనా సోక‌డంతో ఆయా కుటుంబాలు సంబ‌రాల‌కు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన వారు ప్ర‌మాణ స్వీకారానికి కూడా రాలేని ప‌రిస్థితి. తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లతో జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయం చాలా బాధాకరమన్నారు. గెలుపోందిన వారు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారంతో పాటు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కొత్త కార్పొరేట‌ర్ల‌కు క‌రోనా భ‌యం..

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక శుక్రవారం జరుగనుంది. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వెనకాల గల ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలో నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు చేతులెత్తి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు తమ అంగీకారాన్ని ఓటు రూపంలో తెలియచేస్తారు. మేయర్‌గా ఎన్నిక కావాలంటే 36 మంది కార్పొరేటర్ల కంటే ఎక్కువ మద్దతు కావాల్సి ఉంటుందని అధికారులు తెలియచేశారు. సాయంత్రం 3.30 గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుంది. ఈ మేరకు అధికారగణం సర్వం సిద్దం చేసింది. కాగా, నూతన కార్పొరేటర్లను కరోనా భయం వెంటాడుతోంది.

పీపీఈ కిట్లు ధ‌రించి ఆ అభ్య‌ర్థుల వ‌ద్ద‌కు...

గెలిచిన వారిలో ఇప్పటికే కొందరు వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీంతో వారు ఎన్నిక వేదిక వద్దకు రాకుండానే ప్ర‌మాణ స్వీకారం చేసే ఏర్పాట్లు చేశారు అధికారులు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన కార్పొరేటర్లలో 8 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు తెలిసింది. వీరు వీడియోకాల్‌ ద్వారా ప్రమాణ స్వీకారం, ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. వైరస్‌ బారిన పడిన వారి వద్దకు అధికారులు పీపీఈ కిట్లు ధరించి వెళతారు. వీడియోకాల్‌ ద్వారా తతంగం పూర్తి చేయిస్తారు. ఎన్నిక వేదిక వద్ద ఉన్న ఎల‌క్ట్రానిక్ డిజిటల్‌ స్ర్కీన్‌పై ప్రీసైడింగ్‌ అధికారి సమక్షంలో అందరూ వీక్షిస్తారు. 66 మంది నూతన కార్పొరేటర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యులు, ముఖ్యమైన అధికారులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp