కొవ్యాక్సిన్ పై విమర్శలు.. ప్రజల్లో ఆందోళనలు..

By Voleti Divakar Jan. 05, 2021, 12:55 pm IST
కొవ్యాక్సిన్ పై విమర్శలు.. ప్రజల్లో ఆందోళనలు..

దేశీయంగా భారత్ బయోటిక్ తయారు చేసిన కరోనా నిరోధక టీకా రాజకీయ నేతలకు టార్గెట్ గా మారింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కొవ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు జారీ చేసిందన్న ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అధికార బిజెపి టీకాను సమర్దిస్తుండగా, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ లు దీని సామర్ధ్యం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సీఎండీ డా. కృష్ట ఎల్ల స్పందించారు. కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుందని, అయితే రాజకీయలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక మంది.. భారతీయ కంపెనీలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘సైన్స్‌యే నాకు ఆక్సిజన్, నేను తమిళనాడుకు చెందిన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి వ్యాపారంలో అసలేమాత్రం ప్రవేశం లేదు. మా సంస్థకు టీకాల తయారీలో విశేషానుభవం ఉంది. మా సేవలు ప్రపంచంలోని 123 దేశాలకు చేరుతున్నాయి. బ్రిటన్‌తో పాటూ మొత్తం 12 దేశాల్లో మేం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. భారత్‌లోనూ సృజనాత్మకత ఉంది. ఇదేమీ కాపీలు కొట్టే దేశం కాదు. కేవలం స్వదేశీ సంస్థ అయిన కారణంగా మాపై ఈ స్థాయిలో ఆరోపణలు రావడం భావ్యం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫైజర్ కంపెనీతో పోల్చుకుంటే తమ టీకా ఏరకంగానూ తక్కువకాదని, కరోనా టీకా తయారీ ప్రక్రియపై ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని గర్వంగా ప్రకటించారు. బ్రిటన్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ను కూడా డా. కృష్ణ ప్రస్తావించారు. బ్రిటన్‌లోని ట్రయల్స్‌‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించరూ..? మా టీకాను ఓ కంపెనీ మంచి నీళ్లతో పోల్చింది. శాస్త్రవేత్త అయిన నన్ను ఇది ఎంతో బాధించింది. ఇది తగదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు భారతదేశాన్ని సుమారు ఏడాది పాటు అతలాకుతలం చేసిన కరోనా వైరసను తరిమేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా 279 కేంద్రాలలో డ్రై రన్ పేరిట సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా కేంద్రాలతో పాటు 39 కేంద్రాల్లో డ్రై రన్ ను చేశారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. తొలి దశలో కోటి మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వర్గాల వారికి టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. జూలై నాటికి దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది ప్రజలకు కరోనా నిరోధక టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశీయ టీకాను అభివృద్ధి చేసి, కోట్లాది మంది ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్రమోడీ గతంలో టీకా ప్రయోగాలు జరిగిన హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ను సందర్శించి, పరిశోధనల ప్రగతిని సమీక్షించడం గమనార్హం. ప్రజలకు దేశీయ టీకా ను అందిస్తామని ఇటీవల ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో ఇప్పటికే కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ పై వాదోపవాదాలు సాగడం ప్రజలను ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp