సెలక్ట్ కమిటీకి రాజధాని బిల్లు, తరువాత ఏంటి?

By Sannapareddy Krishna Reddy Jan. 24, 2020, 11:04 am IST
సెలక్ట్ కమిటీకి రాజధాని బిల్లు, తరువాత ఏంటి?

"ఇది సమంజసమైన చర్య కాదు" అంటూనే శాసనమండలి సభాపతి షరీఫ్ మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి పంపడం చూశాక వైసీపీ వారికి కానీ, ఇతర ప్రజలకు కానీ ఒక విషయం అర్ధమై ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం చెందినా వివిధ వ్యవస్థలలో చంద్రబాబు నాటిన మొక్కలు ఇప్పటికీ సజీవంగా, బలంగా ఉన్నాయి, అవసరమైనప్పుడు ఆయనకు అండగా నిలబడడానికి వెనకాడకుండా ఉంటాయని మరోసారి రుజువైంది.

అయితే మూడు చోట్ల రాజధాని విభాగాలు అన్న ఆలోచన మీద స్ధిరంగా సాగిపోతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనకు ఇది తాత్కాలిక ఆటంకమే కానీ, ఆ ఆలోచన ఉపసంహరింపజేసే అడ్డంకి మాత్రం కాదు.

శాసనమండలి అవసరమా?

ప్రజాధనం వృధా కావడం తప్ప శాసనమండలి వల్ల మరే ప్రయోజనం లేదని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలిని రద్దు చేశారు. అయితే రాజకీయ నిరుద్యోగులకు, శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి, భంగపడ్డ వారికీ ఉపాధి కల్పించడం కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ వ్యవస్థని పునరుద్ధరించారు. ఇవే ప్రయోజనాల కోసం తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మండలిని కొనసాగించారు. అంతే కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తనయుడు లోకేష్ బాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో పోటీ చేయించే రిస్క్ తీసుకోకుండా ముందు మంత్రిని చేసి ఆ పిమ్మట ఎమ్మెల్శీని చేశారు.

Read Also: ఇద్ద‌రు మంత్రులు భవిషత్తు ?

అయితే ఇప్పుడు వైసీపీకి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉన్నా మండలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ వలన బిల్లులు ఆమోదం పొందడంలో ఆటంకాలు ఎదురవకుండా శాసనమండలి రద్దు చేయాలని కొందరు అధికార పక్ష నాయకులు ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే ఇది జరగాలంటే సమయం పట్టడమే కాకుండా, కేంద్రం మద్దతు కూడా అవసరం. అదీ కాకుండా కొన్ని రోజులు గడిస్తే ఎమ్మెల్సీల కాలపరిమితి తీరిపోయి,కొత్త వారు ఎన్నికయే కొద్దీ వైసీపీకి మెజారిటీ వస్తుంది. అంతే కాకుండా మండలి ఒకటి ఉంటే అసంతృప్తులకు అక్కడ స్థానం కల్పించవచ్చు.

అందుకే శాసనమండలిలో బిల్లు మీద ఓటింగ్ పెడితే అందులో నెగ్గడానికి కొందరు అనుకూలంగా ఓటేసేలా, కొందరు గైరుహాజరు అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు అధికార పార్టీ వారు. అయితే ఉహించని విధంగా స్పీకర్ సెలక్ట్ కమిటీని తెర మీదకు తెచ్చారు.

Read Also: మండ‌లికి మంగ‌ళం పాడితే వాళ్ల ప‌రిస్థితి ఏమిటీ?

సెలక్ట్ కమిటీ అంటే ఏమిటి?

ఏవైనా బిల్లులు సభ మొత్తం చర్చించడం కన్నా పరిమిత సంఖ్యలో సభ్యులు కూలంకషంగా చర్చించి తమ నిర్ణయాన్ని సభకు తెలియచేయడం మంచిది అని సభాపతి భావించినప్పుడు సెలక్ట్ కమిటీ వేస్తారు. ఇందులో వివిధ పార్టీలకు సభలో ఉన్న బలం మేరకు ఆయా పార్టీల నుంచి కమిటీలో స్థానం కల్పిస్తారు. ఈ సభ్యులు బిల్లులో ఉన్న అంశాలను బాగా చర్చించి, అవసరమైతే సాంకేతిక నిపుణులతో, బిల్లులోని ప్రతిపాదనల వల్ల ప్రభావితమయ్యే ప్రజలతో కూడా చర్చించి వారి అభిప్రాయాలను కూడా తమ నివేదికలో పొందుపరుస్తారు.

ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో జరగాలి అని నిర్దిష్టంగా కాలపరిమితి ఏదీ లేకపోయినా మూడు మాసాల్లో పూర్తి చేయడం ఆనవాయితీ. అయితే స్పీకర్ ప్రక్రియను ఆలస్యం చేయడమే ధ్యేయంగా పనిచేస్తే నాలుగైదు మాసాల వరకూ పొడిగించవచ్చు.

ఇప్పుడు ఉన్న మార్గాలు ఏమిటి?

బిల్లు ఇప్పుడు శాసనమండలిలో ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం నిబంధనల పరంగా లేదు. ఒకవేళ మండలినే రద్దు చేయాలని అనుకుంటే అందుకు కేంద్ర సహకారం కావాలి. అంతే కాకుండా రద్దు ప్రక్రియ ఇప్పుడు మొదలీపెడితే అది పూర్తి కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది.

Read Also: ప్రజలా?పార్టీనా?

సెలక్ట్ కమిటీ నివేదిక మీద చర్చ, ఓటింగ్ జరిగే సమయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించి, తమకు ఉన్న మెజారిటీతో ఆమోదం పొందవచ్చు. ఒకవేళ సెలక్ట్ కమిటీ ప్రతిపానల మీద చర్చ, ఓటింగ్ మండలిలోనే పెట్టి, బిల్లు తిరస్కరణకు గురయినా, అసెంబ్లీ ఆ బిల్లును మండలికి తిప్పిపంపితే అంగీకరించక తప్పదు.

ఏ విధంగా చూసినా రాజధాని వికేంద్రికరణ అన్నది ఆలస్యం అయితే కావొచ్చునేమో కానీ వెనక్కి పోయే అవకాశం లేదు!!

ఆలస్యం ఎవరికి ఇబ్బంది?

జగన్ ప్రభుత్వానికి అధికారం మరో నాలుగు సంవత్సరాలు కనీసం ఉంటుంది. ఓ నాలుగైదు నెలలు ఆలస్యం అన్నది పెద్ద విషయం కాదు. అమరావతిలోనే రాజధాని పూర్తిగా ఉండాలని సర్వశక్తులూ వొడ్డి పోరాడుతున్న చంద్రబాబుకి మాత్రం ఈ ఆలస్యం కొంచెం ఇబ్బంది పెట్టే విషయం.

Read Also: మండలి రద్దుపై చంద్రబాబు యు టర్న్ తీసుకుంటారా ?

రాజధాని కోసం పోరాటం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు దాటి వ్యాపించడం లేదు. ఆ ప్రాంతంలో కూడా రోజురోజుకూ పోరాటం తీవ్రత తగ్గుతూ ఉంది కానీ పెరగడం లేదు. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ ప్రాంత కౌలు రైతులు, రైతు కూలీలు సంతోషంగా ఉన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద దర్యాప్తు వేగం పుంజుకుని, ఆధారాలతో సహా అభియోగాలు నిరూపిస్తే రాజధాని రైతుల పోరాటానికి మద్దతు పూర్తిగా తగ్గిపోవడం ఖాయం.

అప్పుడు చంద్రబాబు ఓటమి తప్పని పోరాటం చేయవలసి వస్తుంది. ఏదైనా అద్భుతం చేసి, విజయం చేజిక్కించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో లేదాయె. అస్మదీయుడు వెంకయ్యనాయుడు కూడా కేంద్రాన్ని ప్రభావితం చేసే స్థితిలో లేరు. అయితే తన అనుభవాన్ని, పరిచయాలను, వ్యవస్థలను తనకనుకూలంగా పని చేసేలా చేయగల నేర్పునూ ఉపయోగించి సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయట పడటమే చంద్రబాబు చేయగలిగిన పని ఇప్పుడు!!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp