పెద్దల సభ - విచక్షణాధికారం

By Gopi Dara Jan. 23, 2020, 11:42 am IST
పెద్దల సభ - విచక్షణాధికారం

"మనది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, ప్రజాతీర్పు పట్ల గౌరవం రాజకీయ పార్టీలకే కాదు, చట్టసభల సభ్యులకు ఉండాలి. మన సభ (రాజ్యసభ) పెద్దల సభ. విజ్ఞులైన ఈ సభ సభ్యులు ప్రజాతీర్పు ఎలా వచ్చిందో, ఏ ప్రభుత్వం పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుని, ఆ ప్రజా తీర్పును గౌరవించేలా మనం స్పందించాలి. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా మన నిర్ణయాలు ఉండకూడదు."

ఇది సాక్షాత్తూ భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు రాజ్యసభలో సభ్యులకు చెప్పిన విషయం. ప్రభుత్వం బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా, రాజ్యసభలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండి, కొన్ని ప్రభుత్వం బిల్లులను సంఖ్యాబలంతో పెద్దల సభ తిరస్కరిస్తున్న సందర్భంలో చెప్పిన మాట. ప్రజా తీర్పును గౌరవించమంటూ సభ్యులకు ఇచ్చిన సూచన.

Read Also: చంద్రబాబు సాధించిందేమిటి..? రేపు ఏమి జరగబోతోంది..?

లోక్ సభలో బిజెపి ఆధిక్యంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది. దాని నిర్ణయాలు రాజ్యాంగపరంగానే కానీ రాజకీయంగా వ్యతిరేకించడం పెద్దల సభకు సముచితం కాదు అని చెప్పారు. అయినా పెద్దల సభ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంతో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలసభలో ఆధిక్యం కోసం రాజకీయ నిర్ణయాలు చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దిగువసభలో (శాసనసభ) భారీ ఆధిక్యంలో ఉంది. ఎగువ సభ (శాసనమండలి) విజ్ఞతతో, విచక్షణతో స్పందించాల్సి ఉండగా, రాజ్యాంగాన్ని గౌరవించాల్సి ఉండగా రాజకీయంగా స్పందించడం దురదృష్టకరం. పైగా "రూల్ ప్రకారం జరగనప్పటికీ, సభలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా నాకు ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి" నిర్ణయం తీసుకుంటున్నా అని పెద్దల సభ చైర్మన్ ప్రకటించారు. విచక్షణాధికారం రాజ్యాంగ పరంగా ఉండిఉంటే సభలో ఓటింగ్ జరిగి ఉండేది. లేదా ప్రజలు గెలిపించిన పార్టీ వేరు అని విచక్షణాధికారం ఉపయోగించి ఉంటే కూడా ఫలితం వేరుగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు విచక్షణాధికారం రాజకీయంగా ఉంది. దురదృష్టవశాత్తూ చట్టసభల అధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా ఉండడం లేదు కాబట్టి వారి నిర్ణయాలు రాజకీయంగానే ఉంటాయి అని సరిపెట్టుకోలేము.

Read Also: రూల్ పాటించకపోవటం విచక్షణా?

రాజకీయాల్లో గెలుపు, ఓటమి లెక్కలు వేసుకుంటే నిన్నటి శాసనమండలి పరిణామం చంద్రబాబు నాయుడి గెలుపుగానే చూడాలి. రాజకీయంగా వ్యూహం రచించి విజయం సాధించారు. కానీ దాన్ని రాజ్యాంగపరంగా చూసినా, ప్రజాతీర్పును దృష్టిలో పెట్టుకుని విచక్షణతో చూసినా భారీ తప్పిదంగానే భావించాల్సి ఉంటుంది. ప్రజా తీర్పును గౌరవించకుండా ఎన్నికల్లో ఓటమిచెందిన పార్టీయే ఇంకా ఆధిపత్యం చలాయించాలి అనుకుంటే ఎలా? అలాంటప్పుడు ప్రజాతీర్పుకు విలువేంటి? రేపు ఐదేళ్ళ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చి కూర్చుంటే, అప్పటికి పెద్దల సభలో (శాసనమండలి) వైసిపి ఆధిక్యంలో ఉంటుంది కదా!? అసలు 2014లో టిడిపి అధికారంలోకి వచినప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందికదా? తన ఆధిక్యాన్ని ఉపయోగించి కాంగ్రెస్ శాసన మండలిని, శాసనసభ నిర్ణయాలకు భిన్నంగా రాజకీయ కారణాలతో నడిపి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? వీటన్నిటికీ నేటి రాజకీయ నాయకులు జవాబు చెప్పాల్సి ఉంటుంది.

Read Also: సభలో సినీ కళ..

ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టాలో, అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్దేశించే అధికారం ఓటమి చెందిన పార్టీకే ఉంటుందని, ఎత్తులు వేసి, వ్యూహాలు రచించేవారే పాలకులుగా చలామణి అవుతామంటే, ఇక ఎన్నికల ప్రహసనం ఎందుకు? పెద్దల సభలో ఎవరికి ఆధిక్యం ఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని రాజ్యాంగం సవరణ చేసుకోవచ్చుగా?! ఎగువ సభే కీలకం అని, ఆ నిర్ణయాల మేరకే ప్రభుత్వాలు పనిచేయాలని కొత్తరాజ్యంగం రాసుకోవచ్చు. అప్పుడు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులూ ఉండవు, ప్రశ్నించే ప్రజలూ ఉండరు.

రాష్ట్రాల్లో శాసనమండలిలో ఏపార్టీకి ఆధిక్యం ఉంటుందో ప్రభుత్వ నిర్ణయాలు ఆపార్టీ మాత్రమే తీసుకోవాలని, కేంద్రంలో రాజ్యసభలో ఏపార్టీకి ఆధిక్యం ఉంటుందో ప్రభుత్వ నిర్ణయాలు ఆ పార్టీ మాత్రమే తీసుకోవాలని కొత్త రాజ్యాంగం రాసుకోవచ్చు. అప్పుడు ఎన్నికలు వద్దు, ప్రజలూ వద్దు, ప్రజలు ఓట్లేయాల్సిన అవసరం ఉండదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp