అంతా అప్పుడే జరిగింది.. ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు.. !

By Voleti Divakar Mar. 01, 2021, 06:00 pm IST
అంతా అప్పుడే జరిగింది.. ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు.. !

రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు టిడిపి నేతలు, ఎల్లో మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. వాస్తవాలు గమనిస్తే ఈ ప్రచారం తెలుగుదేశం పార్టీకే ఎదురుతన్నేలా ఉంది. రానున్న విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వైఎస్సార్ సిపి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కొండపై జరిగిన అవినీతి నిరోధకశాఖ దాడులను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం టిడిపి చేస్తోంది. అవినీతికి బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని కూడా టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎసిబి దాడుల్లో తేలిందేమంటే అవినీతి అంతా టిడిపి హయాంలోనే జరిగిందన్నది. మొన్నటి రథానికి సంబంధించిన వెండి సింహాసనాల చోరీ సంఘటన మినహా.

ఇంద్రకీలాద్రిపై వెలసిన మహిమాన్వితమైన శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. తిరుపతి తరువాత రాష్ట్రంలోని అతి పెద్ద ఆలయం కనకదుర్గ ఆలయమే. అలాంటి చోట భారీ అవినీతి జరుగుతున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే వివాదాల కొండ' పేరిట ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. విజ్ఞులైన వారు ఆవార్తను చదివితే టిడిపి ప్రభుత్వ హయాంలోనే అంతా జరిగినట్లు అర్థమైపోతుంది.

అవినీతి అంతా అప్పుడే...

అయితే అవినీతి, అక్రమాలు జరిగినదంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని తన కథనంలోనే ఈనాడు ఒప్పుకుంది. ఉదాహరణకు 2016 సంవత్సరం వరకు టెండర్ల ద్వారా భక్తులు అమ్మవారికి సమర్శించే చీరల అమ్మకాలు సాగించేవారు. ఈ విధానం వల్ల దేవస్థానానికి ఏటా రూ. కోటి 50లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేది. ఆ తరువాత నేరుగా దేవస్థానం అధికారులే చీరల విక్రయాలు సాగిస్తుండటంతో ఆదాయం రూ. 3కోట్లకు పెరిగింది. తెలుగుదేశం హయాంలోనే 2015లో టోల్ గేటు టెండర్లు దక్కించుకున్న ఒక కాంట్రాక్టరు రెండు రెట్ల ఆదాయాన్నీ ఆర్జించి, దేవాలయానికి రూ. 25లక్షలు ఎగొట్టి మాయమయ్యాడు. 2018లో వచ్చిన మరో కాంట్రాక్టరు 23 లక్షలు ఎగొట్టాడు. కొబ్బరికాయలు, క్లోక్ రూమ్ కాంట్రాక్టర్లు కూడా దేవుడి సొమ్మును మింగేశారు. 2019లోనే 2021 వరకు పారిశుద్ధ్య కాంట్రాక్టును అడ్డగోలుగా అర్హత లేనివారికి కట్టబెట్టారు.

తాంత్రిక పూజలు, ఆలయాల విధ్వంసం అప్పుడే

తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్న 1999లో అమ్మవారి గర్భగుడిలో అర్థరాత్రి మాజీ టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు అమ్మవారికి చేయించిన కేజిన్నర బరువైన బంగారు కిరీటాన్ని సాహూ అనే దొంగ చోరీ చేశాడు. అతడ్ని అరెస్టు చేసి, కిరీటాన్ని పోలీసులు రికవరీ చేశారు. రాయపాటి మాత్రం అది తాను చేయించిన కిరీటం కాదని చెప్పడం గమనార్హం. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని గర్భగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు దీనివెనుక ఉన్న పెద్దల పేర్లు మాత్రం బయటపడలేదు. నాలుగేళ్ల క్రితం నెయ్యి కుంభకోణం, తిరుపతిలో మహామండప నిర్మాణంలో రూ. 56కోట్ల పరిహారం చెల్లింపు వంటి వివాదాలతో పాటు, విజయవాడలో ఆలయాల విధ్వంసం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందన్నది ప్రజలకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.

ఎసిబి దాడుల్లో బట్టబయలు

నాటి అవినీతి, వివాదాలను మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎల్లో మీడియా, తెలుగుదేశంపార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎసిబి దాడుల్లో ఈవ్యవహారాలన్నీ బట్టబయలుకావడంతో పాటు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని ఏసీబీ నిగ్గుతేల్చింది. మొత్తం 15 మంది అవినీతి ఉద్యోగులపై వేటు కూడా పడింది. నాటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, బినామీలకు కొమ్ముకాయడం వల్లే కొండపై కొలువున్న అమ్మవారి ఆలయానికి ఈ దుస్థితి దాపురించిందన్నది ఎసిబి అధికారుల నివేదిక చెబుతోంది. మొన్నటి వరకు కొండపై అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన టిడిపి నేతలు తమ హయాంలోనే ఎక్కువగా అక్రమాలు జరిగాయన్న వాస్తవాన్ని ఎలా జీర్ణించుకుని, సమర్థించుంటారో ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp