కోతుల దండ‌యాత్ర‌ - క‌రోనా క‌థ‌లు-3

By G.R Maharshi Aug. 08, 2020, 07:20 pm IST
కోతుల దండ‌యాత్ర‌ - క‌రోనా క‌థ‌లు-3

కోతుల‌తో స‌మ‌స్య ఏమంటే ఆక‌లేస్తే అవి విప్ల‌వ‌కారులుగా మారిపోతాయి. ఎవ‌రినీ లెక్క‌చేయ‌వు. దేన్నీ గౌర‌వించ‌వు. మ‌నిషి ల‌క్ష‌ణాలు ఉండ‌డం వ‌ల్ల దౌర్జ‌న్యం వాటి జీన్స్‌లోనే ఉంది.

క‌రోనాతో ఒక కోతుల గుంపులో హాహాకారాలు మొద‌ల‌య్యాయి. అవ‌న్నీ ఒక క‌నుమ‌లో జీవించేవి. చెట్టూచేమా పెద్ద‌గా లేక‌పోయినా మ‌నుషుల్ని న‌మ్ముకుని రోజులు వెళ్ల‌దీసేవి. ఆ రూట్‌లో కొంచెం పేరుగాంచిన ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం ఉండ‌డంతో అటు వైపు వెళుతున్న భ‌క్తులు వాహ‌నాల‌ను ఆపి కోతుల‌కు అర‌టి పండ్లు, ఇంకా ఏదైనా తిండో పెట్టేవాళ్లు. మ‌నుషులు ఆగ‌గానే ఏం చేయాలో కోతులు కూడా సాధ‌న చేశాయి. ఫొటోల‌కి ఫోజులిస్తూ చేతికి దొరికింది ఎత్తుకెళ్లేవి. పిల్ల‌ల్ని బెదిరించి లాక్కునేవి.

క‌రోనా రానే వ‌చ్చింది. మ‌నుషులు తిర‌గ‌డం ఎందుకు మానేశారో కోతుల‌కి అర్థం కాలేదు. ముఖానికి మాస్క్‌ల‌తో క‌నిపించే వాళ్ల‌ని చూసి త‌మ‌లాగే మూతి వాచింద‌ని అనుకున్నాయి. రానురాను తిండి గ‌గ‌న‌మైంది. ఆక‌లి పెరిగింది. గుంపు ఉన్న త‌ర్వాత నాయ‌కుడు ఉంటాడు. అధికారం కాపాడుకోవాలంటే తిండి చూపించాలి. తిండి ఇవ్వ‌లేక‌పోతే , మాట‌లైనా చెప్పాలి.

నాయ‌కుడు కిచ‌కిచ‌మ‌ని గొంతు స‌వరించుకుని "మ‌నిషిని న‌మ్మ‌కూడ‌ద‌ని మా తాత చెప్పాడు. అయినా మ‌నం న‌మ్మాం. దాంతో మ‌న‌కు తెలియ‌కుండానే బానిస‌లై పోయాం. వాడి కోసం ఎదురు చూసి, పెట్టే తిండి కోసం మొహం వాచాం. ఇప్పుడు వాడికేదో పోయే కాలం వ‌చ్చింది. ముఖం చాటేశాడు. కాయ క‌స‌రూ తిందామంటే ఉన్న చెట్ల‌న్నీ న‌రికేశాడు. మ‌నుషులు మ‌న ద‌గ్గ‌రికి రాన‌ప్పుడు , మ‌నమే వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లాలి. మ‌న తిండిని మ‌న‌మే సంపాదించుకుందాం. ఈ సారి దేబిరించి కాదు, పోరాడి" అని పిలుపునిచ్చాడు.

జజ్జ‌న‌క‌ర జ‌నారే అని పాడుకుంటూ స‌మీపంలోని ప‌ల్లె మీద‌కి దండెత్తాయి. ముంచుకొస్తున్న ప్ర‌మాదాన్ని మొద‌ట ఆ ఊళ్లో కుక్క‌లు గుర్తించాయి. అస‌లే తిండి లేకుండా చ‌స్తుంటే, పోటీగా ఈ ఉప‌ద్ర‌వం వ‌చ్చి ప‌డింది. మూకుమ్మ‌డిగా భౌమ‌ని లంఘించాయి. కానీ కోతులు చెట్ల‌పై, డాబాల‌పై, కుక్క‌లు నేల మీద‌. కావాలంటే అవి దూకుతాయి. ఇవి ఎగ‌ర‌లేవు.

Also Read: డైరెక్ట‌ర్ సూరిబాబు క‌థ‌

క‌రోనాతో ఇళ్ల‌లో ఫోన్లు, టీవీలు చూసుకుంటున్న జ‌నం బ‌య‌టికొచ్చారు. ఒక కోతి మెరుపు వేగంతో ఒక‌రి చేతిలోని ఫోన్‌ను లాగేసింది. ఆ టైంలో వాడు ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడుతున్నాడు. జోక‌ర్ జాకీ వ‌చ్చింద‌నుకుంటే , మంకీ కూడా వ‌చ్చింది. కోతికి అది ఏ ర‌కం ప‌దార్థ‌మో అర్థం కాలేదు. కొరుకుడు ప‌డ‌లేదు. ర‌మ్మీ ప్లేయ‌ర్ రాయీ ర‌ప్ప తీసుకుని వెంట‌ప‌డ్డాడు. కోతి గాలిలో ప‌ల్టీ కొట్టింది. ఇంత‌లో ఫోన్ మోగితే భ‌యంతో వ‌దిలేసింది. ఫోన్ ఏ కీలుకా కీలు ఊడిపోయింది. ర‌మ్మీ ర‌చ్చ రంబోలా అయ్యింది.
దండ‌యాత్రకు వెళ్లిన కోతుల‌న్నీ త‌మ దోపిడీ సొత్తుతో మ‌ర్రిచెట్టు మీద స‌మావేశ‌మై పంచుకున్నాయి. ఒక గండు కోతి ఏకంగా అన్నం గిన్నె పట్టుకొచ్చింది. తిన్నంత తిని ఆ రాత్రికి విశ్ర‌మించాయి.

తెల్లారేసిరికి ఎంక‌టేశ్‌లు స‌ర్వీస్ ఆటో క‌నిపించింది. తెల్లారితే ప‌క్క‌నున్న టౌన్‌కి పాల క్యాన్లు తీసుకెళ్తాడు. వ‌చ్చేట‌ప్పుడు ఊళ్లో అమ్ముకోడానికి పండ్లు, కూర‌గాయ‌లు తెచ్చుకుంటాడు. పండ్ల బుట్ట‌లు అద్భుత దృశ్యంగా క‌నిపించి కోతుల నాయ‌కుడు విప్ల‌వ శంఖం ఊదాడు.

ప్యాసింజ‌ర్లు లేక‌పోయినా ఆటో ఎందుకు ఊగుతోందో ఎంక‌టేశ్‌కి అర్థం కాలేదు. అర్థ‌మ‌య్యే స‌రికి బుట్ట‌లు అర్ధం ఖాళీ. కోతుల్ని చూసిన కంగారులో హ్యాండిల్ వ‌దిలేశాడు. ఎదురుగా స్కూటీలో వ‌స్తున్న ఆర్ఎంపీ డాక్ట‌ర్‌ని ఆటో గుద్దింది. క‌రోనా టైంలో ఏదైనా నెత్తి మీదికి వ‌స్తే ఆ డాక్ట‌రే గ‌తి. జ‌నం వ‌చ్చి ఇద్ద‌రి గాయాల‌కి ప‌సుపు పూశారు.

కోతుల్ని భ‌రించ‌లేని జ‌నం ఊళ్లో స‌ర్పంచ్ మీద ప‌డ్డారు. ఎల‌క్ష‌న్లు రాబోతున్నాయి. ఆయ‌న యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌క్క ఊరి నుంచి కోతులు ప‌ట్టేవాడ్ని పిలిపించాడు. కోతుల గుంపు చూడ‌గానే వాడికి ఆశ పుట్టింది. క‌రోనాకి ముందు వాడు టౌన్లో ఇడ్లీలు అమ్మేవాడు. క‌రోనా వ‌చ్చేస‌రికి బండిని , పాత్ర‌ల్ని అప్పులోడు తీసుకెళ్లాడు. ఏం చేయాలో తెలియ‌క ఇంట్లో ఉంటే స‌ర్పంచ్ పిలిచాడు. నిజానికి వాడి తాత , తండ్రిది కోతులు ప‌ట్టే వృత్తి. వీడికి రాదు. ఆ విష‌యం స‌ర్పంచ్‌కి తెలియ‌దు.

Also Read: క‌రోనా క‌థ‌లు- శీన‌య్య పెండ్లాం ముడుపు క‌ట్టింది!

కోతికి రూ.200 అడిగాడు. స‌ర్పంచ్ వాడిని బ‌తిమాలుతూ "క‌రోనాతో అంద‌రూ పాప‌ర్ ప‌ట్టినారు. ఊళ్లో వాళ్ల‌కి తోడు, బ‌య‌ట వ‌ల‌స‌పోయినోళ్లంతా వ‌చ్చినారు. ఉన్న గ్రూప్‌ల‌కి తోడు స‌బ్ గ్రూప్‌లు క‌లిశాయి. నా చేతి నుంచి కోతికి రూ100 ఇస్తా తీసుకో " అన్నాడు.

చ‌చ్చినోడి పెళ్లికి వ‌చ్చిందంతా క‌ట్న‌మే అనుకుని రూ.1000 అడ్వాన్స్ తీసుకున్నాడు. చెక్క పెట్టెలో ఉన్న వ‌ల‌, తాళ్లు తీసుకుని మ‌ర్రిచెట్టు చేరాడు. కోతుల నాయ‌కుడు ఏదో ప్ర‌మాదం శంకించాడు.

ఒక డ‌జ‌ను అర‌టి పండ్లు పెట్టి వ‌ల‌తో సిద్ధంగా ఉన్న‌వాన్ని చూసి "తొంద‌ర ప‌డ‌కండి, ఊడ‌కి, తాడుకి తేడా తెలియ‌క‌పోతే అయిపోతాం. అరటి పండ్ల ప‌ళ్లెన్ని అడ‌క్కుండా పెట్టాడంటే వాడు మ‌న బెండు తీస్తాడ‌ని అర్థం. ముందు వాడి మీద దాడి చేస్తే, ఆ త‌ర్వాత వ‌ద్ద‌న్నా పండు మ‌న‌దే " అని చెప్పింది.

ఒక కోతి వెంట‌నే కోతులు ప‌ట్టేవాడి చెవి కొరికింది. ఊడిన చెవితో వాడు పారిపోయాడు.

క‌రోనా మ‌నుషుల‌కే కాదు , కోతుల‌కి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp