అమెరికాలో జరిగింది.. హైద్రాబాదు మాటేంటి..

By Jaswanth.T Nov. 23, 2020, 07:25 am IST
అమెరికాలో జరిగింది.. హైద్రాబాదు మాటేంటి..
కోవిడ్‌ 19ను అడ్డుకోవాలంటే వ్యాప్తికి కారణమయ్యే చైన్‌ను తెగ్గొట్టాలి. ముందునుంచీ నిపుణులు చెవినిల్లు కట్టుకుని మొత్తుకుంటున్న మాట ఇదే. ఈ చైన్‌బ్రేక్‌లో భాగంగానే మాస్కులు ధరించడం, భౌతిక దూరం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, జన సమూహాలకు దూరంగా ఉండడం అన్న నిబంధనలను రూపొందించి, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిని పట్టించుకోని చోట్ల జనం కోవిడ్‌ పాజిటివ్‌ భారినపడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అమెరికాయే. ట్రంప్‌ నేతృత్వంలో మొదట్నుంచి లాక్డౌన్‌ విధించడానికి వెనకాడి పరిస్థితిని చాలా వరకు దిగజార్చేసారని నిపుణులు ప్రధానంగా ఆరోపించారు. దీనికి తోడు ఎన్నికల పేరు చెప్పి విపరీతంగా జనం రోడ్లమీదికి చేరారు. దీంతో వైరస్‌ వ్యాప్తి గొలుసు కొనసాగింది. దాని ప్రభావం ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటోంది. ఒక అంచనా ప్రకారం కోవిడ్‌ కారణంగా నిముషానికి ఒకరు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి శీతాకాలం, ఇతర వాతావరణ పరిస్థితులు, మృతుల అనారోగ్యం అంటూ ఎన్ని ఉపమానాలు చెప్పినప్పటికీ ప్రప్రథమ కారణంగా మాత్రం జనం గుమిగూడి అత్యంత సన్నిహితంగా మెలగడమేనని వైరస్‌ వ్యాప్తికి మూలకారణమని అక్కడి వైద్యరంగం స్పష్టం చేస్తోంది.

అయితే ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాదులో కూడా ఎన్నికల నగారా మోగింది. నాయకులు, ప్రజలు అసలు కరోనా ఉందన్న స్పృహే మర్చిపోయి విచ్చలవిడిగా గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణా వ్యాప్తంగా అతి తక్కువ కేసులే నమోదవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తికి అనుగుణంగా పరిస్థితులు ఏర్పడితే, మళ్ళీ పాజిటివ్‌లు అత్యధికంగా నమోదయ్యేందుకు కావాల్సిన అన్ని అవకాశాలు ఇప్పుడక్కడ చోటు చేసుకుంటున్నాయని వైద్యరంగ ప్రముఖులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అమెరికాలాంటి పరిస్థితే హైదరాబాదులో ఎదురైతే అప్పుడు చేయగలిగేది ఏమీ ఉండదన్న తేల్చి చెబుతున్నారు.

యంత్రాంగం మొత్తం ఎన్నికల హడావిడిలో ఉన్న నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణ చర్యలను గురించి పట్టించుకుంటున్న దాఖలాల్లేవని అక్కడి నివాసితులు చెబుతున్నారు. అభ్యర్ధులు కరోనా నెగటివ్‌ పరీక్షలు చేయించుకుని, వైరస్‌ లేదని తేలిన తరువాతనే ప్రచారం చేపట్టాలని, లేకపోతే అభ్యర్ధులు, వారి అనుచరుల ద్వారా గ్రేటర్‌లో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అక్కడి న్యాయవాదొకరు కోర్టును కూడా ఆశ్రయించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, అభ్యర్ధుల కూడా వచ్చే అనుచరుల మాటేంటన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం.

ముందునుంచీ కోవిడ్‌ పాజిటివ్‌ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న లెక్కల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అదృష్టవ శాత్తు ఒక వేళ తక్కువ కేసులో ఉంటే అంతకంటే ఆనందించదగ్గ పరిణామం ఇంకొకటి ఉండదు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ లెక్కల్లో తక్కువగా ఉండి, లెక్కకు చిక్కని పాజిటివ్‌లు అత్యధికంగా ఉంటే మాత్రం గ్రేటర్‌ ఎన్నికల తరువాత ప్రజారోగ్యానికి ముప్పుతప్పదని నిపుణులు బెంబేలెత్తిపోతున్నారు. అమెరికాలో ఎన్నికల తరువాత పరిస్థితులు చూసిన వారు ఇప్పుడు గ్రేటర్‌లో అక్కడి పరిస్థితిని పోల్చి చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలే తమకు తాముగా వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాలని కోరుతున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp