కరోనా అప్పడాలు మంత్రాలు

By Jaswanth.T Aug. 09, 2020, 08:15 pm IST
కరోనా అప్పడాలు మంత్రాలు

కొందరి ప్రాణాలకు మప్పుగానే ఉంటున్నప్పటికీ జనానికి కరోనా క్రమశిక్షణ నేర్పుతోందనే చెప్పాలి. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి భయపడ్డం నేర్పింది. అలాగే మాస్కువేసుకోవడం, భారతీయులకు పెద్దగా అలవాటు లేని శానిటైజర్‌ వినియోగాన్ని కూడా అలవాటు చేసింది. అంతే కాకుండా భౌతిక దూరం పాటించం కూడా ప్రాక్టీసు చేయించింది.

తాజాగా తనను తక్కువచేసి మాట్లాడేవారికి కూడా క్రమశిక్షణ నేర్పిస్తోంది. మొన్నా మధ్య మంత్రాలతో కరోనాను కట్టడిచేసేస్తాను అన్న మాంత్రికుడిని జైలు ఊచలు లెక్కపెట్టించింది. అలాగే అప్పడాలు తింటే రాదంటూ ప్రచారం చేసిన ఓ కేంద్రమంత్రికే సోకి తన ప్రతాపాన్ని రుజువుచేసుకుంది. ఏతావాతా తేలేదేంటంటే శాస్త్రీయం కాని అనవసర కామెంట్లు చేయడం మాని, జనాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టమని కరోనా తన చేష్టల ద్వారానే చెబుతోంది.

సోషల్‌ మీడియా కాలంలో అసలు కంటే కొసరుకే ఎక్కువ ప్రచారం జరుగుతోందన్న అపవాదు ఉంది. ఆయనెవరో తన అప్పడాలు ప్రమోట్‌ చేసుకోవడానిక అప్పడం తినండి అన్నారనుకోండి దానికిచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. అది వెటకారంగానే అయినప్పటికీ విపరీతమైన పబ్లిసిటీకి నోచుకుంది. ఇప్పుడు సదరు మంత్రిగారికే కరోనా రావడం కూడా అదే స్థాయిలో ప్రచారమవుతోంది. ఇటువంటి వాటి విషయంలో అప్రమత్తత కూడా ఎంతైనా అవసరం.

ఒక పక్క లక్షల మంది శాస్త్రవేత్తలు, నిపుణులైన వైద్యులు ప్రజలను చైతన్య పరిచి వైరస్‌ భారినుంచి కాపాడేందుకు రాత్రింబవళ్ళు కష్టిస్తున్నారు. వ్యాక్సిన్‌ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు వ్యక్తులు చేసే ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలుు కొంచెం నొప్పించకమానవు.

కరోనా విషయంలో భయం, నమ్మకం అనేవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తమకు ఎక్కడ వచ్చేస్తోందో నన్న భయంలో కొందరు ఉంటుండగా, నాకు రాదులే అన్న అతి నమ్మకంతో ఇంకొందరు వ్యవహరిస్తున్నారు. ఈ రెండూ కూడా తప్పేనని, వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని జాగ్రత్త పడమని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వాలు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడం తప్పితే ఇప్పుడున్న పరిస్థితి ఎవ్వరి చేతుల్లోనూ లేదన్నది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అప్పడాలు తింటేనో, తాయెత్తులు కట్టించుకుంటేనో తగలని వ్యాధి కరోనా కాదని గుర్తెరగడం మంచిది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp