క‌రోనా క‌థ‌లు- శీన‌య్య పెండ్లాం ముడుపు క‌ట్టింది!

By G.R Maharshi Aug. 04, 2020, 02:40 pm IST
క‌రోనా క‌థ‌లు- శీన‌య్య పెండ్లాం ముడుపు క‌ట్టింది!

అంగ‌డి శీన‌య్య‌కి క‌రోనా, ఊరంతా ఇదే మాట‌. అంగ‌ట్లో కొనుక్కున్న వాళ్లంద‌రికీ భ‌యం. కొంద‌రికి హ‌ఠాత్తుగా ఒళ్లు నొప్పులు వ‌చ్చిన‌ట్టు, ముక్కులు మూసుకుపోయిన‌ట్టు అనిపించింది.

"అనంత‌పురంలో జోరుగా ఉండాది. పోవద్దంటే యిన‌డు. ఇపుడు ఊరంద‌రికీ తగిలించినాడు సూడు" నాగుల‌క‌ట్ట మీద కూచున్న ఎంక‌ట్రాముడు అన్నాడు. ముక్కుకి గుడ్డ క‌ట్టుకుని ఫుల్ బందోబ‌స్తులో ఉన్నాడు.

"పోక‌పోతే స‌రుకులు తెచ్చుకోవ‌ద్దా, మ‌నూరి నుంచి పాలు పోసేకి దండిగా పోతా ఉండారు. ఎవున్నించి ఎవ‌నికి వ‌చ్చిందో?" టైల‌ర్ ర‌హంతుల్లా చెప్పాడు. పండ‌గ‌లు వ‌స్తా పోతా ఉండాయి కానీ, మూన్నెళ్ల నుంచి బ‌ట్ట‌లు కొనేవాళ్లూ లేరు, కుట్టించే వాళ్లూ లేరు. సూదిలో దారం ఎక్కించి ఎన్నాళ్లైందో? అప్పోస‌ప్పో చేసి లాగుతా ఉండాం.
జ‌నం ఇట్లా మాట్లాడతా ఉన్న‌ట్టే శీన‌య్య సెల్ మోగింది.

"శీన‌న్న‌, నేను స‌చివాల‌యం వాలంటీర్‌ని, నీకు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండాయంట‌నే"
శీన‌య్య‌కి చెమ‌ట్లు ప‌ట్టాయి. రొంత సేపు ఏమీ అర్థం కాలేదు.
"యానా కొడుకు సెప్పింది...నాకేం లేదు, బాగుండాను" అతి క‌ష్ట‌మ్మీద అన్నాడు.
"మాటెందుకు మ‌డ‌గబ‌డ‌తాంది. అదంతా నాకు తెల్దు. అనంతపురం పొయ్యి టెస్ట్ చేపించుకో. లేదంటే వ‌చ్చి ప‌ట్ట‌క‌పోతారు"
"మాయ‌మ్మ సాచ్చిగా నాకు లేద‌న్నా. బువ్వ తినే కంచంలోకి ఉచ్చ‌లు పోసే నా కొడుకులు ఉండారు ఈ ఊర్లో. ఎవుడో పుకారు పుట్టించినాడు"
"ఏమోన‌ప్పా, మ‌ళ్లా నాకు మాట రానీయొద్దు"
ఫోన్ పెట్టేసి శీన‌య్య ఆలోచ‌న‌లో ప‌డినాడు.

శీన‌య్య ఇంట‌ర్ వ‌ర‌కూ అనంత‌పురంలో చ‌దువుకున్నాడు. వాళ్ల నాయ‌న‌కి చీనీ చెట్లు పెట్టాల‌ని ఆశ పుట్టి బోరు వేస్తే ఫెయిల్‌. రెండో బోరు - అదీ ఫెయిల్‌. శీన‌య్య ఇంట‌ర్ పాస్ అయినా డిగ్రీ చేర‌లేక‌పోయాడు. నాయ‌న మీద కోపంతో బెంగ‌ళూరులో సెక్యూరిటీ గార్డ్‌గా చేరినాడు. రోజుకు 8 గంట‌ల ప‌ని, కానీ 12 గంట‌లు నిల‌బ‌డాలి. ఒక రోజు సెల్యూట్ స‌రిగా చేయ‌లేద‌ని సూప‌ర్‌వైజ‌ర్ తిట్టాడు. శీన‌య్య కొట్టాడు. ఉద్యోగం ఊడింది. ఒక హోట‌ల్‌లో స‌ర్వ‌ర్‌గా చేరాడు. మ‌నోడికి జ్ఞాప‌కం త‌క్కువ‌.

ఇడ్లీ అడిగినోడికి పూరీ, పూడీ అడిగితే దోసె ఇచ్చాడు. మ‌ళ్లీ పోయింది. ఇంత‌లో నాయ‌న పోయాడు. గుండెల్లో మంట‌గా ఉంద‌ని మ‌జ్జిగ తాగి ప‌డుకున్నాడు. మ‌ళ్లీ లేవ‌లేదు. శీన‌య్య ఊరు చేరాడు. నాయ‌న ద‌గ్గ‌ర ఆస్ప‌త్రికి పోయేకి దుడ్లు లేక మ‌జ్జిగ తాగి ప‌డుకున్నాడ‌ని అమ్మ చెప్పింది. కోపం వ‌చ్చింది. వ‌ద్దంటే బోర్లు వేసి ఈ గ‌తి ప‌ట్టిస్తివి క‌దా అని ఏడ్చాడు. బాగా బ‌తుకుదామ‌నుకుని బ‌త‌క‌లేక పోయాడ‌ని త‌ల్లి ఏడ్చింది.

ఊళ్లో ఉన్న అంగాడ‌య‌న పిల్లోళ్ల చ‌దువుల కోసం అనంత‌పురం చేరినాడు. మేన‌మామ వ‌చ్చి కూతుర్ని ఇచ్చి, అల్లుడితో అంగ‌డి పెట్టించినాడు. ఏదో జ‌రిగిన కాడికి జ‌రుగుతుంది. ఊళ్లో నాలుగు స‌ర్వీస్ ఆటోలున్నాయి. అనంత‌పురం పోయి వ‌చ్చేవాళ్లు ఎక్కువ‌. అర్జంట్ ప‌డినా, అప్పు కావాల్సినా శీన‌య్య ద‌గ్గ‌రికి వ‌స్తారు.

ఇద్ద‌రు పిల్ల‌లు, అమ్మ ఒడి డ‌బ్బులొచ్చాయి. త‌ల్లికి పింఛ‌న్ వ‌స్తుంది. రైతు భ‌రోసా అందింది. అంతా బాగున్న‌ప్పుడు క‌రోనా వ‌చ్చింది. మ‌న‌దాకా రాదులే అనుకున్నారు, వ‌చ్చింది. ఇప్పుడీ పుకారు.

ఆటో ఓబిలేసే చేసి ఉంటాడు. అనంత‌పురంలో ఆటో తోలేవాడు. క‌రోనాతో కంతు క‌ట్ట‌లేదు. ఫైనాన్ష్ వాళ్లు ఆటో తీసుకుని పోతే ఊరు చేరాడు. ఫోన్లో వీడియోలు చూడ‌డం, సిగ‌రెట్లు తాగ‌డం ప‌ని. రెండుమూడు సార్లు సిగ‌రెట్లు అప్పు ఇచ్చాడు. త‌ర్వాత ఇవ్వ‌న‌న్నాడు. ఫోన్ మోగింది.

"ఎట్లుండాది మామా ఆరోగ్యం?" పాల తిప్ప‌న్న లైన్లో.
"గుండ్రాయిలాగుండా, నీకు చెప్పింది ఎవుడు? "
"ఓబిలేసు గాడు. నువ్వు ద‌గ్గుతాండావ‌ని, తుమ్ముతాండావ‌ని అన్నాడు. ఊళ్లో క‌రోనా వ‌స్తే, ఇంగ మా పాల యాపారం కూడా మూసుకోవాల్సిందే"

శీన‌య్య కంప క‌ట్టె తీసుకున్నాడు. యాప‌మాను ద‌గ్గ‌రికి పోయినాడు. శీన‌య్య‌ని చూస్తానే ఊళ్లో వాళ్లంతా పారిపోయినారు. ఓబిలేసుకి అర్థ‌మైంది. పారిపోతా పేడ‌మీద కాలేసి జారినాడు. విరిగింది.

క‌రోనా భ‌యంతో చుట్టుప‌క్క‌ల ఆర్ఎంపీ డాక్ట‌ర్లు కూడా లేరు. రాప్తాడు నుంచి నాటు డాక్ట‌ర్‌ని ప‌ట్టుకొచ్చినారు. కాలు మెలి తిప్పితే అనంత‌పురానికి విన‌ప‌డేట్టు అరిచాడు ఓబిలేసు.

శీన‌య్య‌కి క‌రోనా లేద‌ని అర్థ‌మైంది. ఉన్నా చేసేదేమీ లేదు. క‌ష్ట‌కాలం, డ‌బ్బుల్లేవు. అప్పిచ్చే అంగ‌డి శీన‌య్య‌దే. భ‌యంభ‌యంగా స‌రుకులు కొని , చేతులు క‌డుగుతున్నారు.

శీన‌య్య‌కి మ‌ళ్లీ వాలంటీర్‌ ఫోన్ చేసినాడు.
"ఏమ‌న్నా ఆస్ప‌త్రికి పోయినావా?"
"నేను బాగున్నా, ఓబిలేసుగాడికి కాలిరిగింది. వాన్ని తీసుక‌పోండి"
"కాలు చేయి ఇరిగితే కుద‌ర‌దు. క‌రోనా వ‌స్తే సెప్పు"
"ఇంకా రాలేదు. వ‌స్తే ఫ‌స్ట్ నేనే సెప్తా"

అత‌ని భార్య ఏడుకొండ‌ల వాడికి ముడుపు క‌ట్టింది, క‌రోనా తొంద‌ర‌గా పోవాల‌ని, దేవుడు కూడా మూతికి మాస్కు వేసుకుని భ‌యంగా ఉన్నాడ‌ని ఆమెకు తెలియ‌దు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp