వలస బతుకులు.. అదే కథ.. అదే వ్యథ

By Ritwika Ram Apr. 17, 2021, 11:19 am IST
వలస బతుకులు.. అదే కథ.. అదే వ్యథ

‘‘బస్సులొద్దూ.. బండ్లు వద్దూ అయ్య సారూ.. ఇడిసి పెడితే నడిసి నేను పోత సారూ..” వలస బతుకులపై ఏడాది కిందట వినిపించిన కన్నీటి పాట ఇది. ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన వారి జీవితాన్ని ఆవిష్కరించిన గానమిది. ఉన్నట్టుండి లాక్​డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు ఎక్కడి వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. చేసుకునేందుకు పనిలేక.. తినడానికి తిండిలేక ఎన్నెన్నో అవస్థలు పడ్డారు. ఉన్నచోట ఉండలేక.. సొంత ఊరు వెళ్లలేక ఇక్కట్లు పడ్డారు.. చావో రేవో.. కష్టమో నష్టమో.. సొంత గూటికి చేరుకోవాలని భావించారు. నడుచుకుంటూ వందల వేల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. రైల్వే బాట వెంట కొందరు.. రోడ్ల వెంట ఎందరో ప్రయాణం ప్రారంభించారు. కానీ అందరూ గూటికి చేరుకోలేదు. కొందరిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మరికొందరు మధ్యలోనే ఆగిపోయారు. ఇంకొందరు దారిలోనే చనిపోయారు.

ఏడాది గడిచింది. ఇప్పుడూ అదే కథ. జనతా కర్ఫ్యూలు.. నైట్ కర్ఫ్యూలు.. ఆంక్షలు ప్రారంభమయ్యాయి. చాలా మందికి పనులు బంద్ అయ్యాయి. మరోవైపు వలస కూలీల్లో లాక్​డౌన్ భయాలు మొదలయ్యాయి. దీంతో మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు మైగ్రెంట్ లేబర్లు. ఊర్లకు వెళ్లేందుకు లక్షల మంది ఎదురుచూస్తుంటే.. ఉన్న సదుపాయాలు చాలా తక్కువ. మహారాష్ట్రలో పబ్లిక్ ట్రాన్స్​పోర్టు బస్సులు ఎమర్జెన్సీ సర్వీస్ ఉద్యోగుల కోసమే నడుస్తున్నాయి. బుక్ చేసుకున్న వాళ్లు రైళ్లలో వెళ్తున్నారు. ఇండ్లకు వెళ్లలేక వేలాది మంది మూట ముల్లెతో, తమ కుటుంబ సభ్యులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు.

ఎందుకిలా..?

దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు 2 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు వస్తున్నాయి. చాలా రోజులుగా అక్కడ రోజూ 50 వేలకు పైగానే కేసులు వస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ పేరుతో లాక్​డౌన్ లాంటి ఆంక్షలు పెట్టింది. దీంతో వేలాది మందికి పని పోయింది. కరోనా కట్టడి కోసం ఆంక్షలు పెట్టడం మంచిదే అయినా.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేకపోయింది. వలస కూలీల్లో భరోసా నింపలేకపోయింది. పని కోల్పోయిన వారికి సాయం చేయలేదు.

అటు కేంద్రం కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోలేదు. వందలాది కూలీలను పనుల్లో పెట్టుకునే కంపెనీలు, సంస్థలు పట్టించుకోలేదు. లాక్​డౌన్ నుంచి సడలింపులు వచ్చాక.. కూలీలను ఆఘమేఘాల మీద రప్పించాయి. ‘మేమున్నాం.. అన్నీ చూసుకుంటాం’ అని భరోసా ఇచ్చాయి. ఇప్పుడు ఆంక్షలు విధించే సరికి కంపెనీలు చేతులెత్తేశాయి. దీంతో లక్షలాది మంది సొంతూళ్లకు బయలుదేరారు. పరిస్థితి ఇలానే ఉంటే వలస కార్మికులు నడిచి వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

Also Read : జనసేన అధినేతకు కరోనా

ఏర్పాట్లు శూన్యం

సొంతూళ్లకు వెళ్తున్న కార్మికుల కోసం కేంద్రం, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు శూన్యం. ఏడాది కిందట స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు వారిని ఆదుకున్నారు. దారి పొడవునా ఆహారం, నీళ్లు, ఇతర అవసరాలను చూసుకున్నారు. కొన్ని చోట్ల హైవేలపై హెల్త్ క్యాంపులపై పెట్టారు. జాతీయ రహదారుల వెంట.. ఎటు చూసినా వలస కూలీలే. అప్పట్లో కూలీలను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. కూలీల టికెట్ల ఖర్చులను రాష్ట్రాలపై మోపింది. కొన్ని చోట్ల కలెక్టర్లు తమ సొంత డబ్బులను చెల్లించిన సంఘటనలు ఉన్నాయి. ఇదే సమయంలో దేవుడిలా వచ్చిన సినీ నటుడు సోనూ సూద్.. బస్సులు, రైళ్లు, విమానాల్లో లక్షల మందిని సొంత గూటికి చేర్చారు. తన సొంత డబ్బుతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

రైళ్లు ఏర్పాటు చేయలేదు..

ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో రైళ్లను కేంద్ర ప్రభుత్వం నడపడం లేదు. నడుపుతున్న రైళ్లలోనూ జనరల్ బోగీలను పెట్టడం లేదు. జనరల్ బోగీల్లో ఎక్కువ మంది ఎక్కడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నింటిలో జనరల్ బోగీలు ఉంటున్నా.. సీట్ల పరిమితి మేరకు బుక్ చేసుకుని, వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. మరోవైపు ట్రైన్​లో వెళ్లాలంటే రిజర్వేషనో, తాత్కాల్​లోనో బుక్ చేసుకోవాలి. కానీ చాలా మంది కూలీలకు ఆ ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు. కౌంటర్​కు వెళ్లి.. టికెట్ తీసుకుని వెళ్లడమే తెలుసు. ఈ క్రమంలో ట్రైన్ల సంఖ్య పెంచకపోవడం, జనరల్ బోగీలను ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేలాది మందితో సభలు నిర్వహిస్తారు.. కానీ ట్రైన్లలో జనం వెళ్లేందుకు అనుమతించరా అంటూ కామెంట్లు వస్తున్నాయి. మాస్కులు లేకుండా వందల మంది సభల్లో ఉంటే కరోనా వ్యాప్తి కాదా, కేవలం ట్రైన్లలో కొందరు ఎక్కితేనే వైరస్ విజృంభిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ బాధితులే

నిజానికి కరోనా కన్నా.. అది తెచ్చిన కష్టమే వలస కూలీలను బాధించింది. పనుల్లేక పస్తులున్న వాళ్లు ఎందరో! దారి వెంట ఎవరైనా ఇంత ముద్ద పెట్టకపోతారా అని ఎదురుచూసిన వాళ్లు ఎందరో. ఇప్పుడు కూడా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఇదే దుస్థితి. ఈ కష్టం చాలదన్నట్టు రైల్వే స్టేషన్లలో ప్లాట్​ఫాం టికెట్ల ధరలను రైల్వే పెంచింది. సికింద్రాబాద్​లో ప్లాట్​ఫాం ఫీజు రూ.50. దేశంలోని ప్రధాన స్టేషన్లలో కూడా ప్లాట్​ఫాం టికెట్లు పెంచారు. ఒకవేళ ఈ టికెట్లు తీసుకున్నా.. రైల్వే స్టేషన్లలో ఎక్కువ సేపు ఉండటానికి వీల్లేదు. దీంతో వలస కూలీలకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. కరోనా మొదలైన కొత్తలో.. ఇప్పడు సెకండ్ వేవ్ వచ్చాక.. రెండు సార్లు బాధితులుగా మిగిలింది వలస కూలీలే.

Also Read : కరోనా సెకండ్ వేవ్ : ఏపీలోనే సేఫ్ అని ఎందుకు భావిస్తున్నారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp