వెనకడుగేస్తున్నారు..!

By Jaswanth.T Nov. 24, 2020, 01:50 pm IST
వెనకడుగేస్తున్నారు..!

కోవిడ్‌ 19 నిబంధనల అన్‌లాక్‌ తరువాత జనజీవనం సాధారణ స్థితికి చేరుతున్నట్లుగా పైకి కన్పిస్తున్నప్పటికీ అంతర్గతంగా జనంలో కరోనా తాలూకు భయం మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇందుకు పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తరలివచ్చే యాత్రీకులనే ఉదాహరణగా చూపుతున్నారు. ముఖ్యంగా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి గణనీయంగా తగ్గిపోయిన భక్తుల సంఖ్యే కోవిడ్‌ పట్ల జనం తీరును తెలియజేస్తోందని అంచనా వేస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల ఆలయానికి ప్రతియేటా లక్షల్లోనే భక్తులు వెళుతుంటారు. ఇతర పుణ్యక్షేత్రాల దర్శనకు భిన్నంగా ఇక్కడికి వెళ్ళేవారు 41 రోజులు కఠినదీక్షలు పాటించి, అనంతరం స్వామిని దర్శించుకుంటారు. కోవిడ్‌ నేపథ్యంలో స్వామిని దర్శించుకునేందుకు భారీగానే అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ముందుగా దర్శనం స్లాట్‌ బుక్‌చేసుకోవాలని, 24 గంటల ముందు కరోనా నెగటివ్‌ రిపోర్టుతో రావాలని.. రోజుకు వెయ్యిమందికి మాత్రమే దర్శనం, శని, ఆదివారాల్లో మాత్రం రోజుకు రెండువేల మందికి దర్శనం అంటూ.. ఇలా అనేక ఆంక్షలను విస్తృతంగానే ప్రచారం చేసింది. దీంతో భక్తుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు ట్రావెన్‌కోర్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఆలయ తెరుచుకున్న తరువాత మొదటి వారం లెక్కలు పరిశీలిస్తే కేవలం 9 వేల మంది భక్తులు మాత్రమే స్వామిదర్శనానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో దర్శనం కోసం దరకాస్తు చేసుకున్నవారు ఇంతకు 40 రెట్లు అధికంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ దర్శనం దగ్గరకొచ్చేసరికి మాత్రం 9వేల మంది మాత్రమే వచ్చినట్లుగా వివరిస్తున్నారు. అంటే ముందుగా దర్శనం స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ భక్తులు రాలేదని తేల్చారు. అంతే కాకుండా గత యేడాది ఇదే సమయంలో మూడులక్షల మంది స్వామి భక్తులు దర్శనానికి రాగా, ఈ సారి కేవలం 9వేల మందిమాత్రమే వచ్చారంటే ఏ స్థాయిలో భక్తుల సంఖ్య తగ్గిపోయిందో అర్ధం చేసుకోవచ్చును.

మకర జ్యోతి దర్శనం తరువాత వరకు మాత్రమే అయ్యప్ప స్వామివారి ఆలయం తెరిచి ఉంచుతారు. ఈ లోపు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు స్వామిదర్శనానికి తరలి వస్తారు. అయితే మొదటి వారం భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మిగిలిన రోజుల్లో సైతం ఇదేరీతిలో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ముందుగా దర్శనం స్లాట్‌ బుక్‌ చేసుకున్న పలువురు అయ్యప్ప మాలధారులు కూడా తాము దర్శనానికి వెళ్ళే సమయానికి ఉన్న కోవిడ్‌ పాజిటివ్‌ల పరిస్థితిని బట్టి శబరిమలకు వెళతామని, లేకపోతే తమకు సమీపంలో ఉండే అయ్యప్ప ఆలయంలోనే ఇరుముడులు సమర్పించి, దీక్ష విరమిస్తామని చెబుతున్నారు.

ఈ లెక్కన దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య విషయంలో కేరళ ప్రభుత్వం లెక్కలు తారుమారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ అయ్యప్పస్వామి దేవస్థానాలకు గతంలోకంటే రద్దీ ఈ యేడాది పెరగనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp