వ్యవసాయం కరోనా పాలు

By Jaswanth.T Apr. 20, 2020, 12:02 pm IST
వ్యవసాయం కరోనా పాలు

ఆంధ్రప్రదేశ్ లో రైతులు పంట వేయడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతుకు 13500 రూపాయల వరకు పెట్టుబడి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. పంట కూడా బాగుంది. ఇంటికి చేరితే చాలా వరకు ఇబ్బందులు నుంచి గట్టెక్కొచ్చు. లాక్ డౌన్ కు ముందు సగటు రైతు భావన ఇది. కానీ లాక్ డౌన్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం కరోనా పాలైంది. చేతికొచ్చిన పంట సిద్ధంగా ఉన్నా..మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టే రైతు ఆ స్థాయి నష్టానికి సిద్ధం కావాల్సి వచ్చింది.

పూర్తి వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో వ్యవసాయ ఉత్పత్తులు దాదాపు 10 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అలాగే వ్యవసాయం మీద ఆధారపడిన ఇతర ఎరువులు, పురుగుమందులు, రవాణా, యంత్ర పరికరాలు తదితర రంగాలను కలుపుకుంటే కరోనా నష్ట ప్రభావం అంచనాలకు అందని విధంగా ఉందని చెప్పాలి. ఇక ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యే ఉద్యాన సంబంధిత పంటల రైతు కష్టమైతే చెప్పనలవి కాదు. అరటి, మామిడి, మొక్కలు, పువ్వులు తదితర ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా ఉత్పత్తుల వినియోగం మన రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో అధికంగా ఉంటుంది. దీంతో కరోనా లాక్ డౌన్ ప్రభావం నేరుగా ఆయా రంగాల పై పడింది. ఆయా పంటల సాగుకు లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఊహించని విధంగా వచ్చిపడ్డ కరోనాఉత్పాతం రైతు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఒకపక్క కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆర్థిక లోటు.. ఇవన్నీ పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను పలువురు ప్రశంసిస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు అధికారులను సిద్ధం చేసి, ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు దళారులను నమ్మి భారీగా నష్టపోయే వారు. అయితే కరోనా నేర్పిన పాఠం తో స్థానికంగా మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిచి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 100 రూపాయలకే స్థానికంగా దొరికే వివిధ రకాల పండ్ల తో రూపొందించిన కిట్లు అమ్మడం అందులో భాగమే. కర్నూలు, గుంటూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేసి స్థానిక రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అలాగే తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతంలో లభించే పువ్వులు నిర్ణీత ధరకు సేకరించి దేవస్థానములకు అందించేందుకు కూడా రైతుల తో చర్చలు జరుపుతున్నారు. అలాగే వరి, మొక్కజొన్న, సెనగలు తదితర ఉత్పత్తులు ప్రభుత్వమే మద్ధతు ధర ప్రకటించి సేకరించడం ద్వారా నష్టం తీవ్రతను తగ్గించేందుకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మెరుగ్గా స్పందించిందని చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp