కరోనా ఎన్నికలు

By Karthik P Apr. 12, 2021, 04:50 pm IST
కరోనా ఎన్నికలు

కరోనా ఎన్నికలు.. అవును దేశంలో కరోనా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు గెలుపు – ఓటములనే ఫలితాలే కాదు మరణాలను కూడా చూస్తున్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్నా.. వ్యవస్థ నడిచేందుకు అవసరమైన పనులు జరగాల్సిన పరిస్థితి. సామాజికదూరం పాటించాల్సిన తరుణంలో ఎన్నికలు కారణంగా గుంపులుగా గూమికూడడంతో మహమ్మారి తన పంజాను విసురుతోంది.

దేశంలో ఐదు రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు, పలు నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో వైరస్‌ వ్యాప్తి వేగంగా సాగుతోంది. సెకండ్‌ వేవ్‌ అని పిలుస్తున్న ప్రస్తుత సమయంలో గతంలో కన్నా ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. సామాన్య ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీవిల్లిపుత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీఎస్‌డబ్ల్యూ మాధవరావు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం.. ఎన్నికల వల్ల జరుగుతున్న నష్టానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మాధవరావు లాంటి అనేక మంది పోటీదారులు, పార్టీల కార్యకర్తలు, ప్రజలు కరోనా బారిన పడ్డారు, ఇంకా పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల తర్వాత.. ఏపీలో కరోనా కేసులు నమోదు శాతం భారీగా పెరిగింది. ఫిబ్రవరిలో రోజు వారీ కేసులు 30 లోపు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య మూడు వేలకుపైగా నమోదైంది.

ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో కరోనా వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పలువురు నేతలు వైరస్‌ బారిన పడ్డారు. తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు అనిత, సంథ్యారాణిలకు వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ వ్యక్తిగత, భద్రత సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. దాంతో జనసేన అధినేత ప్రచారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పవన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్‌ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలలో పోలింగ్‌ పూర్తయింది. ఈ నెల 29వ తేదీ లోపు బెంగాల్‌లోనూ పోలింగ్‌ తంతు ముగుస్తుంది. ఈ ఐదు రాష్ట్రాలలో కరోనా బారిన పడే రాజకీయ నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read : కరోనా అలజడి : క్వారంటైన్‌లోకి జనసేన అధినేత ‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp