గ్రామాల్లో కరోనా చిచ్చు.. బాధ్యులెవరు..?

By Jaswanth.T Apr. 03, 2020, 09:45 pm IST
గ్రామాల్లో కరోనా చిచ్చు.. బాధ్యులెవరు..?

ఎంత మత విద్వేషాలు రగిలినప్పటికీ గ్రామస్థాయిలో ముస్లింలు, ఇతర మత సమూహాల మధ్య పెద్దగా విబేధాలు తలెత్తిన దాఖలాల్లేవనే చెప్పాలి. అందులోనూ ఉభయ తెలుగు రాష్ట్రాలోనూ సున్నితమైన కొన్ని ప్రాంతాలు మినహా, మిగిలిన చోట్ల ముస్లింలు, ఇతర మతాల వారు కలిసిమెలిసే ఉంటారన్నది తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కోరానా మహ్మారి ఇప్పుడు దేశంలో ముస్లింలు, ఇతర మతస్తుల మధ్య కన్పించని తెరను అడ్డులేపింది.

ఢిల్లీలోని మర్కజ్‌ తబ్లిగీకి హాజరైన వారి ద్వారానే అత్యధికంగా కరోనా కేసులు బైటపడుతుండడంతో ఇప్పుడీ పరిస్థితి దాపురించింది. అవకాశం దొరికింది కదాని అనేకానేక సందేహాలు రేకెత్తిస్తూ.. ప్రజలను ఒక ఆలోచనకు నిలబడనీయకుండా చేసే ప్రచారాలకు కూడా ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం వరకు కేవలం 11 కరోనా పాజిటివ్‌ కేసులతో సేఫ్‌ ప్లేస్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితి అంచున నిలబడాల్సి వచ్చింది. ఇందుకు కరోనా భారిన పడ్డవారి ప్రమేయం తెలియకుండానే ఉందనుకునే వాళ్ళుకొందరుంటే, కాదు కావాలనే వ్యాప్తి చేసారనే వాళ్ళు ఉన్నారు.

ప్రాణాలకు ముప్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రెండో వాదన వైపే ఇప్పుడు కాస్త మొగ్గు కన్పించే పరిస్థితులు కూడా కన్పిస్తున్నాయి. ఇది ఎంతలా ఉందంటే.. గ్రామాల్లో ముస్లింలను సందేహంగా చూసేంత దారుణంగా తయారైంది. ఇది వారిపై అత్యంత తీవ్రస్థాయిలోనే ఒత్తిడిని కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, కేజ్రీవాల్‌ మధ్యనున్న రాజకీయ ఆగాధంలో నుంచి ఏర్పడిందే ఈ ఉపద్రవం అని చెప్పాల్సిందే. జరిగిన తప్పుకు ఆయా వర్గాలు ఎవరి సమర్ధనీయ వాదన వారు విన్పిస్తున్నారు. కానీ కరోనా కారణంగా బలయ్యేవారు, వివక్ష భారిన పడుతున్నవారు, భయాందోళనల్లో ఉన్నవారికి ఈ ఇరు వర్గాలు జవాబు చెప్పి తీరాల్సిందే.

ఇప్పుడు తప్పు జరిగిందని భావిస్తున్నారు కాబట్టి ఒకళ్ళమీదికొకళ్ళు నెపాన్ని నెట్టుకుంటారు. కానీ ఇతర దేశస్తులు విజిటింగ్‌ వీసాతో ఇక్కడికొచ్చి మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటుంటే, అది కూడా అనేక ఏళ్ళుగా సాగుతుంటే రాజ్యం ఏం చేస్తోంది. తెలిసి వదిలేసారా? అలా వదిలేయడం వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితికి ఎవరు బాద్యత వహిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం దాటవేయడం కుదరని పని. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ముస్లింలు, ఇతర మతస్థులకు మధ్య కరోనా కారణంగా ఏర్పడిన అపోహల తెరను తొలగించే బాద్యతను ఎవరు తీసుకుంటారన్నదే ఇప్పటి ప్రశ్న. ఈ బాధ్యతను కూడా పక్కన పెట్టేసి రాజకీయ ఆరోపణలతోనే ఆయా వర్గాలు కాలక్షేపం చేయడం అత్యంత దారుణమైన దివాళాకోరుతనం. కొందరు తమ అతి ప్రవర్తనతో చేసిన తప్పులు గ్రామీణ స్థాయిలోని వారి జీవితాలను అయోమయంలోకి నెట్టేయడం అమానవీయ ఘటనగానే మిగిలిపోతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp