ఊరు చుట్టూ కంచెలు ,అస‌లుకే ఎస‌రు తెచ్చే ప్ర‌మాదం

By iDream Post Mar. 26, 2020, 07:33 am IST
ఊరు చుట్టూ కంచెలు ,అస‌లుకే ఎస‌రు తెచ్చే ప్ర‌మాదం

క‌రోనా భ‌యాందోళ‌న దేశాల మ‌ధ్య‌నే కాదు..గ్రామాల మ‌ధ్య కూడా స‌రిహ‌ద్దులు ఏర్పాటు చేస్తోంది. అనేక చోట్ల ప‌లువురు గ్రామ‌స్తులు స్వ‌చ్ఛందంగా క‌దులుతున్నారు. త‌మ ఊరి చుట్టూ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇత‌రుల‌కు ప్ర‌వేశం లేద‌ని బోర్డులు పెడుతున్నారు. లాక్ డౌన్ ప్ర‌క‌టించిన 21 రోజుల వ‌ర‌కూ ఊరిలోకి రావ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఇది కొంద‌రికి ఉత్సాహాన్నిస్తోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని పాటిస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా ఈ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

కానీ ఒక‌సారి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డితే ఏమిటి ప‌రిస్థితి..ఇలాంటి స్థితిలో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర స‌రుకులు వంటివి ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుంది. వాటికోసం ఎక్క‌డిక్క‌డ రోడ్లు బ్లాక్ చేస్తే వాహ‌నాలు వెళ్ల‌డం పెద్ద స‌మ‌స్య అవుతుంది. అందుకు తోడుగా ఎవ‌రికైనా వైద్య స‌హాయం అందించాల్సి వ‌స్తే వారిని రోడ్డుకి తీసుకురావ‌డం కూడా పెద్ద స‌మ‌స్య అవుతుంది. ఇంకా ఇత‌ర అవ‌స‌రాల కోసం కూడా రాక‌పోక‌లు అనివార్యం. అలాంటి స‌మ‌యంలో తోచిందే త‌డువుగా కొంద‌రు రోడ్లు త‌వ్వ‌డం వంటివి చేప‌డుతున్నారు. ఇది మ‌రింత ప్ర‌మాదం. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు పెద్ద అడ్డంకిగా మారుతుంద‌నే విష‌యాన్ని కొంద‌రు గ్ర‌హించ‌డం లేదు.

గ్రామాల్లోకే కాదు..దేశంలోకి కూడా ఎవ‌రినీ అనుమ‌తించడం లేదు ప్ర‌భుత్వం. కానీ అక్క‌డ కొత్త‌గా కంచెలు వేయ‌డం, రోడ్లు త‌వ్వ‌డం వంటివి చేప‌ట్ట‌డం లేదు. త‌గిన భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తుంది. ఏ ఊరిలోన‌యినా అలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని భావిస్తే దానికి త‌గ్గ‌ట్టుగా వంతుల వారీగా ఒక‌రిద్ద‌రు కాప‌లా ఉండ‌డం మంచిదే గానీ ఇలా మొద‌టికే ఎస‌రు పెట్టే ప్ర‌య‌త్నం కొన్ని సంద‌ర్భాల్లో కొత్త స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో ప్ర‌భుత్వం కూడా చూసీ చూడ‌న‌ట్టుగా ఉంది. ఇది కూడా కొంత స‌మ‌స్య‌కు కార‌ణం కావ‌చ్చు. త‌క్ష‌ణం అలాంటివి నివారించాలి. భ‌విష్య‌త్తులో ఎలాంటి అవ‌స‌రం వ‌స్తుందోన‌నే విష‌యం గ‌మ‌నంలో ఉంచుకుని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలే త‌ప్ప మొత్తం రోడ్లు బ్లాక్ చేసే విధానం స‌రికాద‌ని చెప్పాలి. త‌ద్వారా సామాన్యుల్లో ఉన్న ఆందోళ‌న‌ను చ‌ల్లార్చేందుకు య‌త్నించాలి. ఇది మాత్ర‌మే ఎలాంటి ప‌రిస్థితిన‌యినా ఎదుర్కోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌నే విష‌యం గ్ర‌హించాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp