ఉత్తరప్రదేశ్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్

By Srinivas Racharla Jul. 19, 2020, 05:56 pm IST
ఉత్తరప్రదేశ్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్

ఢిల్లీ గద్దెను అధిష్టించాలంటే 80 పార్లమెంటరీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై పట్టు సాధించాలని కాంగ్రెస్ దృఢంగా సంకల్పించినట్లు ఉంది .2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలలో తన బలాన్ని నిరూపించుకొని 2024 సాధారణ ఎన్నికలకు ముందు తమ కార్యకర్తలలో మనో ధైర్యాన్ని నింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తుంది.

గత కొంత కాలంగా తన శక్తియుక్తులను పూర్తిస్థాయిలో యూపీ రాజకీయాలపై కేంద్రీకరించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పనిచేస్తుంది.యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ విమర్శల వర్షం కురిపిస్తుంది.ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాని అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.2022 ప్రారంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఆమె నాయకత్వంలోనే అమీ తుమీ తెలుసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద్ యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని అధిష్ఠానం ఫైనల్ చేసిందని ప్రకటించారు.

శనివారం విలేకరులు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు జితిన్ ప్రసాద్ ను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎంపిక చేసిందా..? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా " ఇది కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్.ప్రియాంక గాంధీ చరిష్మాతో యూపీ ఎన్నికలను ఎదుర్కోవాలని కార్యకర్తలు ఎంతో కాలంగా ఆకాంక్షిస్తున్నారు.కానీ ఈ అంశంపై సీడబ్ల్యూసీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటుంది.అందుకు ప్రియాంక కూడా అంగీకరించారు’’ అని జితిన్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఇక యోగి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం "హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్" అని మాజీ కేంద్ర మంత్రి నిందిస్తూ,నేను బ్రాహ్మణ హత్యల గురించి మాట్లాడాను.కానీ బాధితులలో ఎక్కువమంది (నేరాలకు) బ్రాహ్మణులు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటి?"అని ఆయన ప్రశ్నించారు.అలాగే వికాస్ దూబే ఎన్‌కౌంటర్ నకిలీగా కనబడుతోంది, ప్రభుత్వ ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది.ఇప్పటికే మేము (కాంగ్రెస్) ఎస్సీ పర్యవేక్షణలో విచారణను డిమాండ్ చేశాము.ఇక వికాస్ దుబేను ఇంత పెద్ద క్రిమినల్ గా మార్చడానికి ఎవరు కారణం...? అని జితిన్ ప్రసాద్ బిజెపి ప్రభుత్వంపై ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు.

ప్రియాంక గాంధీని బిజెపి నేతలు ట్విట్టర్ లీడర్‌గా విమర్శించడంపై జితిన్ ప్రసాద్ మండిపడ్డారు. సమస్యల నుంచి కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికే బిజెపి ప్రియాంక గాంధీపై విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు.యోగి ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగోలేదని, సాధించిన ప్రగతి సున్నా అని దానిని కప్పిపుచ్చడానికి ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆరోగ్యం,మౌలిక సదుపాయాలు,గ్రామీణాభివృద్ధి వంటి రంగాలలో యోగి ప్రభుత్వం యుపి ప్రజల కోసం ఏమి చేశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

బ్రాహ్మణ,దళితులను ఆకట్టుకునేందుకు ప్రణాళిక:

యూపీలో కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కొన్ని వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తూ తమ నుండి దూరమైన సామాజిక వర్గాలలో తిరిగి పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది.ముఖ్యంగా వికాస్ దూబె ఎన్ కౌంటర్ తర్వాత బ్రాహ్మణ చెత్నా పరిషత్ సమావేశాలలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బ్రాహ్మణ హంతకుడిగా మెజార్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.దీంతో బిజెపి వెనుక ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.దీనితో పాటు బహుజన సమాజ్ వాది పార్టీ నేత మాయావతి పట్ల దళితులలో ఏర్పడిన అపనమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది. దళితుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది.

మరోవైపు యూపీలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహం సిద్ధం చేసిన కాంగ్రెస్ అధిష్టానం బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టింది.అలాగే ప్రతి జిల్లాలోని ప్రజలతో మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి అభిప్రాయాలను సేకరించి వాటి పరిష్కారానికి సలహాలు స్వీకరిస్తుంది.వర్చువల్ సమావేశాలు నిర్వహించడంలో బిజెపి కంటే వెనకబడిన కాంగ్రెస్ వర్చువల్ మీటింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది.ఇప్పటికే జితిన్ ప్రసాద్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవడానికి 'కైస్ హైన్ ఆప్' కార్యక్రమం ప్రారంభించబడింది.

అయితే 2019 లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి యూపీలో పునర్జీవం పొయ్యడం ప్రియాంకకు కత్తి మీద సాములాంటిదేనని చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp