కాంగ్రెస్ చాణుక్యుడు, తెర వెనక మాంత్రికుడు అహ్మద్ పటేల్.

By Krishna Babu Nov. 25, 2020, 05:14 pm IST
కాంగ్రెస్ చాణుక్యుడు, తెర వెనక మాంత్రికుడు అహ్మద్ పటేల్.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో అత్యంత ప్రముఖుడైన అహ్మద్ పటేల్ మరణంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయల్లో ఒక శకం ముగిసింది. గాంధీ కుటుంభానికి విధేయుడిగా, సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా , ముఖ్య సలహాదారుడిగా, ట్రబుల్ షూటర్ గా, 5సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకే అంకితం ఇచ్చిన ఆయన మరణం ఆపార్టీకి తీరని లోటనే చెప్పాలి. అక్టోబర్ 1న కరోనా మహమ్మారి సోకడంతో గురుగ్రాం లోని వేదాంతా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అహ్మద్ పటేల్ నేటి తెల్లవారుజామున 3:30 నిమషాలకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యుర్ కారణంగా తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.

గుజరాత్ లోని భరూచ్ లో 1949 ఆగస్టు 21 న జన్మించిన అహ్మద్ పటేల్ . కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన యూత్ కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు. కొద్ది కాలంలోనే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు ఆ తరువాత అత్యంత చిన్న వయస్సులో 28 ఏళ్ళకే ఇందిరా గాంధీ ఆశీస్సులతో 1977 లో భరూచ్ నుండి పార్లమెంట్ అభ్యర్ధిగా ఎన్నికలలో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో గుజరాత్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ జండాను ఎగరవేస్తూ భారీ మేజారిటితో గెలుపొందడంతో అహ్మద్ పటేల్ అందరి దృష్టిని ఆకర్శించారు. ఆ తరువాత అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. గుజరాత్ లోక్సభ ఎంపిగా ఎహ్సాన్ జాఫ్రీ ఎన్నికైన తరువాత అహ్మద్ పటేల్ రెండవ ముస్లిం కావడం గమనార్హం. 1985 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.

గాంధీ కుటుంభం అహ్మద్ పటేల్ ను తమకు అత్యంత ఆప్తుడుగా పరిగణించడం ప్రారంభించింది రాజీవ్ గాంధీ హయాం నుంచే. నెహ్రూ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జవహర్ భవన్ ను రాజీవ్ గాంధీ ఆదేశాలమేరకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో ఆ కుటుంబానికి ఆప్తుడిగా మారారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ పార్టీలో తన స్థానాన్ని నిలుపుకుని ఏక్చత్రాదిపత్యం కొనసాగిస్తున్నారంటే తెరవెనక మంత్రాంగం అంతా అహ్మద్ పటేలే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ లో ఇంత కీలక సభ్యుడిగా ఉన్నా ఒక్కసారి కూడా మంత్రి పదవులు ఆశించలేదు. గాంధీ కుటుంబంలోని మూడు తరాలతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇలా మహమ్మారి బారిన పడి దివంగతులు అవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే.. కాంగ్రెస్ కష్ట కాలంలో తెరవెనుక మంత్రాంగం నడిపి విజయతీరాలకు చేర్చగల అహ్మద్ పటేల్ లాంటి ట్రబుల్ షూటర్ పాత్ర ఇక కాంగ్రెస్ లో ఎవరు పోషిస్తారో అనేది ప్రశ్నార్ధకం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp